Telugu Global
Sports

ప్రపంచ ప్రో-హాకీలీగ్ లో శివమెత్తిన భారత్

ప్రపంచ పురుషుల ప్రో-హాకీలీగ్ లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన పోరులో 7-4 గోల్స్ తో విజేతగా నిలిచింది.

ప్రపంచ ప్రో-హాకీలీగ్ లో శివమెత్తిన భారత్
X

ప్రపంచ పురుషుల ప్రో-హాకీలీగ్ లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన పోరులో 7-4 గోల్స్ తో విజేతగా నిలిచింది.

అంతర్జాతీయ హాకీలో ఒలింపిక్స్ కాంస్య విజేత భారత్ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించే పురుషుల ప్రొఫెషనల్ హాకీలీగ్ లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది.

భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ప్రో-లీగ్ మ్యాచ్ లో భారత్ 7-4 గోల్స్ తేడాతో ఆతిథ్యన్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఒకదశలో 1-3 గోల్స్ తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత పూర్తిస్థాయిలో చెలరేగిపోయింది. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్, కార్తీ సెల్వమ్ చెరో రెండుగోల్స్ చేసి భారత్ కు కళ్లు చెదిరే విజయం అందించారు.

తొలి అంచె ఓటమికి ప్రతీకారం..

గత నెలలో న్యూజిలాండ్ తోనే న్యూజిలాండ్ వేదికగా జరిగిన తొలి అంచె ప్రోలీగ్ పోరులో 3-4 గోల్స్ తో పరాజయం చవిచూసిన భారత్ ఈసారి భారీవిజయంతో బదులు తీర్చుకొంది.

ఆట మొదటి క్వార్టర్ 15 నిముషాలలోనే ప్రత్యర్థికి మూడుగోల్స్ సమర్ఫించుకొని ఒక్కగోల్ మాత్రమే సాధించిన భారతజట్టు ఆ తరువాత మెరుపుదాడులతో వీరవిహారం చేసి..గోల్ ల వర్షం కురిపించింది.

మిగిలిన మూడు క్వార్టర్ల ఆటలో ప్రతి 15 నిముషాలకు రెండేసి గోల్స్ చొ్ప్పున సాధించి 7-4 గోల్స్ తో విజేతగా నిలిచింది. చివరి 45 నిముషాల ఆటలో ప్రత్యర్థికి ఒక్కగోలు మాత్రమే చేసే అవకాశం ఇచ్చింది.

భారత ఆటగాళ్లలో కెప్టెన్ కమ్ డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆట 7, 19 నిముషాలలో గోల్స్ సాధిస్తే...కార్తీ సెల్వమ్ 17, 38 నిముషాలలో గోల్స్ నమోదు చేశాడు.

మిగిలిన మూడుగోల్స్ ను ఆట 31వ నిముషంలో రాజ్ కుమార్ పాల్, 50వ నిముషంలో సుఖ్ జీత్ సింగ్, 53వ నిముషంలో జుగ్ రాజ్ సింగ్ సాధించారు.

భారత్ కు మొత్తం 11 పెనాల్టీ కార్నర్ లు లభిస్తే...కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించినా 7-4 విజయం నమోదు చేయగలిగింది.

ఆట మొత్తం మీద 56 శాతం బంతిని అదుపులో ఉంచుకొన్న భారత్ 29సార్లు న్యూజిలాండ్ గోల్ పైకి దాడులు చేయగలిగింది.

న్యూజిలాండ్ తరపున సిమోన్ చిల్డ్, సామ్ లానే, స్మిత్ జేకే, నిక్ వుడ్స్ తలో గోల్ చేయగలిగారు.

ఆదివారం జరిగే రెండో అంచె పోరులో స్పెయిన్ తో భారత్ తలపడనుంది. స్పెయిన్ తోనే జరిగిన తొలి అంచె పోరులో 2-3 గోల్స్ తో ఓటమి పొందిన భారత్ మరో విజయం కోసం తహతహలాడుతోంది.

First Published:  5 Nov 2022 4:45 AM GMT
Next Story