Telugu Global
Sports

మద్యం ఊబి నుంచి ప్రపంచకప్ పతకం వరకూ...!

మద్యానికి బానిసగా మారి పతనం అంచుల వరకూ వెళ్లిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ సినాలో జాఫ్టా ప్రపంచకప్ రన్నరప్ పతకంతో సరికొత్త జీవితానికి పునాది వేసుకొంది.

మద్యం ఊబి నుంచి ప్రపంచకప్ పతకం వరకూ...!
X

మద్యానికి బానిసగా మారి పతనం అంచుల వరకూ వెళ్లిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ సినాలో జాఫ్టా ప్రపంచకప్ రన్నరప్ పతకంతో సరికొత్త జీవితానికి పునాది వేసుకొంది....

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి వడ్డించిన విస్తరి అయితే..మరికొందరు అహరహం శ్రమించి, అడుగుడుగునా పోరాడుతూ ఉన్నతస్థితికి చేరుకొనేవారు మరి కొందరు. సామాజిక పరిస్థితులు, కుటుంబనేపథ్యం కారణంగా దురలవాట్లకు లోనై జీవితాన్ని, భవిష్యత్ నే ప్రశ్నార్థకంగా మార్చుకొని, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన వారు మరికొందరు ..పడిలేచిన కెరటంలా దూసుకువచ్చి పునర్జన్మతో సరికొత్త జీవితానికి బాటలు వేసుకొనేవారు అత్యంత అరుదుగా కనిపిస్తారు. ఆ కోవకే చెందుతుంది దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్, మహిళా టీ-20 ప్రపంచకప్ రన్నరప్ మెడలిస్ట్ సినాలో జాఫ్టా.

Advertisement

మద్యంబానిసగా పాతాళానికి....

దక్షిణాఫ్రికాలోని ఓ నల్లజాతి కుటుంబానికి చెందిన 28 సంవత్సరాల సినోలా జాఫ్టా క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు..మద్యానికి బానిస కూడా. ఒంటరి తల్లి సంరక్షణలో తన సోదరుడితో కలసి పెరిగిన సినోలా అడ్డుఅదుపులేని జీవితంతో గతి తప్పింది. మద్యానికి బానిసగా మారిపోయింది. నిరంతరం మద్యం మత్తులోనే ఉంటూ గమ్యం లేని ప్రయాణం చేసింది.

దక్షిణాఫ్రికా మహిళా జాతీయజట్టులో నల్లజాతి ప్లేయర్ల కోటాలో వికెట్ కీపర్ బ్యాటర్ గా చోటు సంపాదించింది. శ్వేతజాతి పాలనలో దశాబ్దాలపాటు మగ్గిన దక్షిణాఫ్రికా..పోరాటయోధుడు నెల్సన్ మండెలా పోరాటంతో స్వయంపాలన హక్కులను సంపాదించుకొంది. దీంతో అప్పటి వరకూ శ్వేతజాతీయుల జట్టుగా పేరుపొందిన దక్షిణాఫ్రికా క్రికెట్లో రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టారు. శ్వేతజాతి, మిశ్రమవర్ణ జాతి ప్లేయర్లతో పాటు కనీసం ముగ్గురి నుంచి నలుగురు నల్లజాతి ప్లేయర్లకు విధిగా చోటు కల్పించేలా నిబంధన ప్రవేశపెట్టారు. దీంతో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టులో సినోలా చోటు సంపాదించగలిగింది.

Advertisement

క్రికెట్ ఆడే సమయం మినహా మద్యం మత్తులోనే గడుపుతూ రావటంతో..ఒక దశలో క్రికెట్ నుంచి విరమించుకోవాలని కూడా భావించింది.

56రోజులపాటు పునరావాస కేంద్రంలో..

తన తల్లి ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ తనతో పాటు తమ్ముడ్ని పోషిస్తూ వచ్చిందని, తాను ఏ పనీలేకుండా గడపడం, మద్యానికి బానిస కావటం చూసి పునరావాస కేంద్రంలో చేర్చారని, ప్రపంచకప్ ప్రారంభానికి ముందే తాను 56 రోజులపాటు పునరావాస కేంద్రంలో గడపడం ద్వారా తిరిగి కొత్తజీవితాన్ని ప్రారంభించానని, తీవ్రంగా శ్రమించడం ద్వారా తిరిగి జాతీయజట్టులో సభ్యురాలిగా ప్రపంచకప్ లో పాల్గొనగలిగానంటూ సంతృప్తి వ్యక్తం చేసింది.

తాను మద్యం మత్తులో సోలి,కూలిపోతూ గడిపానని, ఒకదశలో కుటుంబానికే భారంగా మారానని గుర్తు చేసుకొంది. మద్యానికి బానిసగా మారిన తనను సోషల్ మీడియా

ఎంతగానో కించపరచిందని, మనోవేదనకు గురి చేసిందని వాపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన నాటినుంచి

తన పతనం ప్రారంభమయ్యిందని, మద్యానికి బానిసగా మారిపోయానని, ఏం జరుగుతుందో తెలియకుండానే పాతాళం అంచులకు పడిపోయానని తెలిపింది.

తనకు అండగా తన తల్లి మాత్రమే నిలిచిందని, డిసెంబర్ 8న పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చి క్రికెట్ సాధన మొదలు పెట్టానని, స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం, తాను సభ్యురాలిగా ఉన్న తమజట్టు ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకోడం, రన్నరప్ గా నిలవడం..అంతా తనకు ఓ కలలా అనిపిస్తోందని పొంగిపోతూ చెప్పింది.

ప్రపంచకప్ పతకమే నిత్యస్ఫూర్తి...

మద్యం ఊబిలో నుంచి తనను బయటపడవేసినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉంటానని, దారితప్పిన తనజీవితం తిరిగి గాడిలో పడేలా చేసిన కన్నతల్లికి, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు చెప్పింది.

ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ గా చక్కటి ప్రతిభ కనబరచిన సినోలా బ్యాటర్ గా 9 పరుగులు మాత్రమే చేసింది. ప్రపంచకప్ రన్నరప్ గా సాధించిన పతకాన్ని తాను రోజూ చూస్తూ తన బాధ్యతల్ని గుర్తు చేసుకొంటానని, తలకిందే పెట్టుకొని నిద్రిస్తానని తెలిపింది.

27 సంవత్సరాల వయసులో మద్యం మత్తు నుంచి బయటపడాలని గట్టిగా నిర్ణయించుకొని అక్టోబర్ 7న పునరావాస కేంద్రంలో చేరానని, తనతల్లి లుమ్కా జాఫ్టా అండగా లేకపోతే ఏమైపోయేదానని ఇప్పటికి అర్థంకావడం లేదని చెప్పింది.

ప్రస్తుతం తన వయసు 28 సంవత్సరాలని, క్రికెటర్ గా తన భావిజీవితాన్ని ఉజ్వలంగా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. తిరిగి మద్యంవైపు చూసే ప్రసక్తే లేదని, క్రికెట్ కోసం ఏమైనా చేస్తానని, ఎంతగానైనా కష్టపడతానని ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది.

2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్..విజేతగా నిలిచిన ఆస్ట్ర్రేలియాకు ప్రపంచ రికార్డులను అందించిందేమో కానీ...రన్నరప్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ సినోలా జాఫ్టాకు మాత్రం పునర్జన్మను అందించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Next Story