Telugu Global
Sports

ద్వైపాక్షిక సిరీస్ ల్లో హిట్...ఐసీసీటోర్నీలో ఫట్!

బంగ్లాదేశ్ పర్యటనతో భారతజట్టు తన 2022 క్రికెట్ సీజన్ ను ముగించింది

ద్వైపాక్షిక సిరీస్ ల్లో హిట్...ఐసీసీటోర్నీలో ఫట్!
X

బంగ్లాదేశ్ పర్యటనతో భారతజట్టు తన 2022 క్రికెట్ సీజన్ ను ముగించింది. ద్వైపాక్షిక సిరీస్ ల్లో విజయాల మోత మోగించిన భారత్ కు అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం పరాజయాలు ఎదురయ్యాయి...

2022 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ను భారతజట్టు మిశ్రమ ఫలితాలతో ముగించింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా జరిగిన తీన్మార్ వన్డే, రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ల్లో మిశ్రమఫలితాలనే చవిచూసింది.

అత్యధిక మ్యాచ్ ల భారత్...

ప్రస్తుత ఏడాదికాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన జట్టుగా భారత్ నిలిచింది. టెస్టులు, వన్డేలు, టీ-20 లు కలిపి భారతజట్టు ఏకంగా 71 మ్యాచ్ లు ఆడేసింది. అంతేకాదు..భారతజట్లకు ఏడుగురు వేర్వేరు క్రికెటర్లు గత 12 మాసాలుగా జరిగిన పోటీలలో కెప్టెన్లుగా వ్యవహరించారు.

భారతజట్టు మొత్తం 40 టీ-20 మ్యాచ్ లు ఆడి 28 విజయాలు సాధించింది. 10 పరాజయాలు చవిచూసింది.

ఆసియాకప్ సూపర్ -4 దశకు చేరడంలో విఫలమైన భారతజట్టు..టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఘోరపరాజయం చవిచూసింది.

సాంప్రదాయ టెస్టు ఫార్మాట్లో 7 మ్యాచ్ లు ఆడి నాలుగు గెలుపు, మూడు ఓటమి రికార్డు సాధించింది. వన్డేలలో 24 మ్యాచ్ లు ఆడి 14 విజయాలు నమోదు చేసింది.

శ్రేయస్ అయ్యర్ టాప్...

క్రికెట్ మూడు ఫార్మాట్లలోను అత్యధిక పరుగులు సాధించిన మొదటి ఐదుగురు భారత క్రికెటర్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ నిలిచారు.

ఆసియాకప్ టీ-20 టోర్నీలో 71వ శతకం, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆఖరిమ్యాచ్ లో 72వ శతకాన్ని విరాట్ కొహ్లీ సాధించడం ద్వారా...మూడేళ్ల సెంచరీల లేమికి తెరదించాడు.

శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ 1609 పరుగులతో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 1424 పరుగులు, రిషభ్ పంత్ 1380 పరుగులు, విరాట్ కొహ్లీ 1348 పరుగులు, రోహిత్ శర్మ 995 పరుగులతో మొదటి ఐదుస్థానాలలో నిలిచారు.

బౌలర్లలో యజువేంద్ర చాహల్ జోరు...

2022 సీజన్లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్ గా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ నిలిచాడు. మొత్తం 32 ఇన్నింగ్స్ లో 44 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు.

లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 35 ఇన్నింగ్స్ లో 42 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 27 ఇన్నింగ్స్ లో 41 వికెట్లు, జస్ ప్రీత్ బుమ్రా 20 ఇన్నింగ్స్ లో 39 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 33 ఇన్నింగ్స్ లో 37 వికెట్లు పడగొట్టడం ద్వారా టాప్-5 బౌలర్లుగా నిలిచారు.

సెంచరీల వీరుడు రిషభ్ పంత్...

వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యధికంగా 3 శతకాలు సాధించాడు. రవీంద్ర జడేజా 2,విరాట్ కొహ్లీ 2, శుభ్ మన్ గిల్ 2, సూర్యకుమార్ యాదవ్ 2 సెంచరీలు చొ్ప్పున సాధించారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కనీసం ఒక్కసెంచరీ సాధించలేకపోడమే కాదు..1000 పరుగుల మైలురాయిని సైతం చేరలేకపోయాడు.

అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనతను శ్రేయస్ అయ్యర్ సొంతం చేసుకొన్నాడు. అయ్యర్ 15, విరాట్ కొహ్లీ 13, సూర్యకుమార్ 12, రిషభ్ పంత్ 10, రాహుల్ 9 హాఫ్ సెంచరీలతో టాప్-5లో చోటు సంపాదించారు.

డకౌట్లలో రోహిత్ రికార్డు...

భారతకెప్టెన్ రోహిత్ శర్మ 40 ఇన్నింగ్స్ లో నాలుగుసార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. విరాట్ కొహ్లీ 42 ఇన్నింగ్స్ లో 3సార్లు, మహ్మద్ షమీ 11 ఇన్నింగ్స్ లో 3 సార్లు, రిషభ్ పంత్ 43 ఇన్నింగ్స్ లో 3సార్లు డకౌట్లుగా వెనుదిరిగారు.

మొత్తం మీద ..ఆసియాకప్, ప్రపంచకప్ లాంటి అంతర్జాతీయ టోర్నీలలో వెలవెలబోయిన భారత్..వివిధ దేశాలతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో మాత్రం కళకళలాడింది.

First Published:  29 Dec 2022 5:30 AM GMT
Next Story