Telugu Global
Sports

విశ్వవిజేత ఆస్ట్రేలియాకు డబ్బే డబ్బు!

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ అందుకొంది. 83 కోట్ల రూపాయల మొత్తంలో సింహభాగం కంగారూ జట్టుకే దక్కింది.

విశ్వవిజేత ఆస్ట్రేలియాకు డబ్బే డబ్బు!
X

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ అందుకుంది. 83 కోట్ల రూపాయల మొత్తంలో సింహభాగం కంగారూ జట్టుకే దక్కింది.

ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ క్రికెట్ పోటీలంటే కేవలం పరుగులు, రికార్డులు మాత్రమే కాదు..వేల కోట్ల రూపాయల వ్యాపారం. క్రికెట్ సంఘాలకు, ఆటగాళ్లకు కోట్ల రూపాయలు, నిర్వాహక ఐసీసీ, బీసీసీఐలకు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ఏ జట్టుకు ఎంతెంత?

48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే గతంలో ఎన్నడూలేనంతగా 2023 టోర్నీకి రికార్డు స్థాయిలో 83 కోట్ల 13 లక్షల 10వేల 500 రూపాయల మొత్తాన్ని ప్రైజ్ మనీగా ఐసీసీ కేటాయించింది.

48 మ్యాచ్ లుగా సాగిన ఈ టోర్నీలో ఆతిథ్య భారత్ తో సహా మొత్తం 10 జట్లు తలపడితే లీగ్ దశలో విజయం సాధించిన జట్ల నుంచి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు వరకూ వేర్వేరుగా ప్రైజ్ మనీని కేటాయించారు.

45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ లో తలపడిన ప్రతి జట్టూ కనీసం రెండేసి విజయాలతో కోటీ 25 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీని సొంతం చేసుకోగలిగింది.

సింహభాగం ఆ రెండు జట్లకే...

మొత్తం 83 కోట్ల రూపాయల రికార్డు మొత్తంలో అధికభాగాన్ని విన్నర్ గా నిలిచిన ఆస్ట్రేలియా, రన్నరప్ భారత్ జట్లే దక్కించుకొన్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే చాంపియన్ జట్టుకు 4 మిలియన్ డాలర్లు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 2 మిలియన్ డాలర్లు చొప్పున ఇస్తామని ఐసీసీ ప్రకటించింది.

లీగ్ దశలో సాధించిన ప్రతి విజయానికి 66 లక్షల రూపాయల చొప్పున, సెమీస్ లో పరాజయం పొందిన రెండు జట్లకూ చెరో 8 లక్షల డాలర్లు చొప్పున ప్రైజ్ మనీ సొంతమైంది.

పది జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో భారత్ 9 విజయాలు, ఆస్ట్రేలియా 7 విజయాల రికార్డుతో నిలిచాయి. రెండు మ్యాచ్ ల నాకౌట్ రౌండ్లో భారత్ సెమీస్ నెగ్గగా..ఆస్ట్రేలియా రెండుకు రెండు మ్యాచ్ ల్లోనూ విజేతగా నిలవడం ద్వారా రికార్డు స్థాయిలో 6వ సారి ప్రపంచకప్ అందుకోగలిగింది.

లీగ్ దశలో సాధించిన 7 విజయాలకు 2 లక్షల 80వేల డాలర్లు, విజేతగా నిలవడం ద్వారా 4 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ ఆస్ట్రేలియా పరమయ్యాయి. మొత్తం 6లక్షల 80 వేల డాలర్లు (సుమారు 38 కోట్ల రూపాయలు ) ప్రైజ్ మనీని ఆస్ట్రేలియా అందుకొంది.

భారత్ కు 22 కోట్ల రూపాయలు...

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో చెలరేగి సెమీస్ విజయం తర్వాత టైటిల్ సమరంలో బోల్తా కొట్టిన భారత్ కు 236 మిలియన్ డాలర్లు సొంతమయ్యాయి. లీగ్ దశ విజయాలకు 5 కోట్ల 50 లక్షల రూపాయలు, రన్నరప్ గా 16 కోట్ల 62 లక్షల 54వేల 200 రూపాయలు కలసి మొత్తం 22 కోట్ల రూపాయలను సంపాదించుకోగలిగింది.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో 6 కోట్లు...

సెమీఫైనల్లో పరాజయాలు పొందిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాజట్లకు చెరో 6 కోట్ల 83 లక్షల రూపాయల చొప్పున దక్కాయి. లీగ్ దశలో సఫారీ జట్టు 7 విజయాలు, న్యూజిలాండ్ 5 విజయాలు నమోదు చేయడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి.

మాజీ చాంపియన్ పాకిస్థాన్ లీగ్ దశలో సాధించిన నాలుగు విజయాలతో పాటు లక్ష డాలర్ల గ్యారెంటీ మనీతో సహా 2 లక్షల 60 డాలర్లు సొంతం చేసుకోగలిగింది.

అప్ఘనిస్థాన్ సైతం పాకిస్థాన్ తో సమానంగా లీగ్ దశలో 4 విజయాలతో 2 లక్షల 60 డాలర్ల చెక్ ను అందుకొంది.

మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 2లక్షల 20 వేల డాలర్లు, బంగ్లాదేశ్ లక్షా 80 వేల డాలర్లు, శ్రీలంక 1,80,000 డాలర్లు, నెదర్లాండ్స్ 1, 80వేల డాలర్లు చొప్పున అందుకొన్నాయి.

రౌండ్ రాబిన్ లీగ్ దశకు అర్హత సాధించిన మొత్తం 10 జట్లకు లక్ష డాలర్లు చొప్పున ఐసీసీ గ్యారెంటీ మనీగా చెల్లించింది. దీనికితోడు రౌండ్ రాబిన్ లీగ్ లో ఒక్కో విజయానికి 40వేల డాలర్లు చొప్పున అందచేసింది.

First Published:  22 Nov 2023 4:04 AM GMT
Next Story