Telugu Global
Sports

శ్రీలంకకు ఐసీసీ షాక్‌..సభ్యత్వం రద్దు.!

శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌ షాకిచ్చింది. ఐసీసీలో శ్రీలంక జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

శ్రీలంకకు ఐసీసీ షాక్‌..సభ్యత్వం రద్దు.!
X

శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌ షాకిచ్చింది. ఐసీసీలో శ్రీలంక జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ తప్పు పట్టింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నియమాలను త్వరలో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపింది.శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు..సభ్యునిగా శ్రీలంక నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో శ్రీలంక ఓడిపోయింది. లంకేయులు కేవలం 55 పరుగులకే ఆలౌట్ కావడం..ఆ దేశ క్రికెట్‌ బోర్డులో సంక్షోభానికి దారి తీసింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే రద్దు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఐతే మంత్రి నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా కోర్టులో సవాల్ చేశారు. షమ్మి సిల్వా పిటిషన్ స్వీకరించిన కోర్టు..శ్రీలంక క్రికెట్‌ బోర్డును మళ్లీ పునరుద్ధరించింది. రెండు వారాల తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ జరపనుంది.

ఇక నవంబర్‌ 21న ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత శ్రీ లంక క్రికెట్ బోర్డు సస్పెన్షన్‌పై మరింత క్లారిటీ రానుంది. 2024 జనవరి, ఫిబ్రవరిలో ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఘోర పరాభవాన్ని చూసింది శ్రీలంక. 9 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్స్‌ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

First Published:  10 Nov 2023 4:18 PM GMT
Next Story