Telugu Global
Sports

హైదరాబాద్ అభిమానులు బ్యాడ్ బ్యాడ్...గవాస్కర్ గరంగరం!

హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ జరిగిన సమయంలో సన్ రైజర్స్ అభిమానుల ప్రవర్తన ఆక్షేపణీయమని క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ మండి పడ్డారు...

హైదరాబాద్ అభిమానులు బ్యాడ్ బ్యాడ్...గవాస్కర్ గరంగరం!
X

హైదరాబాద్ అభిమానులు బ్యాడ్ బ్యాడ్...గవాస్కర్ గరంగరం!

హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ జరిగిన సమయంలో సన్ రైజర్స్ అభిమానుల ప్రవర్తన ఆక్షేపణీయమని క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ మండి పడ్డారు...

గతంలో హైదరాబాద్ వేదికగా ఎన్నో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగాయి. అభిమానులు ఏనాడూ అనుచితంగా ప్రవర్తించిన సందర్భం లేదు. అయితే..ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల నడుమ జరిగిన 12వ రౌండ్ మ్యాచ్ లో ఓ అపశృతి చోటు చేసుకొంది.

లక్నో డగౌట్ పై నట్లు , బోల్టులు విసిరిన అభిమానులు..

హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ వేసిన మూడో బంతి.. హై-ఫుల్ టాస్‌గా వెళ్లింది. నిబంధనల ప్రకారం ఆ బంతి నోబాల్ గా అనిపించింది. ఆ బంతి బ్యాట్స్‌మెన్ నడుము కంటే పై భాగం నుంచి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నో-బాల్ గా ఖరారు చేశారు. ఆ నిర్ణయాన్ని లక్నోజట్టు సవాలు చేసి..డీఆర్ఎస్ కోరింది.

ఆ బంతి హై ఫుల్ టాస్ అయినప్పటికీ బ్యాట్ అంచును తాకుతూ వెళ్లింది కాబట్టి అది నో-బాల్ కాదని థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల

సన్ రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ తో పాటు స్టేడియంలోని ఒక భాగంలో ఉన్న హైదరాబాద్ అభిమానులు సైతం నిరసన వ్యక్తం చేసారు. అంతటితో ఆగకుండా లక్నో టీమ్ డగౌట్ పై నట్లు, బోల్టులు విసరడం ద్వారా గందరగోళం సృష్టించారు. అప్పటి వరకూ జోరుమీదున్న మ్యాచ్ ను కాస్త కాసేపు నిలిపివేశారు.

హైదరాబాద్ ఫ్యాన్స్ థర్డ్ అంపైర్ ను తిడుతూ అసహనం వ్యక్తం చే శారు.

ఈ ఐపీఎల్‌ లో తరచుగా నో-బాల్ వివాదాలు చోటుచేసుకోడం సాధారణ విషయంగా మారిపోయింది. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది. లక్నో సూపర్ జెయింట్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లో సైతం ఇలాంటి వివాదమే చోటు చేసుకోడం, మ్యాచ్ కు అంతరాయం కలగడం జరిగిపోయాయి.

కొహ్లీ..కొహ్లీ అంటూ అభిమానుల అరుపులు..

ఇదే అదనుగా చేసుకొని అల్లరికి దిగిన అభిమానులు..కొహ్లీ..కొహ్లీ అని కేకలు పెడుతూ లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఆటపట్టించారు.

ఇటీవలే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో మ్యాచ్ జరిగిన సమయంలో కోహ్లీతో లక్నో టీమ్ మెంటార్ గౌతం గంభీర్ తో పాటు పలువురు ఆటగాళ్లు గతంలో గొడవ పడిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ అభిమానులు ``కోహ్లీ.. కోహ్లీ`` అంటూ కేకలు వేశారు. సోషల్ మీడియాలో కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది చాలా తప్పుడు నిర్ణయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గవాస్కర్, సైమన్ డూల్ గరంగరం..

నోబాల్ పై అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్ సన్ రైజర్స్ చేసిన అల్లరి, సృష్టించిన గలాభా ఏమాత్రం సమర్థనీయం కాదని విఖ్యా కామెంటీటర్లు, సునీల్ గవాస్కర్, సైమన్ డూల్ వ్యాఖ్యానించారు. కొహ్లీ..కొహ్లీ అని అరుస్తూ లక్నో ఆటగాళ్లను ఆటపట్టించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మండి పడ్డారు. ఇది క్రికెట్ స్ఫూర్తికే విరుద్ధమని తేల్చి చెప్పారు.

ఐపీఎల్ మిగిలిన వేదికల్లోని డగౌట్లను ఫ్లెక్సీ గ్లాసులతో రూపొందించారని, హైదరాబాద్ స్టేడియంలో మాత్రం గొడుగులనే డగౌట్లుగా మార్చడం ఏంటంటూ గవాస్కర్ నిర్వాహక సంఘాన్ని నిలదీశారు.

దేవుడి దయవల్ల లక్నో డగౌట్ లోని ఎవ్వరికీ గాయాలు కాలేదని, ఇనుప బోల్టులు, నట్లు అభిమానుల దగ్గరకు ఎలా వచ్చాయంటూ గవాస్కర్ ప్రశ్నించారు.

హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్లో ఆటగాళ్ల కోసం చేసిన ఏర్పాట్లు రక్షణ కల్పించేవిగా లేవని దుయ్యబట్టారు.

హైదరాబాద్ కీపర్ కు 10 శాతం జరిమానా...

నోబాల్ వివాదంపై అంపైర్ తో వాగ్వాదానికి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్, లక్నో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఆటగాళ్ల నియమావళిని అతిక్రమించినట్లు ఒప్పుకోడంతో జరిమానాతో విడిచి పెట్టామని వివరించారు.

అభిమానుల అల్లరి కారణంగా హోం టీమే నష్టపోయిందంటూ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ వాపోయాడు. ఈ కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఓడించడం ద్వారా ప్లే- ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.

First Published:  14 May 2023 7:53 AM GMT
Next Story