Telugu Global
Sports

ప్రపంచకప్ హాకీ క్వార్టర్స్ కు భారత్ గురి!

2023 ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో చోటుకు ఆతిథ్య భారత్ గురిపెట్టింది. గ్రూప్ -డీ లీగ్ లో ఈరోజు జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో వేల్స్ పై భారీవిజయం సాధించగలిగితే నేరుగా నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

ప్రపంచకప్ హాకీ క్వార్టర్స్ కు భారత్ గురి!
X

ప్రపంచకప్ హాకీ క్వార్టర్స్ కు భారత్ గురి!

2023 ప్రపంచకప్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో చోటుకు ఆతిథ్య భారత్ గురిపెట్టింది. గ్రూప్ -డీ లీగ్ లో ఈరోజు జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో వేల్స్ పై భారీవిజయం సాధించగలిగితే నేరుగా నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ హాకీ గ్రూప్- డీ లీగ్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. భువనేశ్వర్, రూర్కెలా నగరాలు వేదికలుగా

జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 16 ప్రపంచ మేటి జట్లు నాలుగు గ్రూపులుగా తలపడుతున్నాయి.

ఆతిథ్య భారతజట్టు...వేల్స్, ఇంగ్లండ్, స్పెయిన్ జట్లతో కూడిన గ్రూప్- డీ లీగ్ లో తలపడుతోంది. తొలిరౌండ్లో స్పెయిన్ ను 2-0తో కంగు తినిపించిన భారత్ రెండోరౌండ్లో మాత్రం పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో పోరును 0-0 గోల్స్ తో డ్రాగా ముగించడం ద్వారా అజేయంగా నిలిచింది.

నేరుగా క్వార్టర్స్ చేరాలంటే...

భారతజట్టు గ్రూపు-డీ లీగ్ నుంచి నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరాలంటే ఆఖరిరౌండ్ పోరులో బలహీనమైన వేల్స్ పై భారీవిజయం సాధించాల్సి ఉంది. రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.

గ్రూపులో ఇప్పటికే రెండు పరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో నిలిచిన వేల్స్ ను భారత్ కనీసం 6-0 గోల్స్ తో ఓడించాల్సి ఉంది. అప్పుడే గ్రూపు టాపర్ గా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరుకొనే అవకాశం ఉంది.

ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు సైతం వేల్స్ పైన భారీవిజయాలు నమోదు చేయగలిగాయి. భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు పాయింట్ల చొ్ప్పున సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.

అయితే ..ఆఖరిరౌండ్లో స్పెయిన్ తో ఇంగ్లండ్, వేల్స్ తో భారత్ తలపడనుండడంతో గ్రూపు టాపర్ గా నేరుగా నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించే జట్టు ఏదో తేలిపోనుంది.

స్పెయిన్- ఇంగ్లండ్ జట్ల పోటీ డ్రాగా ముగిసినా లేక..ఇంగ్లండ్ పై స్పెయిన్ విజయం సాధించినా భారత్ సునాయాసంగా గ్రూప్ టాపర్ గా నిలువగలుగుతుంది. అదే స్పెయిన్ ను ఇంగ్లండ్ ఓడించగలిగితే..భారత్ తన ఆఖరిరౌండ్ పోరులో వేల్స్ ను కనీసం 5-0 గోల్స్ తో ఓడించి తీరక తప్పని పరిస్థితి ఉంది.

ఒకవేళ భారత్, ఇంగ్లండ్ సమానంగా పాయింట్లు సాధించే పక్షంలో అత్యధిక గోల్స్ సాధించిన జట్టును గ్రూపు టాపర్ గా ప్రకటిస్తారు.

పెనాల్టీకార్నర్లే ప్రధాన సమస్య...

భారతజట్టు పెనాల్టీకార్నర్లను గోల్స్ గా మలచుకోడంలో దారుణంగా విఫలం కావడం ప్రధానసమస్యగా మారింది. మొదటి రెండురౌండ్ల పోటీలలో మొత్తం 9 పెనాల్టీకార్నర్లు లభించినా నేరుగా ఒక్కగోలు సాధించలేకపోయింది. జట్టులో నలుగురు పెనాల్టీ కార్నర్ కమ్ డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టులున్నా ప్రయోజనం లేకుండాపోయింది.

డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ కమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం తలనొప్పిగా మారింది.

14వ ర్యాంకర్ వేల్స్ తో జరిగే పోటీలో పెనాల్టీకార్నర్లతో పాటు అంది వచ్చిన అవకాశాలను గోల్స్ గా మలచుకోగలమన్న ధీమాను చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ వ్యక్తం చేశారు

ఇంగ్లండ్ చేతిలో 5-0, స్పెయిన్ చేతిలో 1-5 గోల్స్ తో పరాజయాలు పొందిన వేల్స్ ...భారత్ కు ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు రూర్కెలా బిర్సాముండా స్టేడియంలో భారత్- వేల్స్ జట్ల పోటీ ప్రారంభంకానుంది.

First Published:  19 Jan 2023 12:26 PM GMT
Next Story