Telugu Global
Sports

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త.. త్వరలో HCA ఎన్నికలు

హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.

Hyderabad Cricket Association elections will be held as early as possible
X

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త.. త్వరలో HCA ఎన్నికలు 

హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టు సీఆర్పీఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కోడె దుర్గా ప్రసాద్ తెలిపారు.

అసోషియేషన్ లో వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు ఏక సభ్య కమిటీకి కోడె దుర్గాప్రసాద్ సహకారం అందిస్తున్నారు.

జస్టిస్ నాగేశ్వర్ ఇచ్చిన గడువు మేరకు క్లబ్ సెక్రెటరీలు అందరూ ఈ నెల 10 వరకు వివరాలు సమర్పించాలని....వాటిని ఆయన క్షుణంగా పరిశీలించి ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కసారి వివరాల పరిశీలన పూర్తయితే ఎన్నికలు వెంటనే జరుగుతాయని దుర్గప్రసాద్ చెప్పారు.

హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్ డైరెక్టర్ గా రంజీ మాజీ ఆటగాడు విజయ్ మోహన్ రాజ్ ను నియమించినట్టు తెలిపారు.

ప్రధాన కోచ్ లు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ లు, శిక్షకులు, ఇతరులను కొద్ది రోజుల్లో ప్రకటిస్తామన్నారు కోడె దుర్గాప్రసాద్. HCA లీగ్స్ ఈ నెలాఖరున ప్రారంభం కావడం గొప్ప పరిణామన్నారు. కొంత మంది లీగ్స్ ప్రారంభం కావడానికి జూన్, జూలై వరకు వేచి చూడాలనుకుంటున్నారు...కానీ బీసీసీఐ డొమెస్టిక్ సీజన్ అక్టోబర్ లో మొదలవుతుండడం వల్ల వాటి కంటే ముందే మన లీగ్స్ పూర్తి కావాలని తెలిపారు.

యువతను ఎక్కువగా ప్రోత్సహించడడమే గాక, ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఆటను అందుబాటులోకి తేవడం కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని, జిల్లాల నుంచి వచ్చే 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిల కోసం వసతి సౌకర్యం కల్పించి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. స్టేడియంలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ...సౌకర్యాల విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని....పైపుల లీకేజ్ ప్రధాన సమస్యగా మారిందన్నారు. వాటర్ సంపులను శుభ్రం చేయడం, విరిగిన కుర్చీలను మార్చడం వంటి ఇంకా కొన్ని పనులున్నాయన్నారు. IPL పోటీల తర్వాత క్యానోపి కూడా పాడైపోయిందని, దాన్ని రిపేర్ చేయించాల్సి ఉందన్నారు. ఎల్.ఈ.డి బల్సులు, ఎల్సీడీ స్క్రీన్ల ఏర్పాటు, ఇతర పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అక్టోబర్ లో హైదరాబాద్ లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరగనుండడంతో స్టేడియంలో ఇంకా కొన్ని లిప్ట్ లు, ఆధునిక సౌకర్యాలు అవసరముందని చెప్పారు కోడె దుర్గాప్రసాద్.

First Published:  2 May 2023 5:32 PM GMT
Next Story