Telugu Global
Sports

ప్రపంచకప్ హాకీలో నేడు భారత్ కు చావోరేవో పోరు!

హాకీ ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ నేడు చావోరేవో మ్యాచ్ కు సిద్ధమయ్యింది. నాకౌట్ రౌండ్ చేరాలంటే న్యూజిలాండ్ పై నెగ్గితీరాల్సి ఉంది.

ప్రపంచకప్ హాకీలో నేడు భారత్ కు చావోరేవో పోరు!
X

హాకీ ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ నేడు చావోరేవో మ్యాచ్ కు సిద్ధమయ్యింది. నాకౌట్ రౌండ్ చేరాలంటే న్యూజిలాండ్ పై నెగ్గితీరాల్సి ఉంది.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న హాకీ ప్రపంచకప్ సమరంలో 16 జట్ల తొలిదశ గ్రూపులీగ్ సమరం ముగియడంతో నాకౌట్ అర్హత కోసం క్రాస్ ఓవర్ మ్యాచ్ లు ఈరోజు ప్రారంభంకాబోతున్నాయి.

మొత్తం నాలుగు గ్రూపులుగా తలపడిన 16 జట్ల నుంచి నాలుగుజట్లు మాత్రమే గ్రూపు టాపర్లుగా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగాయి. మూడుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్ నెదర్లాండ్స్, డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఇంగ్లండ్ జట్లు తమతమ గ్రూపుల్లో అగ్రస్థానం సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ లు ఖరారు చేసుకోగలిగాయి.

మరో నాలుగు క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ల కోసం ఆతిథ్య భారత్ తో సహా ఎనిమిదిజట్ల క్వాస్ ఓవర్ మ్యాచ్ ల సమరానికి భువనేశ్వర్, రూర్కెలా నగరాలు వేదికలుగా రంగం సిద్ధమయ్యింది.

భారత్ కు న్యూజిలాండ్ గండం...

గ్రూప్ - డీ లీగ్ లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్ జట్లతో తలపడిన భారత్ రెండు విజయాలు, ఓ డ్రాతో 7 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానం దక్కించుకొంది.

గ్రూప్ టాపర్ ఇంగ్లండ్ తో సమానంగా భారత్ 7 పాయింట్లు సాధించినా మెరుగైన గోల్స్ సగటున వెనుకబడిపోయింది.

వివిధ గ్రూపుల్లో రెండు, మూడుస్థానాలలో నిలిచిన జట్లు క్రాస్ ఓవర్ పోరులో తలపడాల్సి ఉంది. ఈ రోజు భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగే పోరులో భారత్ ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

క్వార్టర్ ఫైనల్స్ చేరాలంటే న్యూజిలాండ్ ను ఓడించి తీరక తప్పదు.

భారత్ పైనే ఒత్తిడి- రీడ్

ఆతిథ్యజట్టుగా ఈరోజు జరిగే పోరులో భారత్ పైనే ఒత్తిడి ఉంటుందని జట్టు ప్రధాన శిక్షకుడు గ్రాహం రీడ్ చెప్పారు. అయితే ఒత్తిడిని అధిగమించే సత్తా భారత్ కు ఉందని, వచ్చిన అవకాశాలను గోల్సుగా మలచుకోడం పైనే దృష్టి పెట్టామని అన్నారు.

జట్టులో నలుగురు పెనాల్టీకార్నర్ కమ్ డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టులున్నా..భారత్ గోల్సుగా మలచుకోలేకపోడం ప్రధాన బలహీనతగా మారింది. అంచనాలకు అందని జట్టుగా పేరున్న న్యూజిలాండ్ ను ఓడించాలంటే భారత్ వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోక తప్పదు.

భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా జరిగే ఈమ్యాచ్ కు స్టేడియం కిటకిటలాడిపోనుంది.

First Published:  22 Jan 2023 6:07 AM GMT
Next Story