Telugu Global
Sports

గిల్ సునామీలో ముంబై గల్లంతు, ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ -16వ సీజన్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి చేరుకొంది. క్వాలిఫైయర్ -2లో ముంబైని 62 పరుగులతో చిత్తు చేసింది.

గిల్ సునామీలో ముంబై గల్లంతు, ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!
X

ఐపీఎల్ -16వ సీజన్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి చేరుకొంది. క్వాలిఫైయర్ -2లో ముంబైని 62 పరుగులతో చిత్తు చేసింది.......

ఐపీఎల్ -2023 సీజన్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. లీగ్ టేబుల్ అగ్రభాగంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లే ఫైనల్లో తలపడటానికి సై అంటున్నాయి.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన క్వాలిఫైయర్ -2 పోరులో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసి.. వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

30 నిముషాలు అలస్యంగా పోరు...

గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్ జట్ల రెండో క్వాలిఫైయర్ సమయం..వానదెబ్బతో నిర్ణిత సమయం కంటే 30 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది.

కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న ముంబై కోరికష్టాలు కొని తెచ్చుకొంది.

అహ్మదాబాద్ వేదికగా ముందుగా బ్యాటింగ్ చేసినజట్లకే విజయశాతం ఎక్కువగా ఉంది. అయితే ముంబై కెప్టెన్ మాత్రం చేజింగ్ వైపు మొగ్గు చూపడం ద్వారా భారీమూల్యమే చెల్లించాడు.

లక్షమంది అభిమానులతో కిటకిటలాడిన అహ్మదాబాద్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంది.

తొలి వికెట్‌కు గిల్- సాహా జోడీ పవర్ ప్లే ఓవర్లలోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం సాధించారు. ఆ వెంటనే వృద్ధిమాన్ సాహా(18) ను లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా పడగొట్టాడు. సాహా స్టంపౌట్ గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్)తో జ‌త‌క‌లిసిన గిల్ స్కోర్ బోర్డును మెరుపువేగంతో పరుగులు పెట్టించాడు.

ముంబై బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎడపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.

లీగ్ చివరి దశలోనే వరుసగా రెండుసెంచరీలు బాదిన శుభ్ మన్ గిల్ చెలరేగి ఆడాడు. కట్, పుల్, డ్రైవ్ షాట్లతో వీరవిహారం చేశాడు.కేవలం 60 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 బౌండ్రీలతో 129 పరుగులతో చూడముచ్చటైన శతకం సాధించాడు. ముంబై ఫీల్డర్ల తప్పిదాలతో మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న గిల్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

బౌల‌ర్ ఎవ‌రన్నది చూడకుండా గిల్ బౌండ్రీ బౌండ్రీ బాదుతూ రెచ్చిపోయాడు. గిల్ జోరుకు ధాటికి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ స్టార్ బౌలర్ ఆకాశ్ మథ్వాల్ బెంబేలెత్తి పోయాడు. చేతికి ఎముకలేదన్నట్లుగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్ వేసిన 20వ ఓవ‌ర్ రెండో బంతిని ర‌షీద్ ఖాన్ బౌండ్రీగా మలిచాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(28 నాటౌట్) ఐదో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఆఖ‌రి బంతిని సిక్స‌ర్‌గా బాది అజేయంగా నిలిచాడు.

చివర్లో కెప్టెన్ హార్థిక్ పాండ్యా సైతం రెండు బౌండ్రీలు, 2 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 233 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ముంబై ఎదుట 234 పరుగుల కొండంత విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఈ సీజన్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్లే-ఆఫ్ రౌండ్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనర్ గా శుభ్ మన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ వీరేంద్ర సెహ్వాగ్ పేరుతో ఉన్న రికార్డును గిల్ అధిగమించాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మద్వాల్‌, పీయూశ్‌ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు.

మోహిత్ మ్యాజిక్, సూర్య ఒంటరిపోరాటం...

ఆ తర్వాత...234 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, నేహాల్ వదేరాలను సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పడగొట్టాడు.ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నేహ‌ల్ వ‌ధేర‌(4)ను ఔట్ చేసిన ష‌మీ త‌న రెండో ఓవ‌ర్లో కీల‌క‌మైన రోహిత్ శ‌ర్మ(8)ను పడగొట్టాడు. దూకుడుమీదున్న యువఆటగాడు తిలక్ వ‌ర్మ(43)ను ర‌షీద్ ఖాన్ బౌల్డ్ చేశాడు. కామెరూన్ గ్రీన్(30)ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ జోష్ లిట‌ల్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మ‌లుపు తిప్పాడు. ఆ త‌ర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్(55) ధాటిగా ఆడాడు. అయితే.. మోహ‌త్ శ‌ర్మ ఒకే ఓవ‌ర్లో సూర్య‌, విష్ణు వినోద్‌(5)ను ఔట్ చేయ‌డంతో ముంబై క‌ష్టాల్లో ప‌డింది. టిమ్ డేవిడ్ సైతం (2) విఫ‌ల‌మ‌య్యాడు. దాంతో, ముంబై ఓట‌మి ఖాయమైపోయింది.

సూర్యకుమార్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యువబ్యాటర్ తిలక్‌వర్మ(14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగుల స్కోరుతో జోరు పెంచినా ముంబైకి ఓటమి తప్పలేదు. చివరకు 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి ముంబై నిష్క్ర్రమించింది.

ప్లే-ఆఫ్ రౌండ్లో ఇప్పటి వరకూ 11మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ కు ఇది రెండో ఓటమి మాత్రమే.

గుజరాత్ బౌలర్లలో షమీ 2 వికెట్లు, మోహిత్ శర్మ 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు.

మూడోజట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు..

ఐపీఎల్ 16సీజన్ల చరిత్రలో వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన మూడోజట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డుల్లో చేరింది. 2022 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ 2023 సీజన్లో సైతం టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగింది.

గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సైతం వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్స్ చేరినజట్లుగా ఉన్నాయి.

ఆదివారం జరిగే టైటిల్ ఫైట్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  27 May 2023 8:19 AM GMT
Next Story