Telugu Global
Sports

సిరీస్ ఓటమికి బాధ్యత నాదే- హార్థిక్ పాండ్యా!

7వ ర్యాంకర్ వెస్టిండీస్ పై సిరీస్ ఓటమికి బాధ్యత తనదేనని టాప్ ర్యాంకర్ భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా ప్రకటించాడు. ఆఖరి టీ-20లో భారత్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా కరీబియన్ జట్టు 3-2తో సిరీస్ విజేతగా నిలిచింది.

సిరీస్ ఓటమికి బాధ్యత నాదే- హార్థిక్ పాండ్యా!
X

7వ ర్యాంకర్ వెస్టిండీస్ పై సిరీస్ ఓటమికి బాధ్యత తనదేనని టాప్ ర్యాంకర్ భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా ప్రకటించాడు. ఆఖరి టీ-20లో భారత్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా కరీబియన్ జట్టు 3-2తో సిరీస్ విజేతగా నిలిచింది....

టీ-20 ద్వైపాక్షిక సిరీస్ ల్లో వరుస విజయాలతో గాల్లో తేలిపోతూ వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ నేలమీదకు దిగి వచ్చింది. 7వ ర్యాంక్ జట్టు వెస్టిండీస్ తో జరిగిన 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-3తో ఓటమి పొందడంతో షాక్ లో పడిపోయింది.

ఫ్లారిడాలోని లౌడర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి, 5వ మ్యాచ్ లో భారత్ కీలక టాస్ నెగ్గినా బ్యాటింగ్ వైఫల్యంతో 8 వికెట్ల పరాజయం పాలయ్యింది.

టాపార్డర్ టపటపా.....

నువ్వానేనా అన్నట్లుగా సాగిన సిరీస్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లో రెండుజట్లు..రెండేసి వరుస విజయాలు, పరాజయాలతో 2-2తో సమఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ విజేతగా నిలవాలంటే ఆఖరి మ్యాచ్ లో నెగ్గితీరాల్సిన స్థితిలో భారత్ బోల్తా కొట్టింది.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా భారత్ చేజేతులా ఓటమి కొని తెచ్చుకొంది. నాలుగో టీ-20లో చేజింగ్ కు దిగి 179 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించిన భారత్..ఆఖరిమ్యాచ్ లో మాత్రం చేజింగ్ సాహసానికి దిగలేకపోయింది.

ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలోనే 4 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ 87 పరుగుల స్కోరు మాత్రమే సాధించిన సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా నిలదొక్కుకొన్నా ధాటిగా తన దైన శైలిలో ఆడలేకపోయాడు.

కరీబియన్ బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాండ్యాకు పగ్గాలు వేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైస్ కెప్టెన్

సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే పోరాడి ఆడి 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

వెస్టిండీస్ బౌలర్లలో రొమారియా షెఫర్డ్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 2, హోల్డర్ 2, చేజ్ 1 వికెట్ పడగొట్టారు.

తేలిపోయిన భారత బౌలర్లు..

166 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఓపెనర్ బ్రెండన్ కింగ్, వన్ డౌన్ నికోలస్ పూరన్ మెరుపు బ్యాటింగ్ తో తమజట్టును మరో 12 బంతులు మిగిలిఉండగానే విజేతగా నిలిపారు.

బ్రెండన్ కింగ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నికోలస్ పూరన్ 35 బంతుల్లోనే ఓ బౌండ్రీ, 4 సిక్సర్లతో 47 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. షాయ్ హోప్ 22 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో కరీబియన్ జట్టు సంచలన విజయం సాధించగలిగింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 3-2తో గెలుచుకోడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగింది.

2017 తర్వాత తొలి సిరీస్ ఓటమి..

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత్ కు ఇదే తొలిసిరీస్ ఓటమి కావడం విశేషం. ఆరేళ్ల విరామం తర్వాత కరీబియన్ జట్టు టీ-20 సిరీస్ లో భారత్ ను అధిగమించగలిగింది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ ను ఓడించడం ద్వారా 7వ ర్యాంకర్ వెస్టిండీస్ మరోసారి తన సత్తా ఏమిటో చాటుకోగలిగింది. వెస్టిండీస్ పై భారత్ 19 మ్యాచ్ లు నెగ్గితే..భారత్ పై వెస్టిండీస్ 10 విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

2020లో న్యూజిలాండ్ పై 5-0, ఇంగ్లండ్ పై 3-2, దక్షిణాఫ్రికాతో 2-2, 2022 సిరీస్ లో వెస్టిండీస్ పై 4-1తో ద్వైపాక్షిక సిరీస్ విజయాలు సాధించిన భారత్ 2-3తో ఓటమి పొందటం ఇదే మొదటిసారి.

ఒక్క ఓటమితో వచ్చిన నష్టం ఏమీలేదు....

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఎదురైన సిరీస్ ఓటమికి తానే బాధ్యత తీసుకొంటానని భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా పరాజయం అనంతరం ప్రకటించాడు. చివరి 10 ఓవర్లలో తాను అనుకొన్నట్లుగా పరుగులు రాబట్టలేకపోయానని, ఓటమికి ప్రధానకారణం అదేనని ఒప్పుకొన్నాడు. ఒక్క సిరీస్ ఓటమితో వచ్చిన నష్టం ఏమీలేదని, తమ కుర్రాళ్లు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకొన్నారని చెప్పాడు.

యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, పేసర్ ముకేశ్ కుమార్ లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు ముందు ఇలాంటి పరాజయాలు ఎదురుకావడం తమకు మంచిదేనని అన్నాడు.

First Published:  14 Aug 2023 8:36 AM GMT
Next Story