Telugu Global
Sports

ప్రపంచ హాకీ శతపోరులో శివమెత్తిన భారత్!

2023 ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఆలస్యంగా నిదురలేచింది. 9 నుంచి 16 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్ లో ఆసియా చాంపియన్ జపాన్ ను 8-0 గోల్స్ తో చిత్తు చేసింది.

ప్రపంచ హాకీ శతపోరులో శివమెత్తిన భారత్!
X

ప్రపంచ హాకీ శతపోరులో శివమెత్తిన భారత్!

2023 ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఆలస్యంగా నిదురలేచింది. 9 నుంచి 16 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్ లో ఆసియా చాంపియన్ జపాన్ ను 8-0 గోల్స్ తో చిత్తు చేసింది.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ప్రపంచకప్ పురుషుల హాకీలో ఆతిథ్య భారతజట్టు ఆలస్యంగా ఫామ్ లోకి వచ్చింది. క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమైన

భారత్..9 నుంచి 16 స్థానాల కోసం జరుగుతున్న వర్గీకరణరౌండ్ మ్యాచ్ లో భారీవిజయం నమోదు చేసింది.

1975లో తొలిసారిగా ప్రపంచకప్ గెలుచుకొన్న భారత్ ఆ తర్వాత నుంచి మరో టైటిల్ కోసం గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తూనే ఉంది.

ప్రస్తుత 2023 ప్రపంచకప్ టోర్నీలో భారీ అంచనాలతో టైటిల్ పోరుకు దిగి..క్వార్టర్ ఫైనల్స్ అర్హత పోరులో న్యూజిలాండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్ పరాజయంతో ..ఆఖరి ఎనిమిదిజట్ల వర్గీకరణ పోరులో మిగిలింది.

ప్రపంచకప్ లో భారత్ కు 100వ మ్యాచ్...

ప్రపంచకప్ హాకీ చరిత్రలో భారతజట్టు తన 100వ మ్యాచ్ లో జపాన్ తో తలపడటమే కాదు..రికార్డు విజయంతో చిరస్మరణీయం చేసుకొంది. రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియం వేదికగా జరిగిన ఈ ఏకపక్ష పోరులో భారత్ 8-0 గోల్స్ తో జపాన్ ను చిత్తు చేసింది.

ఆట తొలినిముషం నుంచే దూకుడుగా ఆడుతూ..సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత్..మూడో క్వార్టర్ లో చెలరేగిపోయింది. భారత్ సాధించిన మొత్తం 8 గోల్స్ లో

పెనాల్టీ కార్నర్ల ద్వారా ఐదుగోల్స్ రాగా..మిగిలిన మూడు ఫీల్డ్ గోల్స్ గా ఉన్నాయి. జపాన్ తో పోరులో భారత్ కు మొత్తం 11 పెనాల్టీకార్నర్లు దక్కాయి.

భారత ఆటగాళ్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్, అభిషేక్ చెరో రెండుగోల్స్ చొప్పున సాధించారు. అభిషేక్‌ (35ని, 43ని), హర్మన్‌ప్రీత్‌సింగ్‌ (45ని, 58ని) గోల్స్‌ చేయగా, మన్‌దీప్‌సింగ్‌ (32ని), వివేక్‌సాగర్‌ (39ని), మన్‌ప్రీత్‌సింగ్‌ (58ని), సుఖ్‌జీత్‌సింగ్‌ (59ని) తలా గోలు సాధించారు.

9 నుంచి 12 స్థానాలకోసం జరిగే తర్వాతి రౌండ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది. ప్రస్తుత టోర్నీ లో భారత్ 26 పెనాల్టీ కార్నర్లు సాధించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

వర్గీకరణ ఇతర పోటీలలో దక్షిణాఫ్రికా 6-3తో మలేసియాను, వేల్స్ 2-1తో ఫ్రాన్స్ ను, అర్జెంటీనా 8-0తో చిలీని చిత్తు చేశాయి. తర్వాతి రౌండ్ లో వేల్స్ తో అర్జంటీనా పోటీపడుతుంది.

నేడే సెమీఫైనల్స్ సమరం...

ప్రపంచకప్ హాకీ సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ మ్యాచ్ లు ఈరోజు సాయంత్రం 4 -30 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిసెమీఫైనల్లో ప్రస్తుత చాంపియన్ బెల్జియంతో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

రెండోసెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ , మూడుసార్లు విజేత, 12వసారి సెమీస్ ఆడుతున్న ఆస్ట్ర్రేలియాను జర్మనీ ఢీ కోనుంది.

రూర్కెలా, భువనేశ్వర్ వేదికలుగా జరుగుతున్న ఈటోర్నీలో మొత్తం 16 టాప్ ర్యాంక్ జట్లు తలపడుతున్నాయి. టైటిల్ రేస్ లో అగ్రశ్రేణిజట్లు ఆస్ట్ర్రేలియా, బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్ మాత్రమే మిగిలాయి.

First Published:  27 Jan 2023 6:30 AM GMT
Next Story