Telugu Global
Sports

ఒక్క ఓటమితో సీనియర్లను పక్కన పెడతారా?

ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్లో భారత ఓటమికి కారణమైన సీనియర్లను పక్కనపెట్టాలన్న వాదనను భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపడేశాడు.

ఒక్క ఓటమితో సీనియర్లను పక్కన పెడతారా?
X

ఒక్క ఓటమితో సీనియర్లను పక్కన పెడతారా?

ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్లో భారత ఓటమికి కారణమైన సీనియర్లను పక్కనపెట్టాలన్న వాదనను భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపడేశాడు.

ఐసీసీ ప్రపంచ క్రికెట్ టోర్నీలలో గత దశాబ్దకాలంగా భారత వరుస వైఫల్యాలపై సునీల్ గవాస్కర్ లాంటి పలువురు మాజీ దిగ్గజాలు మండిపడుతున్నారు.

జట్టులోని సీనియర్ స్టార్లను పక్కనపెట్టి నవతరం బ్యాటర్లకు చోటు కల్పించాలని పట్టుపడుతున్నారు. అయితే..ఈ ఆలోచన ఏమాత్రం మంచిదికాదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, క్రికెట్ వ్యాఖ్యాత, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటున్నాడు.

భారతజట్టు గత దశాబ్దకాలంగా కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ నెగ్గలేకపోయిందని..పైగా 2021, 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ వరకూ వచ్చి చతికిలపడిందని, ఇదంతా ఆటలో భాగమేనని సౌరవ్ గుర్తు చేశాడు.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే లాంటి సీనియర్ క్రికెటర్ల కారణంగానే భారతజట్టు రెండుసార్లు ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ వరకూ వచ్చిన వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని దాదా హెచ్చరించాడు.

కేవలం ఒక్క ఓటమితో విరాట్ కొహ్లీ, చతేశ్వర్ పూజారా లాంటి అపారఅనుభవం కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టాలనుకోడాన్ని మించిన అవివేకం మరొకటి లేదని చెప్పాడు.

విరాట్ కొహ్లీ వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమేనని..మరి కొద్దిసంవత్సరాలపాటు భారత క్రికెట్ కు సేవలు అందించే సత్తా అతనికి ఉందని, పూజారా సైతం ఇప్పటికీ విలువైన ఆటగాడేనని సౌరవ్ తేల్చి చెప్పాడు.

దశలవారీగా జూనియర్లకు చోటు..

భారత టెస్టుజట్టులో దశలవారీగా ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు చోటు కల్పించడం సబబుగా ఉంటుందని, సీనియర్లతో కలసి ఆడితే వారికి అంతర్జాతీయ అనుభవం వస్తుందని చెప్పాడు.

టెస్టుజట్టులో చోటు కోసం ఐపీఎల్ ప్రతిభ ఏమాత్రం ప్రామాణికంకాదని సౌరవ్ స్పష్టం చేశాడు.

నవతరం క్రికెటర్లలో యశస్వి జైశ్వాల్,రజత్ పాటీదార్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్ లాంటి ఎందరో ప్రతిభావంతులు ఉన్నారని, వీరికి తగిన అవకాశాలు కల్పిస్తూ..దశలవారీగా భారతటెస్టుజట్టులో చోటు కల్పిస్తూ రావాలని అభిప్రాయపడ్డాడు.

హార్థిక్ పాండ్యాకు దాదా సలహా....

వైట్ బాల్ క్రికెట్ కే ప్రాధాన్యమిస్తూ..టెస్టు క్రికెట్ కు దూరంగా ఉంటున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని, తిరిగి భారతటెస్టుజట్టులో చేరాలని సౌరవ్ గంగూలీ పిలుపునిచ్చాడు.

హార్థిక్ పాండ్యా లాంటి విలువైన ఆల్ రౌండర్ అందుబాటులో ఉంటే భారత టెస్టులో సమతూకం పెరుగుతుందని తెలిపాడు. 2018 తర్వాత నుంచి హార్ధిక్ పాండ్యా టెస్టు క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

అయితే..టీ-20 క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ అంటేనే మక్కువ చూపుతున్న హార్థిక్ పాండ్యా మాత్రం..టెస్టు క్రికెట్ అంటే మాత్రం బాబోయ్ అనే పరిస్థితికి వచ్చాడు. భారత టెస్టుజట్టులో తిరిగి తాను చోటు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉందని, సత్తా చాటుకోడం ద్వారానే తిరిగి జట్టులోకి రావాలని హార్ధిక్ పాండ్యా భావిస్తున్నాడు.

దేశవాళీ ( రంజీ, దులీప్ ట్రోఫీ ) క్రికెట్ మ్యాచ్ ల్లో తరచూ పాల్గొనగలిగితేనే..టెస్టు జట్టులో సత్తా చాటుకొనే అవకాశం ఉంటుందని హార్థిక్ చెబుతున్నాడు.

టెస్టు లీగ్ ఫైనల్లో భారతజట్టు ఓటమికి కారణమైన కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రావిడ్ లను సైతం పక్కన పెట్టాలన్న వాదనని సౌరవ్ గంగూలీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత భారత క్రికెట్లో కోచ్ గా రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ గా రోహిత్ శర్మను మించిన వారు వేరెవ్వరూ లేరని దాదా తెలిపాడు.

First Published:  15 Jun 2023 5:45 AM GMT
Next Story