Telugu Global
Sports

బీసీసీఐ ఎన్నికలు.. అజారుద్దీన్ ఓటుపై వివాదం

మహ్మద్ అజారుద్దీన్ మాత్రం తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఈసీని తప్పదోవ పట్టించారని, ఏజీఎంలో తానే ఓటేసుకోవడానికి అధికారం ఇచ్చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీసీసీఐ ఎన్నికలు.. అజారుద్దీన్ ఓటుపై వివాదం
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తన పదవీకాలాన్ని పొడిగించుకున్నారని ఆరోపిస్తూ రాచకొండ సీపీ మహ్మద్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ సర్వ సభ్య సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శ, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల అసోసియేషన్ల నుంచి తమ అధికార ప్రతినిధి పేరును పంపాలని బీసీసీఐ సర్క్యులర్ జారీ చేసింది.

రాష్ట్రాల అసోసియేషన్లు ఎంపిక చేసిన ప్రతినిధికే బీసీసీఐ ఏజీఎంలో పాల్గొని,ఓటు వేసే హక్కు ఉంటుంది. సాధారణంగా ప్రతీ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిని ప్రతినిధిగా పంపుతుంటారు. వేరే వ్యక్తిని పంపాలంటే అసోసియేషన్ తీర్మానం తప్పనిసరి. కాగా, హెచ్‌సీఏ పాలకమండలి పదవీకాలం గత నెల 26నే ముగిసింది. ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు పదవిలో లేనట్లే లెక్క. కానీ మహ్మద్ అజారుద్దీన్ మాత్రం తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఎగ్జిక్యూటీవ్ కమిటీని తప్పదోవ పట్టించారని, ఏజీఎంలో తానే ఓటేసుకోవడానికి అధికారం ఇచ్చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్, కార్యదర్శి శేషు నారాయణ్, సభ్యుడు చిట్టి శ్రీధర్ బాబు సీపీకి ఇచ్చిన కంప్లైట్‌లో పేర్కొన్నారు.

అజారుద్దీన్ ఇలా చేయడం క్రిమినల్ చర్య అని, దాని కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా, మహ్మద్ అజారుద్దీన్ పదవీ కాలం మొత్తం వివాదాలతోనే గడిచింది. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల సమయంలో జరిగిన రచ్చ దేశమంతటా తెలిసిపోయింది. ఆ సమయంలోనే అజారుద్దీన్ వ్యవహార శైలిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఇంకా ఆ విషయం సద్దుమణగక ముందే మరో వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

First Published:  10 Oct 2022 10:06 AM GMT
Next Story