Telugu Global
Sports

ప్రధాన శిక్షకుడి వేటలో హాకీ ఇండియా!

భారత హాకీ కథ మళ్లీ మొదటి కొచ్చింది. ప్రపంచకప్ వైఫల్యంతో సరికొత్త కోచ్ వేట మొదలయ్యింది. సమర్థుడైన శిక్షకుడు కావాలంటూ ప్రకటన విడుదల చేసింది..

ప్రధాన శిక్షకుడి వేటలో హాకీ ఇండియా!
X

భారత హాకీ కథ మళ్లీ మొదటి కొచ్చింది. ప్రపంచకప్ వైఫల్యంతో సరికొత్త కోచ్ వేట మొదలయ్యింది. సమర్థుడైన శిక్షకుడు కావాలంటూ ప్రకటన విడుదల చేసింది..

భారతహాకీజట్టుకు శిక్షకుడు కావాలంటూ హాకీ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారతజట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలమై 9వ స్థానంతో సరిపెట్టుకోడంతో..చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ నాయకత్వంలోని శిక్షణ బృందం రాజీనామా చేసింది.

Advertisement

రీడ్ శిక్షకుడిగా ఒలింపిక్స్ కాంస్యం..

ఆస్ట్ర్రేలియాకు చెందిన గ్రాహం రీడ్ ప్రధాన శిక్షకుడిగా భారతహాకీజట్టు గత కొద్ది సంవత్సరాలుగా నిలకడగా రాణించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో 13వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకోడంతో పాటు..టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకోగలిగింది.

వాస్తవానికి భారతజట్టు కోచ్ గా రీడ్ కాంట్రాక్టు పారిస్ ఒలింపిక్స్ వరకూ ఉంది. అయితే ..హాకీ ప్రపంచకప్ లో భారతజట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో..

Advertisement

చీఫ్ కోచ్ గా గ్రాహం రీడ్, అనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ ఎడ్వయిజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ తమతమ పదవులకు రాజీనామా చేయటంతో..భారత హాకీ సమాఖ్య సరికొత్త శిక్షకుల బృందం కోసం అన్వేషణ ప్రారంభించింది.

స్వదేశీనా...విదేశీనా?

2023 ఆసియాక్రీడలు, 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారతహాకీజట్టును నడిపించే సమర్థవంతమైన శిక్షకుడు కావాలంటూ హాకీ ఇండియా, భారత క్రీడాప్రాధికార సంస్థ సంయక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు పంపుకోవాలని కోరింది.

అయితే..ముళ్లకిరీటం లాంటి భారతహాకీజట్టు శిక్షకుడి పదవి కోసం విఖ్యాత భారత శిక్షకుడు హరేంద్రసింగ్ తో పాటు పలువురు విదేశీ శిక్షకులు సైతం ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన శిక్షకుడిగా ఉన్న సీగ్ ఫ్రైడ్ ఐక్ మాన్..భారతజట్టు కోచ్ గా పగ్గాలు చేపట్టాలని తహతహలాడుతున్నారు. పాక్ హాకీ సమాఖ్య తనకు సకాలంలో కాంట్రాక్టు వేతనం చెల్లించకుండా సతాయిస్తూ ఉండడంతో..సీగ్ ఫ్రెడ్ విసిగెత్తిపోయి భారత హాకీ సమాఖ్య వైపు చూస్తున్నారు.

నెదర్లాండ్స్ లోని భారత సంతతికి చెందిన సీగ్ ఫ్రైడ్ కు ఆసియా హాకీతో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. పాక్ హాకీ సంఘంతో తన కాంట్రాక్టు రద్దు చేసుకొని భారత హాకీజట్టు పదవి చేపట్టాలని ఉబలాట పడుతున్నారు.

హరేంద్ర సింగ్ వైపూ చూపు..

భారత హాకీ జట్టు మాజీ శిక్షకుడు, ప్రస్తుతం అమెరికాజట్టు చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్న హరేంద్ర సింగ్ సైతం ఆసక్తి చూపుతున్నారు. అవకాశమిస్తే భారతజట్టుకు నేతృత్వం వహించాలని భావిస్తున్నారు. అయితే..కోచ్ పదవికి ప్రొబేషన్ ఏంటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను భారత కోచ్ గా రావాలంటే అమెరికా హాకీ సమాఖ్యతో కాంట్రాక్టును రద్దు చేసుకోవాల్సి ఉంటుందని, రిస్క్ తీసుకోడం అవసరమా అన్న ఆలోచనలోనూ ఉన్నారు.

భారత ఆటగాళ్లతో సన్నిహిత సంబంధాలు కలిగిన స్వదేశీ కోచ్ ఉంటేనే మేలన్నవాదన సైతం వినిపిస్తోంది.

భారతహాకీ మాజీ సలహాదారు రోలెంట్ వోల్ట్స్ మాన్, బెల్జియం చీఫ్ కోచ్ షేన్ మెక్ లీడ్, ఆస్ట్ర్రేలియా మాజీ కోచ్ రిక్ చార్లెస్ వర్త్ పేర్లు సైతం భారత చీఫ్ కోచ్ పోస్ట్ ఎంపికలో వినిపిస్తున్నాయి.

భువనేశ్వర్, రూర్కెలా నగరాలు వేదికగా గతవారమే ముగిసిన 2023 ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ ..భారీఅంచనాలతో బరిలోకి దిగి..క్వార్టర్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యింది.న్యూజిలాండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్ ఓటమితో 9 నుంచి 16 స్థానాల కోసం పోటీపడాల్సి వచ్చింది. చివరకు ప్రపంచకప్ లో పాల్గొన్న 16 జట్లలో

9వ అత్యుత్తమజట్టుగా నిలవడం ద్వారా అభిమానులను తీవ్రనిరాశకు గురిచేసింది.

Next Story