Telugu Global
Sports

నల్లకలువ సెరెనా అల్విదా!

ప్రపంచ మహిళా టెన్నిస్ లో ఓ అపూర్వ ఘట్టం ముగిసింది.

Serena Williams
X

Serena Williams

ప్రపంచ మహిళా టెన్నిస్ లో ఓ అపూర్వ ఘట్టం ముగిసింది. అమెరికన్‌ ఆల్ టైమ్ గ్రేట్‌, నల్ల్లకలువ సెరెనా విలియమ్స్ 27 సంవత్సరాల టెన్నిస్ జీవితానికి తెరపడింది. 2022 యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్‌ ఓటమితో గ్రాండ్‌ స్లామ్ షో నుంచి 40 ఏళ్ల సెరెనా నిష్క్ర్రమించింది.

ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒకచోట ముగియక తప్పదు. జీవితమైనా...క్రీడారంగమైనా చావు-పుట్టుక, ఆరంభం- అంతం అనేవి అత్యంత సహజం. ప్రపంచ మహిళాటెన్నిస్ లో గత మూడుదశాబ్దాల కాలంలో ఒక వెలుగు వెలిగిన అమెరికన్ బ్లాక్ థండర్, నల్లకలువ సెరెనా విలియమ్స్ మహాప్రస్థానానికి తెరపడింది.

40 సంవత్సరాల లేటు వయసులో టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది.

అమెరికన్ ఓపెన్ తో సెరెనా స్వస్తి..


2017 గ్రాండ్ స్లామ్ సీజన్లో తన ఆఖరి గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత నుంచి వెనుకబడిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మృత్యువు అంచుల వరకూ వెళ్ళి వచ్చిన సెరెనా ఆ తర్వాత నుంచి పుంజుకోలేకపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాజీతయ టెన్నిస్ లో తాను నెలకొల్పుతూ వచ్చిన అత్యున్నత ప్రమాణాలను అందుకోలేకపోయింది.

అందని ద్రాక్ష 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్..


మహిళా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన రికార్డు ఆస్ట్ర్రేలియాకు చెందిన మార్గారెట్ కోర్ట్ పేరుతో ఉంది. తన కెరియర్ లో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా...24 వ టైటిల్ నెగ్గడం ద్వారా మార్గారెట్ కోర్ట్ సరసన చోటు సంపాదించాలని, 24 టైటిల్స్ తో మహిళా టెన్నిస్ నుంచి సగర్వంగా రిటైర్ కావాలని భావించింది. అయితే..గత ఐదేళ్లుగా తిరిగి పుంజుకోడానికి, మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గటానికి సెరెనా చేయని ప్రయత్నం అంటూ లేదు.

టెన్నిస్ ద్వారా ఒలింపిక్ పతకాలు, డజన్ల కొద్దీ ట్రోఫీలు, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ,వందలకోట్ల రూపాయలు సంపాదించిన సెరెనా 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది.

మరికొద్ది రోజుల్లో 41వ పడిలో అడుగుపెట్టనున్న సెరెనా..రిటైర్మెంట్ కు ఇదే తగిన సమయం అని గ్రహించింది. తన శరీరం సహకరించకుండా మొరాయిస్తూ రావడం తో

2022 అమెరికన్ ఓపెన్ తో రిటైర్ కావాలని నిర్ణయించింది.

తన సోదరి వీనస్ విలియమ్స్ తో జంటగా ఆఖరుసారి గ్రాండ్ స్లామ్ డబుల్స్ బరిలో నిలవాలని భావించింది. నిర్వాహక సంఘం సిస్టర్స్ జోడీకి వైల్డ్ కార్డ్ ప్రవేశం కల్పించినా..తొలిరౌండ్ ఓటమితో ఆ కోరికా తీరకుండానే పోయింది.

ఇక..యూఎస్ ఓపెన్ సింగిల్స్ లో ఆరుసార్లు చాంపియన్ గా ఉన్న సెరెనా..మొదటి రెండురౌండ్లలో అలవోక విజయాలు సాధించినా..మూడోరౌండ్లో మాత్రం ఓటమి చవిచూడక తప్పలేదు.

ఆస్ట్ర్రేలియా ప్లేయర్ అజ్లా చేతిలో సెరెనా 7-5, 6-7, 6-1తో ఓటమి పొందటం ద్వారా తన సుదీర్ఘయాత్రకు ముగింపు పలికింది.

27 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ప్రపంచ మేటి మహిళా టెన్నిస్ స్టార్ గా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించడం తో పాటు..అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన

సెరెనా..ప్రపంచ మహిళాటెన్నిస్ పుస్తకంలో ఓ గొప్ప చరిత్రగా, అధ్యాయంగా నిలిచిపోనుంది.

పురుషులతో సమానంగా మహిళలు సైతం పవర్ టెన్నిస్ ఆడగలరని, రాయల్ గేమ్ టెన్నిస్ పురుషుల సొత్తు ఏమాత్రం కాదని తన సోదరి వీనస్ తో కలసి నిరూపించిన ధీర సెరెనా విలియమ్స్

First Published:  3 Sep 2022 4:55 AM GMT
Next Story