Telugu Global
Sports

ఇషాన్ డబుల్, ఆఖరి వన్డేలో శివమెత్తిన భారత్!

IND v BAN, 3rd ODI: బంగ్లాదేశ్ తో ఆఖరివన్డేలో భారత్ శివమెత్తి ఆడింది. రికార్డుల మోతతో 227 పరుగుల అతిపెద్ద విజయం నమోదు చేసింది. సిరీస్ చేజారినా కంటితుడుపు గెలుపుతో పరువు దక్కించుకోగలిగింది.

ఇషాన్ డబుల్, ఆఖరి వన్డేలో శివమెత్తిన భారత్!
X

బంగ్లాదేశ్ తో ఆఖరివన్డేలో భారత్ శివమెత్తి ఆడింది. రికార్డుల మోతతో 227 పరుగుల అతిపెద్ద విజయం నమోదు చేసింది. సిరీస్ చేజారినా కంటితుడుపు గెలుపుతో పరువు దక్కించుకోగలిగింది...

బంగ్లాదేశ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను ఓటమితో మొదలుపెట్టిన భారత్ గెలుపుతో ముగించింది. 2-1తో సిరీస్ చేజారినా...చోటాగ్రామ్ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో కళ్లు చెదిరే విజయం సాధించింది.

మీర్పూర్ వేదికగా జరిగిన తొలివన్డేలో ఒక వికెట్ తేడాతో, రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో వరుస పరాజయాలు చవిచూసి తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న భారత్..పరువు కోసం ఆడిన ఆఖరివన్డేలో శివమెత్తి పోయింది. 409 పరుగుల భారీస్కోరు నమోదు చేయటమే కాదు..227 పరుగుల అతిపెద్ద విజయంతో ప్రత్యర్థిని బంగాళాఖాతంలో నిలువునా ముంచింది.

ఇషాన్, విరాట్ షో...

చిట్టగాంగ్ లోని చోటాగ్రామ్ జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియం వేదికగా జరిగిన ఈ ఆఖరివన్డేలో భారతజట్టు రెండుమార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్

దీపక్ చహార్ గాయాలతో జట్టు నుంచి వైదొలగడంతో..రాహుల్ నాయకత్వంలో భారత్ పోటీకి సిద్ధమయ్యింది. తుదిజట్టులోకి ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ను, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లను చేర్చుకొంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయినా..రెండో వికెట్ కు ఇషాన్- విరాట్ సాధించిన రికార్డు భాగస్వామ్యంతో అతిపెద్ద స్కోరుకు పునాది వేసుకొంది.

ఇషాన్ - విరాట్ జోడీ మూడో వికెట్ కు 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇషాన్ కేవలం 131 బాల్స్ లోనే 24 బౌండ్రీలు, 10 సిక్సర్లతో సహా 210 పరుగులతో మెరుపు డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

మరోవైపు దిగ్గజ బ్యాటర్ విరాట్ తన కెరియర్ లో 72వ శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 409 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

3వ అత్యుత్తమ భాగస్వామ్యం..

ఇషాన్- విరాట్ జోడీ 3వ వికెట్ కు సాధించిన 290 పరుగుల భాగస్వామ్యం..వన్డే క్రికెట్ చరిత్రలోనే 7వ అతిపెద్ద భాగస్వామ్యంగా, భారత వన్డేల్లో 3వ అత్యుత్తమ రికార్డుగా రికార్డుల్లో చేరింది.

అంతేకాదు..వన్డేలలో ద్విశతకం బాదిన 7వ బ్యాటర్ గా, నాలుగో భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ కలసి ఐదు ద్విశతకాలు బాదితే..ఇప్పుడు ఇషాన్ వచ్చి వారి సరసన చేరాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, కరీబియన్ థండర్ క్రిస్ గేల్, పాక్ టాపార్డర్ ఆటగాడు ఫకర్ జమాన్ సైతం వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన మొనగాళ్లలో ఉన్నారు.

బంగ్లా టపటపా...

భారత బ్యాటర్ల ప్రతాపం చవిచూసిన బంగ్లాదేశ్ 410 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగి..34 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలిపోయింది. షకీబుల్ హసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ , సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, బంగ్లాజట్టు సిరీస్ నెగ్గడంలో ప్రముఖపాత్ర పోషించిన మెహిదీ కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

చోటాగ్రామ్ వేదికగా ఈనెల 14 నుంచి భారత్- బంగ్లాజట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  10 Dec 2022 2:18 PM GMT
Next Story