Telugu Global
Sports

9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత

అంతర్జాతీయ టీ20లో అత్యధిక తేడాతో విజయం సాధించిన జట్టుగా నేపాల్ రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ టీ20 స్కోర్ కూడా 314 కావడం గమనార్హం.

9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆసియా గేమ్స్‌లో రికార్డుల మోత
X

చైనాలోని హ్యాంగ్జోలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ క్రికెట్ జట్టు రికార్డుల మోత మోగించింది. బంతి గ్రౌండ్‌లో కన్నా.. బౌండరీ వెలుపలే ఎక్కువ సేపు ఉన్నది. కొడితే ఫోర్ లేదా సిక్స్ అనేలా నేపాల్ బ్యాటర్లు రెచ్చిపోయారు. బుధవారం మంగోలియాతో జరిగిన గ్రూప్ ఏ తొలి మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. నేపాల్ ఓపెనర్లు కుషాల్ (19), ఆసిఫ్ షేక్ (16) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన కుషాల్ మల్లా కేవలం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. 12 సిక్సులు, 8 ఫోర్లతో చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో రోహిత్ కేవలం 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి.

కుషాల్, రోహిత్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగులు జత చేశారు. ఇక రోహిత్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దీపేంద్ర సింగ్ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తొమ్మిది బంతుల్లో ఎనిమిది సిక్సులు ఉండటం గమనార్హం. ఈ క్రమంలో 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. దీపేందర్ సింగ్ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. నేపాల బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 314 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఇక 315 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసి మంగోలియా జట్టు 13.1 ఓవర్లలో కేవలం 41 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు అయ్యారు. దావసురేన్ చేసిన 10 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. దీంతో నేపాల్ జట్టు 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక తేడాతో విజయం సాధించిన జట్టుగా నేపాల్ రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ టీ20 స్కోర్ కూడా 314 కావడం గమనార్హం.

స్కోర్ :

నేపాల్ :

20 ఓవర్లలో 314/3 (కుషాల్ మల్లా 137, రోహిత్ 61, దీపేంద్ర సింగ్ 52)

మంగోలియా :

20 ఓవర్లలో 41 ఆలౌట్ (దవాసురేన్ 10)

First Published:  27 Sep 2023 5:22 AM GMT
Next Story