Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో టాప్ సీడ్ కు షాక్!

2023 తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో సైతం టాప్ సీడ్ స్టార్ గల్లంతయ్యింది.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో టాప్ సీడ్ కు షాక్!
X

2023 తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో సైతం టాప్ సీడ్ స్టార్ గల్లంతయ్యింది..

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో అప్ సెట్ల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ లో మాత్రమే కాదు..మహిళల సింగిల్స్ లో సైతం సీడెడ్ స్టార్ల పరాజయాలు కొనసాగుతున్నాయి.

మొన్ననడాల్..నేడు స్వయిటెక్...

పురుషుల సింగిల్స్ లో టాప్ సీడ్ రాఫెల్ నడాల్ రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టిన రెండురోజుల వ్యవధిలోనే మహిళల సింగిల్స్ లో సైతం టాప్ సీడ్ ఇగా స్వయిటెక్ అనూహ్య ఓటమి చవిచూసింది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా, టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన పోలిష్ ప్లేయర్ ఇగా స్వయిటెక్ పోరు నాలుగోరౌండ్లోనే ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగిన

పోరులో కజకిస్థాన్ ప్లేయర్ ఎలెనా రిబకినా వరుస సెట్లలో 6-4, 6-4తో టాప్ సీడ్ స్టార్ ను కంగు తినిపించింది.

2022 వింబుల్డన్ చాంపియన్ రిబకినా కేవలం గంటా 29నిముషాలలోనే టాప్ సీడ్ స్వయిటెక్ ను చిత్తు చేసింది. 22వ సీడ్ గా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచిన రిబకినా ఆల్ కోర్టు గేమ్ తో చెలరేగిపోయింది. రిబకినా దూకుడును అడ్డుకోడంలో ప్రపంచ నంబర్ వన్ స్వయిటెక్ విఫలమయ్యింది.

క్వార్టర్ ఫైనల్లో జెలెనా ఓస్టాపెంకోతో రిబకినా తలపడాల్సి ఉంది.

అంతకుముందు జరిగిన మరో నాలుగోరౌండ్ పోరులో అమెరికన్ ప్లేయర్ , 7వ సీడ్ కోకో గాఫ్ ను ఓస్టాపెంకో ఇంటిదారి పట్టించింది.

మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన ప్లేయర్ కు ట్రోఫీతో పాటు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు.

జోకోవిచ్ టాప్ గేర్...

పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్ కు మాజీ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ అలవోకగా చేరుకోగా..గతేడాది రన్నరప్ డానిల్ మెద్వదేవ్ పోరు మూడోరౌండ్లోనే ముగిసింది.

రెండుసార్లు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ రన్నరప్ మెద్వదేవ్ పై అమెరికాకు చెందిన 31వ ర్యాంక్ ప్లేయర్ సెబాస్టియన్ కోర్డా సంచలన విజయం సాధించాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన మూడుసెట్ల సమరంలో కోర్డా 7-6, 6-3, 7-6తో విజేతగా నిలిచాడు.

క్వార్టర్ ఫైనల్లో పోలిష్ ఆటగాడు, 10వ సీడ్ హ్యూబెర్ట్ హుర్కాజ్ తో కోర్డా అమీతుమీ తేల్చుకోనున్నాడు.

పురుషుల సింగిల్స్ లో గతేడాది విన్నర్ నడాల్, రన్నరప్ మెద్వదేవ్ క్వార్టర్ ఫైనల్స్ కు ముందే నిష్క్ర్రమించడంతో..తొమ్మిదిసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ హాట్ ఫేవరెట్ గా నిలిచాడు. రికార్డుస్థాయిలో 10వసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాలని కలలు కంటున్నాడు.

నిప్పులు చెరిగే ఎండవేడి వాతావరణంలో ప్రస్తుత సీజన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతున్నాయి. నిర్వాహక సంఘం తెల్లవారుజాము నుంచే పోటీలు నిర్వహిస్తూ వస్తోంది.

First Published:  22 Jan 2023 7:46 AM GMT
Next Story