Telugu Global
Sports

ఐపీఎల్ లో ముంబై గూటికి మళ్ళీ హార్థిక్ పాండ్యా!

ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం పై వార్తలు జోరందుకొన్నాయి.

ఐపీఎల్ లో ముంబై గూటికి మళ్ళీ హార్థిక్ పాండ్యా!
X

ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం పై వార్తలు జోరందుకొన్నాయి. ఐదుసార్లు విజేత ముంబై కెప్టెన్ గా పాండ్యా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో 2024 సీజన్ కోసం వివిధ ఫ్రాంచైజీలు ట్రేడింగ్ మొదలు పెట్టాయి. గత రెండుసీజన్లుగా గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబై గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండేళ్ల తర్వాత తిరిగి....

2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించిన హార్థిక్ పాండ్యా రెండుకు రెండుసార్లు తనజట్టును ఫైనల్స్ చేర్చడంతో పాటు..విన్నర్ , రన్నరప్ స్థానాలు సాధించి పెట్టాడు.

సీజన్ కు 15 కోట్ల రూపాయల కాంట్రాక్టు పై ఆడిన హార్థిక్ పాండ్యాను తిరిగి తన గూటికి రప్పించుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయించింది. గుజరాత్ టైటాన్స్ తో ఇప్పటికే ట్రేడింగ్ మొదలు పెట్టిందని, పాండ్యాను విడిచి పెట్టినందుకు తగిన పరిహారాన్ని సైతం చెల్లించడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.

హార్థిక్ పాండ్యా చేతికి ముంబై పగ్గాలు...

ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లీగ్ లో న్యూజిలాండ్ మ్యాచ్ ఆడుతూ..ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలిగాయంతో పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. పాండ్యా అందుబాటులో లేకపోడంతో భారతజట్టు సమతౌల్యం పూర్తిగా దెబ్బతింది. టైటిల్ సమరంలో భారత్ ఓటమికి పాండ్యా అందుబాటులో లేకపోడం కూడా ఓ కారణమని భావిస్తున్నారు.

అయితే..తరచూ గాయలబారిన పడుతూ ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాండ్యా తిరిగి పూర్తి ఫిట్ నెస్ తో ఐపీఎల్ -16 సీజన్ ప్రారంభంనాటికి అందుబాటులోకి రానున్నాడు.

2024 టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించాలని కలలు కంటున్న పాండ్యా ఐపీఎల్ ద్వారా మరోసారి సత్తాచాటుకోడానికి ఉబలాట పడుతున్నాడు.

తిరిగి ముంబై గూటికి చేరడమే కాదు..ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ చేతి నుంచి అందుకోడానికి పాండ్యా సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం జోరందుకొంది.

ముంబై ఇండియన్స్ కాబోయే సారథి హార్థిక్ పాండ్యా మాత్రమేనంటూ భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్టమాచారీ శ్రీకాంత్ సైతం తన యూట్యూబ్ చానెల్ ద్వారా చెబుతున్నారు. గుజరాత్- ముంబై ఫ్రాంచైజీల మధ్య పాండ్యా బదలీపై అహగాహన కుదిరినట్లేనని, మరికొద్దిరోజుల్లో ఏ విషయం తేలిపోనుందని చెబుతున్నారు.

డిసెంబర్ 19న నిర్వహించే ఐపీఎల్ మినీ వేలానికి ముందే పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ తిరిగి సొంతం చేసుకోడం ఖాయమని భావిస్తున్నారు.

ముంబై నుంచి ముంబైకి....

ముంబై ఫ్రాంచైజీ నుంచే తన ఐపీఎల్ కెరియర్ ప్రారంభించిన హార్థిక్ పాండ్యాకు..రెండు వేర్వేరు జట్ల తరపున ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకొన్న అరుదైన ఘనత ఉంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిస్తే...అందులో నాలుగుసార్లు హార్థిక్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2022 సీజన్లో అరంగేట్రం చేసిన రెండుజట్లలో ఒకటిగా ఉన్న గుజరాత్ ఫ్రాంచైజీకి పాండ్యా నాయకత్వం వహించాడు.కెప్టెన్ గా తన తొలిసీజన్లోనే టైటాన్స్ ను విజేతగా నిలపడం ద్వారా సంచలనం సృష్టించాడు.

గత సీజన్లో సైతం గుజరాత్ ను ఐపీఎల్ ఫైనల్స్ చేర్చినా..టైటిల్ నిలబెట్టుకోడంలో మాత్రం విఫలమయ్యాడు. 2024 సీజన్లో పాండ్యా తిరిగి ముంబై జట్టులో చేరే పక్షంలో కెప్టెన్ గానే ఉంటాడని, రోహిత్ శర్మ నుంచి పగ్గాలు అందుకోడం ఖాయమని శ్రీకాంత్ తేల్చి చెప్పారు.

పాండ్యా కెప్టెన్సీలో ఆడటానికి ప్రస్తుత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఎలాంటి అభ్యంతరమూ ఉండబోదని, విరాట్ కొహ్లీ నాయకత్వంలో ధోనీ, రోహిత్ నాయకత్వంలో విరాట్ కొహ్లీ ఆడినప్పుడు...పాండ్యా నాయకత్వంలో రోహిత్ ఆడటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని శ్రీకాంత్ ప్రశ్నించారు. 2022సీజన్లో చెన్నై ఫ్రాంచైజీ కెప్టెన్ జడేజా నాయకత్వంలో ధోనీ ఆడిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. పైగా రోహిత్ అంటే హార్థిక్ కు ఎంతో గౌరవమని, ఇద్దరి మధ్య చక్కటి అవగాహన, స్నేహం సైతం ఉన్నాయని తెలిపారు. ఇద్దరూ గురువు-శిష్యుడిలా కలసిపోడం ఖాయమని వివరించారు.

మరోవైపు సూపర్ ఆల్ రౌండర్ కమెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లను వదులుకోవాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తోంది.

First Published:  27 Nov 2023 3:02 AM GMT
Next Story