Telugu Global
Sports

నేడు హెచ్‌సీఏ ప్రత్యేక సమావేశం.. అజారుద్దీన్‌ను తొలగించడమే అజెండా!

హెచ్‌సీఏకు తానే అధ్యక్షుడినని అజారుద్దీన్ చెప్పుకోవడం చట్టవిరుద్దమని సభ్యులు వాదిస్తున్నారు. ఆయన పదవీకాలం 2022 సెప్టెంబర్ 26నే ముగిసిందని, కానీ ఇప్పటికీ ఆదే హోదాలో ఉన్నారని ఆరోపిస్తున్నారు.

నేడు హెచ్‌సీఏ ప్రత్యేక సమావేశం.. అజారుద్దీన్‌ను తొలగించడమే అజెండా!
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మళ్లీ వివాదం నెలకొన్నది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అధ్యక్షుడిగా కొనసాగడం చట్ట విరుద్దమని ఓ వర్గం సభ్యులు వాదిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించడానికి ఆదివారం ప్రత్యేక జనరల్ బాడీని ఏర్పాటు చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఉన్న హెచ్‌సీఏ కార్యాలయంలో ఈ సమావేశం జరుగనున్నది. శనివారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మాన్‌ను నియమించే ప్రక్రియ కోసం సభ్యులు కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలోనే ఆదివారం స్పెషల్ మీటింగ్ ఉంటుందని అందరికీ వాట్సప్‌లో సమాచారం పంపించారు.

హెచ్‌సీఏకు తానే అధ్యక్షుడినని అజారుద్దీన్ చెప్పుకోవడం చట్టవిరుద్దమని సభ్యులు వాదిస్తున్నారు. ఆయన పదవీకాలం 2022 సెప్టెంబర్ 26నే ముగిసిందని, కానీ ఇప్పటికీ ఆదే హోదాలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆదివారం జరిగే సమావేశానికి సభ్యలందరూ కచ్చితంగా హాజరు కావాలని మెసేజ్ పంపారు. ఈ సమావేశంలో అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే మెయిన్ అజెండాగా తెలుస్తున్నది. అయితే హెచ్‌సీఏ అఫిషియల్ గ్రూపులో ఆ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్ పలు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.

మాజీ క్రికెటర్ అజార్‌కు హెచ్‌సీఏ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సభ్యుల చెప్తున్నారు. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం హెచ్‌సీఏ, సభ్యుల మధ్య ఉండే వివాదాలను పరిష్కరించడానికి ఒక అంబుడ్స్‌మాన్ ఉండాలని చెప్తున్నారు. అందుకే ఆ పదవిని భర్తీ చేయడానికి జనరల్ బాడీ సమావేశం అవసరం అని అంటున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, సూపర్‌వైజరీ కమిటీ చైర్మన్ నిస్సార్ అహ్మద్ కాక్రు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అజారుద్దీన్‌ను మాజీ అధ్యక్షుడిగానే వ్యవహరించాలని ప్రకటించారు.

First Published:  11 Dec 2022 4:00 AM GMT
Next Story