Telugu Global
Sports

ఆరేళ్ల తర్వాత ప్రణయ్ కి తొలి టైటిల్!

భారత షట్లర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ హెచ్ఎస్ ప్రణయ్ ఆరేళ్ల విరామం తర్వాత తొలిమాస్టర్స్ టైటిల్ సాధించాడు.మలేసియన్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు.

HS Prannoy: ఆరేళ్ల తర్వాత ప్రణయ్ కి తొలి టైటిల్!
X

HS Prannoy: ఆరేళ్ల తర్వాత ప్రణయ్ కి తొలి టైటిల్!

భారత షట్లర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ హెచ్ఎస్ ప్రణయ్ ఆరేళ్ల విరామం తర్వాత తొలిమాస్టర్స్ టైటిల్ సాధించాడు.మలేసియన్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్, 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తన సంచలన విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. స్థాయికి మించి రాణిస్తున్నా..అదృష్టం కలసి రాక టైటిళ్ల ముగింట్లో చతికిలబడుతూ వస్తున్న ప్రణయ్..ఆరుసంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సూపర్ -500 టైటిల్ గెలుచుకోగలిగాడు.

9వ ర్యాంకర్ గా తొలిటైటిల్...

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఇటీవలే ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ 9వ స్థానంలో నిలిచిన ప్రణయ్...2023 మలేసియన్ సూపర్-500 మాస్టర్స్ టోర్నీలో అందరి అంచనాలు తలకిందులు చేసి విజేతగా నిలిచాడు.

మాస్టర్స్ ట్రోఫీతో పాటు 31వేల 500 డాలర్ల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకొన్నాడు. గత ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ వచ్చిన ప్రణయ్..టైటిల్ రౌండ్ కు ముందే ఓడిపోతూ వచ్చాడు. అయితే..ప్రస్తుత 2023 సీజన్లో మాత్రం ప్రతిభకు కొద్దిపాటి అదృష్టం సైతం తోడు కావడంతో టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఫైనల్లో పోరాడినెగ్గిన ప్రణయ్....

94 నిముషాలపాటు సాగిన టైటిల్ సమరంలో ప్రణయ్ తుదివరకూ పోరాడి మూడుగేమ్ ల్లో 2-1తో విజేతగా నిలిచాడు. చైనా ఆటగాడు వెంగ్ హాంగ్ తో జరిగిన ఈ పోరులో ప్రణయ్ 21-19తో తొలిగేమ్ నెగ్గడం ద్వారా శుభారంభం చేశాడు. అయితే..చైనా ప్లేయర్ 21-13తో రెండో గేమ్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచాడు. నిర్ణయాత్మక ఆఖరి గేమ్ లో ప్రణయ్ 21-18తో పైచేయి సాధించడం ద్వారా విజేత కాగలిగాడు.

ఈ విజయంతో ప్రణయ్ కు మాస్టర్స్ టైటిల్ తో పాటు 31 వేల 500 డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటి్ల్ నెగ్గిన ప్రణయ్ కు ఆ తర్వాత ఆరేళ్లకు మలేసియన్ మాస్టర్స్ టైటిల్ చిక్కడం విశేషం.

మలేసియన్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన పోటీలలో ప్రణయ్ గత వారం రోజుల్లో...ప్రపంచ 5వ ర్యాంకర్ చో టియన్ చెన్, ఆల్ ఇంగ్లండ్ విజేత లీ షి ఫెంగ్, జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటాల పైన మూడు గేమ్ ల విజయాలు సాధించడం మరో అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

2022 సీజన్ టూర్ ర్యాంకింగ్స్ లో టాప్...

భారత బ్యాడ్మింటన్లో కిడాంబీ శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లకు దక్కిన గుర్తింపు..ఎన్నో ఘనతలు సాధించిన ప్రణయ్ కు దక్కలేదు. కేరళకుచెందిన ప్రణయ్ హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణతో పాటు సాధన చేస్తూ వస్తున్నాడు.

2022 సీజన్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో ప్రణయ్ అగ్రస్థానంలో నిలిచాడు. అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లు సాధించడం ద్వారా నంబర్ వన్ గా నిలిచాడు.....

అరుదైన గౌరవం...

ప్రతి ఏటా జనవరి 11 నుంచి డిసెంబర్ 18 వరకూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య..వివిధ అంచెలుగా మొత్తం 22 రకాల టోర్నమెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. వీటిలో ఐదు స్థాయిలలో టూర్ టోర్నీలు ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవల్ 5 తరహా టోర్నీలలో పాల్గొనే ఆటగాళ్లకు ర్యాంకింగ్ పాయింట్లతో పాటు టోర్నీస్థాయిని బట్టి ప్రైజ్ మనీ కూడా సొంతమవుతుంది.

ప్రపంచ టూర్ ఫైనల్స్, సూపర్ -1000, సూపర్ -750, సూపర్ -500, సూపర్ -300 స్థాయిల్లో జరిగే మొత్తం 22 రకాల టూర్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా ప్రణయ్ అత్యధిక పాయింట్లతో గత సీజన్లో టాప్ ర్యాంకర్ గా అవతరించాడు.

2022 ఇండియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనలిస్ట్ గా తన టైటిళ్ల వేటను కొనసాగించిన ప్రణయ్ గత నాలుగేళ్ల కాలంలో తన కెరియర్ లోనే అత్యంత నిలకడగా రాణించడం ద్వారా అత్యుత్తమ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగాడు.

టూర్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచిన ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో మాత్రం 16వ స్థానం సంపాదించగలిగాడు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రణయ్ సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం. అంతేకాదు..ప్రస్తుత 2023 సీజన్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో ప్రణయ్ అత్యుత్తమంగా 9వ ర్యాంక్ సంపాదించాడు.

ప్రస్తుత ( 2023 )సీజన్ మొదటి ఐదుమాసాలలో ఓ భారత షట్లర్ సాధించిన వరల్డ్ టూర్ టైటిల్ ప్రణయ్ సాధించినదే కావడం మరో రికార్డు.

భారతజట్టు తొలిసారిగా థామస్ కప్ గెలుచుకోడంలో ప్రణయ్ ప్రధానపాత్ర పోషించాడు. ప్రణయ్ కెరియర్ లో సాధించిన అత్యుత్తమ విజయం థామస్ కప్ సింగిల్స్ విజయం మాత్రమే.

First Published:  29 May 2023 10:09 AM GMT
Next Story