Telugu Global
Sports

మహిళాటెస్టులో భారత్ రికార్డుల మోత!

ఇంగ్లండ్ తో నవీముంబై వేదికగా జరుగుతున్న ఏకైక మహిళా టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే భారత్ రికార్డుల మోత మోగించింది.

మహిళాటెస్టులో భారత్ రికార్డుల మోత!
X

ఇంగ్లండ్ తో నవీముంబై వేదికగా జరుగుతున్న ఏకైక మహిళా టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే భారత్ రికార్డుల మోత మోగించింది.

గత రెండేళ్లకాలంలో తొలిటెస్టుమ్యాచ్ ఆడుతున్నభారత మహిళాజట్టు తొలిరోజు ఆటలోనే పలు అరుదైన రికార్డులు నమోదు చేసింది. ఇంగ్లండ్ తో నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ నాలుగురోజుల టెస్టుమ్యాచ్ లో కీలక టాస్ నెగ్గిన భారతజట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని రికార్డు స్కోరు సాధించింది.

ముగ్గురు యువప్లేయర్ల టెస్టు అరంగేట్రం.....

భారత గడ్డపై గత తొమ్మిదేళ్ల కాలంలో తొలిటెస్టుమ్యాచ్ ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ముగ్గురు ప్లేయర్లకు టెస్ట్ క్యాప్ లు అందించింది.

పేస్ బౌలర్ రేణుకా సింగ్ తో పాటు యువబ్యాటర్లు జెమీమా రోడ్రిగేజ్, శుభా సతీశ్ టెస్టు అరంగేట్రం చేశారు.

తమ తొలిమ్యాచ్ లోనే కీలక భాగస్వామ్యాలతో పాటు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా శుభ, జెమీమా భారతజట్టు భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించారు.

మిడిలార్డర్ టాప్ గేర్.....

భారత ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలీ వర్మ తక్కువ స్కోర్లకే అవుటైనా..వన్ డౌన్ శుభ సతీశ్, రెండో డౌన్ జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ పరుగుల మోత మోగించడంతో భారత్ తొలిరోజుఆటలోనే 7 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

శుభ- జెమీమా జోడీ మూడో వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. శుభ 76 బంతుల్లోనే 13 బౌండ్రీలతో మెరుపు హాఫ్ సెంచరీతో వారేవ్వా అనిపించుకొంది. అరంగేట్రం మ్యాచ్ లోనే 69 పరుగులతో శుభారంభం చేసింది.

మరోవైపు..జెమీమా సైతం 99 బంతుల్లో 11 బౌండ్రీలతో 68 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 81 బంతుల్లో 6 ఫోర్లతో 49 పరుగులకు రనౌట్ కాగా..వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా 88 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్ తో 66 పరుగులకు అవుటయ్యింది.

ఆల్ రౌండర్ దీప్తి శర్మ95 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఓ సిక్సర్ తో 60 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచింది. స్నేహరాణా 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పూజా వస్త్రకర్ 4 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ మొదటి రోజు ఆటలో 94 ఓవర్లు ఎదుర్కొని 410 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

88 ఏళ్ల టెస్టు చరిత్రలో రెండోజట్టు భారత్...

88 సంవత్సరాల మహిళా టెస్టు చరిత్రలో ఒక్కరోజు ఆటలో 400కు పైగా పరుగులు సాధించిన రెండోజట్టుగా భారత్ రికార్డుల్లో చేరింది. 1935లో న్యూజిలాండ్ పై క్రైస్ట్ చర్చి లాంకెస్టర్ పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 431 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఒక్కరోజు ఆటలోనే 400కు పైగా పరుగులు సాధించిన రెండోజట్టుగా భారత్ నిలిచింది.

2014లో దక్షిణాఫ్రికా పై 9 వికెట్లకు 400 పరుగులతో అత్యధిక టెస్టు స్కోరు సాధించిన భారత్ ..ప్రస్తుత టెస్టులో 410 పరుగుల స్కోరుతో తన రికార్డును తానే మెరుగుపరచుకోగలిగింది.

అరంగేట్రం ఇన్నింగ్స్ లోనే శుభ రికార్డు...

కర్నాటక బ్యాటర్ శుభ సతీశ్ తన అరంగేట్రం టెస్టు ఇన్నింగ్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా హేమాహేమీల సరసన నిలిచింది. మహిళా టెస్టు చరిత్రలోనే నాలుగో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా రికార్డుల్లో చోటు సంపాదించింది.

కేవలం 76 బంతుల్లోనే 69 పరుగులు సాధించిన శుభ..టెస్టుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత రెండో బ్యాటర్ గా నిలిచింది. 40 బంతుల్లోనే టెస్టు హాఫ్ సెంచరీ సాధించిన భారత రికార్డు సంగీత డబీర్ పేరుతో ఉంది.

టెస్టు అరంగేట్రంమ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాదిన 12వ భారత మహిళా క్రికెటర్ గా కూడా శుభ హేమాహేమీల వరుసలో నిలిచింది.

నాలుగురోజుల ఈ టెస్టుమ్యాచ్ రెండోరోజు ఆటలో దీప్తి శర్మ శతకం పూర్తి చేసినా..లేక భారత్ 450కి పైగా స్కోరు సాధించినా..ఇంగ్లండ్ కు కష్టాలు తప్పవు.

First Published:  15 Dec 2023 3:31 AM GMT
Next Story