Telugu Global
Sports

కరీబియన్ తుపానులో చిక్కుకున్న భారత క్రికెట్ హీరోలు!

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపానులో చిక్కుబడిపోయారు. బార్బడో్స్ నుండి స్వదేశానికి తిరిగి రావటానికి పడిగాపులు కాస్తున్నారు.

కరీబియన్ తుపానులో చిక్కుకున్న భారత క్రికెట్ హీరోలు!
X

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపానులో చిక్కుబడిపోయారు. బార్బడో్స్ నుండి స్వదేశానికి తిరిగి రావటానికి పడిగాపులు కాస్తున్నారు.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గెలుచుకొన్న ఆనందంతో గత రెండురోజులుగా గాల్లో తేలిపోయిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు బృందాన్ని ప్రస్తుతం కరీబియన్ తుపాను భయం వెంటాడుతోంది.

బార్బడోస్ రాజధాని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్టన్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల సంచలన విజయంతో...11 సంవత్సరాల తరువాత తొలి ఐసీసీ ప్రపంచకప్ సాధించిన భారతజట్టు సభ్యులు కొద్దిగంటలపాటు విజయోత్సవాలలో మునిగిపోయారు. అయితే స్వదేశానికి తిరిగి రావాలన్న తహతహతో ఉన్న సమయంలో హరికేన్ బేరిల్ ( తుపాను) ఉధృతం కావడం, వాతావరణశాఖ హెచ్చరికలతో తమ హోటెల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది.

బ్రిడ్డ్ టౌన్ లో బిక్కుబిక్కు మంటూ...

రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా ఉన్న భారతజట్టు బృందంలో సహాయక సిబ్బంది, క్రికెటర్ల కుటుంబసభ్యులు కలసి 40మందికి పైనే ఉన్నారు.

రోహిత్ శర్మ తన కుమార్తె, భార్యతో, బుమ్రా తనకుమారుడు, భార్యతో, జట్టులోని ఇతర ఆటగాళ్లు సైతం తమ కుటుంబ సభ్యులతోనే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

కరీబియన్ ద్వీపాలను అతలాకుతులం చేస్తున్నబేరిల్ తుపానును 4వ గ్రేడ్ హరికేన్ గా అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో..బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానసర్వీసులు రద్దు చేయటం, రాకపోకలను నిషేధించడంతో అంతర్జాతీయ ప్రయాణీకులందరూ బార్బడోస్ లోనే చిక్కుబడి పోయారు.

తుపాను తీవ్రత తగ్గిన తరువాత కానీ బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాకపోకల కోసం అనుమతించనున్నారు. అప్పటి వరకూ భారత క్రికెట్ బృందం అక్కడే గడపక తప్పదు.

బార్బడోస్ లోనే బీసీసీఐ సభ్యులు..

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, ఇతర కార్యవర్గ సభ్యులు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఇతర సభ్యులు సైతం ప్రపంచకప్ ఫైనల్స్ కోసం బ్రిడ్డ్ టౌన్ కు వచ్చి..తుపాను దెబ్బతో అక్కడే చిక్కుకు పోయారు.

రోహిత్ శర్మతో సహా 15 మంది క్రికెటర్లు, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్ లు పరస్ మాంబ్రే, దిలీప్, విక్రమ్ రాథోడ్ లతో పాటు ఓ ట్రెయినర్ ఇద్దరు మేనేజర్లు, ముగ్గురు త్రో స్పెషలిస్టులు, ముగ్గురు ఫిజియో థెరపిస్టులు, వీడియో ఎనలిస్ట్, భద్రతా సిబ్బంది సైతం ప్రస్తుతం బ్రిడ్డ్ టౌన్ హోటెల్ గదుల్లో టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు.

బార్బడోస్ నుంచి స్వదేశానకి తిరిగి వచ్చిన వెంటనే భారతజట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఆ తరువాత జరిగే అభినందన కార్యక్రమంలో రోహిత్ సేన పాల్గొనాల్సి ఉంది.

First Published:  1 July 2024 9:00 AM GMT
Next Story