Telugu Global
Sports

వరుణుడు కరుణిస్తే..నేడే ప్రపంచకప్ ఫైనల్స్!

2022 టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. వరుణుడు కరుణిస్తే భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1-30 గంటలకు ఈ సూపర్ సండే బిగ్ ఫైట్ ప్రారంభంకానుంది.

వరుణుడు కరుణిస్తే..నేడే ప్రపంచకప్ ఫైనల్స్!
X

వరుణుడు కరుణిస్తే..నేడే ప్రపంచకప్ ఫైనల్స్!

2022 టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. వరుణుడు కరుణిస్తే భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1-30 గంటలకు ఈ సూపర్ సండే బిగ్ ఫైట్ ప్రారంభంకానుంది.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ సమరం క్లైమాక్స్ దశకు చేరుకొంది. గత మూడువారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తూ వచ్చిన 46 మ్యాచ్ ల ఈ పోరులో టైటిల్ సమరానికి మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్ అర్హత సంపాదించాయి.

భయపెడుతున్నవరుణగండం...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికిట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు వర్షంతో తీవ్రఅంతరాయం కలిగే ప్రమాదం పొంచిఉంది. మ్యాచ్ ప్రారంభసమయానికి ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ కు అంతరాయం కలిగితే..రిజర్వ్ డే ( సోమవారం) రోజున నిర్వహిస్తారు.

రిజర్వ్ డే రోజునా వర్షం పడే అవకాశం హెచ్చుగా ఉంది. దీంతో కనీసం 10 ఓవర్ల మ్యాచ్ గానైనా ఫైనల్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. మ్యాచ్ జరగాల్సిన ఆది, సోమవారాలలో వానపడి మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే..రెండుజట్లనూ సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.

హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్.....

ఐసీసీ ప్రపంచకప్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లండ్ రెండోర్యాంకర్ గా ఉంటే...పాకిస్థాన్ 4వ ర్యాంక్ లో కొనసాగుతోంది. ఇక..టీ-20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో తలపడిన రండుకు రెండుసార్లూ ఇంగ్లండ్ జట్టే విజేతగా నిలిచి నూటికి నూరుశాతం విజయాలతో పైచేయి సాధించింది.

ప్రపంచకప్ కు సన్నాహాకంగా ఈ రెండుజట్ల మధ్య జరిగిన 7 మ్యాచ్ ల సిరీస్ లో సైతం ఇంగ్లండ్ 4-3తో విజేతగా నిలిచింది. అంతేకాదు...పాక్ ప్రత్యర్థిగా ఓవరాల్ రికార్డు చూసినా ఇంగ్లండ్ ఆధిపత్యమే కొనసాగుతోంది. పాక్ పై ఇంగ్లండ్ 18 మ్యాచ్ లు నెగ్గితే..ఇంగ్లండ్ పై పాక్ కు 9 విజయాలు మాత్రమే ఉన్నాయి.

సమఉజ్జీల సమరం...

సూపర్ -12 రౌండ్ నుంచి పడుతూలేస్తూ సెమీస్ చేరిన పాక్ జట్టు గత నాలుగుమ్యాచ్ ల్లో వరుస విజయాలతో ఫైనల్స్ కు దూసుకొస్తే..ఇంగ్లండ్ సైతం దూకుడుగా ఆడుతూ టైటిల్ ఫైట్ కి అర్హత సంపాదించింది.

డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాలలోనూ సమతూకంతో పటిష్టంగా ఉంది. హేల్స్- బట్లర్ జోడీ టాప్ ఫామ్ లో ఉండడంతో..

పాక్ బౌలర్ల సత్తాకు అసలు సిసలు పరీక్షకానుంది.

మరో వైపు బాబర్ అజమ్ కెప్టెన్సీలోని పాక్ జట్టు 2009 తర్వాత మూడోసారి ప్రపంచకప్ ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా టైటిల్ కు గురిపెట్టింది. ఇంగ్లండ్ తో పోల్చుకొంటే ఒత్తిడిలో చిత్తయ్యే బలహీనత పాక్ ను వెంటాడుతోంది. నిలకడలేమితో సతమతమయ్యే పాక్ జట్టు సర్వశక్తులూ కూడదీసుకొని ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తోంది.

బౌన్సీ పిచ్ పైన అసలు సిసలు పోరు...

మెల్బోర్న్ బౌన్సీ పిచ్ పైన రెండుజట్ల ఫాస్ట్ బౌలర్లకు చేతినిండా పనే అని చెప్పక తప్పదు. ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో జరిగే ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడే బ్యాటర్లతో పాటు పేస్, స్వింగ్ బౌలర్లు సైతం రాణించే అవకాశం ఉంది.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు కనీసం 170 కి పైగా పరుగులు సాధించగలిగితేనే విజేతగా నిలిచే అవకాశాలున్నాయి.

విజేతగా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు..

ప్రపంచకప్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 6 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో ఇప్పటికే చెరోసారి విజేతగా నిలిచిన ఇంగ్లండ్, పాక్ జట్ల ఏజట్టు నెగ్గినా...రెండోసారి చాంపియన్ గా వెస్టిండీస్ సరసన నిలువగలుగుతుంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ రెండుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు వెస్టిండీస్ మాత్రమే కావడం విశేషం.

మెల్బోర్న్ వేదికగా భారత్ ఆడిన రెండుమ్యాచ్ లకూ లక్షా 70వేలమందికి పైగా అభిమానులు హాజరుకావడంతో స్టేడియం కళకళలాడిపోయింది. ప్రస్తుత ఇంగ్లండ్- పాక్ జట్ల ఫైనల్స్ మాత్రం తగినంతమంది అభిమానులు లేక వెలవెలపోడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  13 Nov 2022 4:05 AM GMT
Next Story