Telugu Global
Sports

టీ-20 ల్లో హీరో...వన్డేల్లో జీరో!

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రం వెలవెలబోతున్నాడు. జట్టుకే భారంగా మారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

టీ-20 ల్లో హీరో...వన్డేల్లో జీరో!
X

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రం వెలవెలబోతున్నాడు. జట్టుకే భారంగా మారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు....

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఒకేతీరుగా రాణించే సత్తా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి అతికొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అయితే..ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో

ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు మాత్రం కేవలం ఒక్క ఫార్మాట్లో మాత్రమే అసాధారణంగా రాణిస్తూ..మిగిలిన రెండు విభాగాలలో వెలవెలాబోతున్నారు.

వెంటవెంటనే అవకాశాలు....

భారతజట్టులో చోటు కోసం సూర్యకుమార్ యాదవ్ మూడుదశాబ్దాల పాటు ఎక్కడలేని ఓర్పుతో నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 31 సంవత్సరాల వయసులో భారత టీ-20 జట్టులో చోటు దక్కడం, సత్తా చాటుకోడం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా ఎదిగిపోడం చకచకా జరిగిపోయాయి. భారత టీమ్ మేనేజ్ మెంట్ సైతం..

సూర్యలోని అపారప్రతిభను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో ఏమాత్రం ఎదురుచూడకుండానే..టెస్ట్, వన్డేలలో సైతం తగిన అవకాశాలు కల్పించాయి.

అయితే..సూర్య మాత్రం అందివచ్చిన ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోడంలో దారుణంగా విఫలమయ్యాడు.

టెస్టుల్లో అలా...వన్డేల్లో ఇలా...

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలిటెస్టులో సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం కల్పించినా రాణించలేకపోయాడు. దీనికితోడు..

వన్డేల్లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో ఆస్ట్ర్రేలియాతో సిరీస్ కు దూరం కావడంతో సూర్యకుమార్ పాలిట అయాచిత వరంగా మారింది.

భారత వన్డేజట్టులో రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దిగే అరుదైన అవకాశం సూర్యకు దక్కింది.

వరుసగా రెండుసార్లు డకౌట్లు...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం, విశాఖపట్నం ఏసీఏ స్టేడియాలు వేదికలుగా ముగిసిన రెండుకు రెండు వన్డేలలోనూ సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు చేయకుండానే ఒకే తరహా బంతులకు..ఒకేతీరుగా దొరికి డకౌట్ అయ్యాడు.

ప్రధానంగా కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో సంధించిన ఇన్ స్వింగర్లను ఎదుర్కొనడంలో విఫలమైన సూర్యకుమార్..వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోడం చర్చనీయాంశంగా మారింది.తన కెరియర్ లో ప్రస్తుత విశాఖ మ్యాచ్ వరకూ ఆడిన 22 వన్డేలలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. సూర్య కనీసం ఒక్క అర్థశతకమూ సాధించలేకపోయాడు. గత 16 వన్డేలలో ఒక్క అర్థశతకమూ లేకపోడం సూర్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

విఫలమైనా..సూర్యాకే అవకాశాలు...

ఆస్ట్ర్రేలియాతో ప్రస్తుత వన్డే సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతున్నా..కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం గట్టిగా వెనకేసుకొస్తున్నాడు. సూర్య లాంటి ప్రతిభావంతులైన బ్యాటర్లకు తగిన అవకాశాలు కల్పిస్తూ..నిలదొక్కుకొనే పరిస్థితి కల్పించడమే తమ విధానమని తేల్చి చెప్పాడు.

మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోడంతో..ఆ స్థానంలో సూర్యాను ఆడిస్తున్నామని, వరుసగా విఫలం కావడం ఆందోళన కలిగిస్తున్నా...నిలదొక్కుకొనే వరకూ తగిన అవకాశలూ కల్పిస్తూనే ఉంటామని స్పష్టం చేశాడు. ప్రతిభావంతులైన, అసాధారణ బ్యాటర్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపైన ఎంతైనా ఉందని భారత కెప్టెన్ వివరించాడు.

టీ-20 ఫార్మాట్లో అలవోకగా రాణిస్తున్న సూర్య..వన్డేలలో సైతం సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

టీ-20 ఫార్మాట్ కే సూర్య పరిమితం కావాలి...

టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ కేవలం..ఆ ఒక్క ఫార్మాట్ కే పరిమితం కావాలని పలువురు మాజీ క్రికెటర్లు , విశ్లేషకులు సూచిస్తున్నారు.

సూర్యాను పక్కనపెట్టి..ప్రతిభావంతుడైన సంజు శాంసన్ కు ఇక నైనా మిడిలార్డర్లో చోటు కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం నాటికి పటిష్టమైన జట్టును సిద్ధం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇక నైనా ప్రయోగాలను కట్టిపెట్టి.. ప్రతిభావంతులైన ఆటగాళ్లకే తుదిజట్టులో చోటు కల్పించాలని కోరుతున్నారు.

ప్రస్తుత సిరీస్ లోని కీలక మూడువన్డేలో సూర్యాను కొనసాగిస్తారా? ఒకవేళ సూర్యాకు చోటు దక్కితే సత్తా చాటుకోగలడా ?..తెలుసుకోవాలంటే ఈనెల 22 వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  20 March 2023 7:42 AM GMT
Next Story