Telugu Global
Sports

తొలివన్డేలో భారత్ కు బంగ్లా ఝలక్!

క్రికెట్లో జయాపజయాలకు ర్యాంకింగ్స్ తో ఏమాత్రం పనిలేదని 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ మరోసారి నిరూపించింది.

తొలివన్డేలో భారత్ కు బంగ్లా ఝలక్!
X

క్రికెట్లో జయాపజయాలకు ర్యాంకింగ్స్ తో ఏమాత్రం పనిలేదని 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ మరోసారి నిరూపించింది. తీన్మార్ సిరీస్ లో భాగంగా జరిగిన తొలివన్డేలో 4వ ర్యాంకర్ భారత్ పై ఒక వికెట్ తో సంచలన విజయం సాధించింది.

వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్, 4వ ర్యాంకర్ భారత్..బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది. ఢాకాలోని మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో ఆతిథ్య బంగ్లాదేశ్ ఓటమి అంచుల నుంచి బయటపడి ఒక్క వికెట్ తో హాట్ ఫేవరెట్ భారత్ ను కంగుతినిపించింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

Advertisement

మీర్పూర్ స్లోవికెట్ పై టాస్ నెగ్గి ముందుగా పీల్డింగ్ ఎంచుకొన్న బంగ్లాజట్టు ప్రత్యర్థి భారత్ ను 186 పరుగులకే కుప్పకూల్చింది. సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ విఫలం కాగా..మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ 73 పరుగులతో భారత్ 186 పరుగుల స్కోరు సాధించగలిగింది. వన్డే క్రికెట్లో రాహుల్ కు ఇది 11వ హాఫ్ సెంచరీ. బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు, పేసర్ ఇబాదత్ హుస్సేన్ 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.

Advertisement

భారత్ ప్రత్యర్థిగా లెఫ్టామ్ స్పిన్నర్ షకీబుల్ హసన్ కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం.

భారత్ బలహీనతను సొమ్ము చేసుకొన్న బంగ్లా...

భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బంగ్లాజట్టు 187 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌల్ చేసి బంగ్లాటాపార్డర్ ను చిక్కుల్లోకి నెట్టారు. ఓపెనర్ కమ్ కెప్టెన్ లిట్టన్ దాస్ ఒక్కడే 41 పరుగులు సాధించాడు. విజయానికి 51 పరుగుల దూరంలో బంగ్లాజట్టు మొదటి 9 వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లోకి కూరుకుపోయింది.

అయితే...టెయిల్ ఎండర్లు మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ ఆఖరి వికెట్ కు రికార్డు భాగస్వామ్యంతో తమజట్టుకు అనూహ్య విజయం అందించారు. టాపార్డర్ ఆటగాళ్లను వెంటవెంటనే పడగొట్టడం, టెయిల్ ఎండర్లకు పరుగులు సమర్పించుకోడం భారత్ కు అనాదిగా ఓ ప్రధాన బలహీనతగా వస్తోంది. ఆ లోపాన్ని ప్రస్తుత ఈ మ్యాచ్ లో సైతం బంగ్లా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు చక్కగా సొమ్ము చేసుకోగలిగారు.

ముస్తాఫిజుర్ 11 బాల్స్ లో 10 పరుగుల నాటౌట్ స్కోరు సాధించగా...మెహిదీ హసన్ 39 బాల్స్ లో 38 పరుగుల నాటౌట్ స్కోరుతో బంగ్లాజట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఓవైపు తన వికెట్ కాపాడుకొంటూ, మరోవైపు సమయోచితంగా స్ట్ర్రయిక్ రొటేట్ చేస్తూ మహ్మదీ హసన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. విజయానికి కావాల్సిన 51 పరుగులను ముస్తాఫిజుర్ తో జంటగా అందించడమే కాదు..అజేయంగానూ నిలిచాడు.

భారత్ ను ముంచిన రాహుల్ కీపింగ్..

స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను పక్కనపెట్టి..స్టాప్ గ్యాప్ వికెట్ కీపర్ గా రాహుల్ ను తీసుకోడం ద్వారా భారత్ భారీమూల్యమే చెల్లించింది. బంగ్లామ్యాచ్ విన్నర్ మెహిదీ హసన్ ఇచ్చిన క్యాచ్ ను రాహుల్ జారవిడవడంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీనికితోడు ఫీల్డింగ్ లో పొరపాట్లు సైతం భారత్ ఓటమికి, బంగ్లా విజయానికి కారణమయ్యాయి. ఒక దశలో కేవలం 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు నష్టపోయిన బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్ల నష్టానికి ఓటమి తప్పదన్న స్థితిలో పడిపోయింది.

ఆఖరి వికెట్ ను పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలం కావడం భారత్ ను దెబ్బతీసింది.

సిరీస్ లోని రెండోవన్డే..మీర్పూర్ స్టేడియం వేదికగానే డిసెంబర్ 7న జరుగనుంది.

Next Story