Telugu Global
Sports

10 లక్షల మందితో ప్రపంచకప్ సరికొత్త రికార్డు!

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ పలు విధాలుగా సరికొత్త రికార్డులతో అభిమానులనే కాదు..నిర్వాహక సంఘాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

10 లక్షల మందితో ప్రపంచకప్ సరికొత్త రికార్డు!
X

10 లక్షల మందితో ప్రపంచకప్ సరికొత్త రికార్డు!

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ పలు విధాలుగా సరికొత్త రికార్డులతో అభిమానులనే కాదు..నిర్వాహక సంఘాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భారత్ లో క్రికెట్ పిచ్చి బాగా ముదిరినట్లు ప్రస్తుత ప్రపంచకప్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న భారత్ లో ప్రపంచకప్ టోర్నీలు నిర్వహిస్తే లాభాల పంట, రికార్డుల మోతేనని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎప్పుడో పసిగట్టేసింది. అందుకే భారత్ వేదికగా తరచూ ప్రపంచకప్ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా ప్రణాళిక అమలు చేస్తూ కాసుల పంట పండించుకొంటోంది.

2023 వన్డే ప్రపంచకప్ లో సరికొత్త రికార్డు!

భారత గడ్డపై ఐసీసీ నాలుగోసారి నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్ 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ దశ ముగియటానికి మరో ఆరు మ్యాచ్ లు ముగిసి ఉండగానే..

మొదటి 35 మ్యాచ్ లను 10 లక్షల మంది స్టేడియాలకు వచ్చి వీక్షించినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అప్ఘనిస్థాన్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ కు హాజరైన అభిమానులతో గత నాలుగు వారాలలో మొత్తం 10 లక్షల మంది స్టేడియాలకు వచ్చినట్లు ఐసీసీ ప్రతినిధి తెలిపారు.

ఐసీసీ నిర్వహిస్తున్న వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో 10 లక్షల మంది అభిమానులు స్టేడియాలకు తరలిరావటం ఇదే మొదటిసారని ఐసీసీ ఈవెంట్స్ విభాగం చీఫ్ క్రిస్ టెట్లీ చెప్పారు.

వన్డే క్రికెట్ కు పెరుగుతున్న ఆదరణ...

వన్డే ఫార్మాట్ కు ఆదరణ తగ్గిపోయిందని చెబుతున్నవారికి ఇదే తమ సమాధానమని, భారత్ లోని 10 నగరాలలోని స్టేడియాలలో నిర్వహిస్తున్న ప్రస్తుత 2023 వన్డే ప్రపంచకప్ లీగ్ దశ మొదటి 39 మ్యాచ్ లకే 10 లక్షలమంది హాజరు కావడం గతంలో ఎన్నడూలేని రికార్డని వివరించారు.

వివిధ జట్లు, ఆటగాళ్లు గొప్పగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తున్న కారణంగానే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియాలకు వస్తున్నట్లు చెప్పారు.

నవంబర్ 15న ముంబై, 16న కోల్ కతా వేదికలుగా జరిగే సెమీఫైనల్స్, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్స్ కు స్టేడియాలు కిటకిటలాడటం ఖాయమని తేల్చి చెప్పారు.

టీవీ ప్రసారాల వీక్షకుల రికార్డు...

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను టీవీ ప్రత్యక్ష ప్రసారాలు, డిజిటిల్ మీడియా వేదికల ద్వారానూ వీక్షించే వారి సంఖ్య 43 శాతం మేర పెరిగినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు.

2019 వరకూ జరిగిన ప్రపంచకప్ టోర్నీలతో పోల్చిచూస్తే..ప్రస్తుత 2023 ప్రపంచకప్ ను టీవీల ద్వారా వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మొత్తం 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ లోని మొదటి 18 రౌండ్ల మ్యాచ్ లను 36 కోట్ల 42 లక్షల మంది చూసినట్లు వివరించారు. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో టీవీల ముందే కూర్చొనే అభిమానుల సంఖ్య 43 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 14న భారత్- పాకిస్థాన్ జట్ల నడుమ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ను టీవీ ప్రసారాల ద్వారా 76 మిలియన్ల మంది, డిజిటల్ వేదికల ద్వారా 35 మిలియన్ల మంది వీక్షించడం ఊహలకు అందని విషయమని చెప్పారు.

ప్రపంచకప్ ముగిసే సమయానికి మరికొన్ని రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  11 Nov 2023 10:19 AM GMT
Next Story