Telugu Global
Sports

హెచ్‌సీఏలో ముదిరిన వివాదాలు.. ఇండియా-న్యూజీలాండ్ మ్యాచ్‌పై నీలినీడలు!

మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, అసోసియేషన్ సభ్యుల మధ్య గత వారం రోజులుగా చోటు చేసుకున్న వివాదాల ప్రభావం చివరకు హైదరాబాద్‌లో జరుగనున్న వన్డే మ్యాచ్‌పై పడేలా ఉన్నది.

హెచ్‌సీఏలో ముదిరిన వివాదాలు.. ఇండియా-న్యూజీలాండ్ మ్యాచ్‌పై నీలినీడలు!
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గొడవలు ఏ మాత్రం తగ్గడం లేదు. మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, అసోసియేషన్ సభ్యుల మధ్య గత వారం రోజులుగా చోటు చేసుకున్న వివాదాల ప్రభావం చివరకు హైదరాబాద్‌లో జరుగనున్న వన్డే మ్యాచ్‌పై పడేలా ఉన్నది. షెడ్యూల్ ప్రకారం జనవరి 18న ఇండియా-న్యూజీలాండ్ మధ్య తొలి వన్డే జరుగనున్నది. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ వాయిదా వేయాలని అసోసియేషన్‌లోని ఓ వర్గం ఏకంగా బీసీసీఐకి లేఖ రాసింది.

హెచ్‌సీఏ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26న ముగిసింది. అయినా సరే అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. అసోసియేషన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆయనను హెచ్‌సీఏ నుంచి తొలగించడానికి ఈ నెల 11న ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు సమావేశం నిర్వహించడానికి వీలు లేకుండా.. అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ కార్యాలయం గేట్లకు తాళాలు వేయించారు. అక్కడకు చేరుకున్న సభ్యులు రోడ్డుపైనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

హెచ్‌సీఏ అనుబంధంగా ఉన్న 220 క్లబ్స్‌లో 172 మద్దతు తమకు ఉందని.. జనవరి 10న కొత్త కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ అధ్యక్షుడు శివలాల్ ప్రకటించారు. జనవరి 10న ఎన్నికలు జరిగితే.. వెంటనే 18న మ్యాచ్ నిర్వహించేందుకు కష్టం అవుతుంది. కాబట్టి జనవరి 24కు తేదీని మార్చాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం మూడో వన్డే 24న రాయ్‌పూర్‌లో జరగాల్సి ఉన్నది. అయితే రాయ్‌పూర్‌కు తొలి వన్డే (జనవరి 18) కేటాయించాలని. తమకు 24న అడ్జెస్ట్ చేయాలని కోరింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఒక టీ20 మ్యాచ్ జరిగింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల టికెట్ల కోసం తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి అజారుద్దీన్ కారణమని పోలీసు కేసు కూడా నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా హెచ్‌సీఏకు పూర్తి కమిటీ లేదు. కాబట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కాస్త సమయం ఇస్తే.. మ్యాచ్ నిర్వహిస్తామని సభ్యులు చెబుతున్నారు. అయితే, బీసీసీఐ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ మ్యాచ్ తేదీ మార్చాలంటే రాయ్‌పూర్ స్టేడియం అందుకు సిద్ధంగా ఉందో లేదో కూడా తెలియదు.

ప్రస్తుతం హెచ్‌సీఏలో జరుగుతున్న వివాదం ఇలాగే కొనసాగితే.. మ్యాచ్ మొత్తానికే వేరే చోటుకు తరలి పోతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ స్టేడియంకు బీసీసీఐ ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించడం లేదు. హెచ్‌సీఏలో ఉన్న వివాదాల కారణంగానే ఇక్కడకు ఎక్కువ మ్యాచ్‌లు రావడం లేదనే వాదన కూడా ఉన్నది. ఇక ఇప్పుడు వస్తున్న అరకొర మ్యాచ్‌లను కూడా సరిగా నిర్వహించలేక పోతున్నారని అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారు.

First Published:  13 Dec 2022 1:31 AM GMT
Next Story