Telugu Global
Sports

ఫ్రంటూ- బ్యాకు.. లెఫ్ట్- రైటూ ..మాక్స్ వెల్ బాదుడే బాదుడు!

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ మాక్స్ వెల్ దంచి కొట్టాడు. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో సునామీ డబుల్ సెంచరీ బాదాడు.

ఫ్రంటూ- బ్యాకు.. లెఫ్ట్- రైటూ ..మాక్స్ వెల్ బాదుడే బాదుడు!
X

ఫ్రంటూ- బ్యాకు.. లెఫ్ట్- రైటూ ..మాక్స్ వెల్ బాదుడే బాదుడు!

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ మాక్స్ వెల్ దంచి కొట్టాడు. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో సునామీ డబుల్ సెంచరీ బాదాడు. తనజట్టును సెమీఫైనల్స్ చేర్చాడు.

ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ సెమీస్ కు అర్హత సాధించిన మూడోజట్టుగా నిలిచింది. పసికూన అప్ఘనిస్థాన్ తో జరిగిన పోరులో మాక్స్ వెల్ సూపర్ డబుల్ సెంచరీతో 3 వికెట్ల సంచలన విజయం సాధించింది.

ఆస్ట్ర్రేలియా అసాధారణ విజయం...

భారత గడ్డపై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సెంచరీల హోరు నుంచి డబుల్ సెంచరీల జోరు మొదలయ్యింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ 8వ రౌండ్ పోరులో మాజీ చాంపియన్ ఆస్ట్ర్రేలియా ఓటమి అంచుల నుంచి అనూహ్యంగా బయటపడి.. 48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలోనే ఓ అపూర్వ, అపురూప విజయాన్ని నమోదు చేసింది.

పసికూన అప్ఘనిస్థాన్ అనుభవలేమిని ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియా పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొంది. 292 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగి 91 పరుగులకే 7 టాపార్డర్ వికెట్లు కోల్పోయి..ఘోరపరాజయం ఊబిలో చిక్కుకొన్న కంగారూ జట్టును 6వ నంబర్ బ్యాటర్ గ్లెన్ మాక్స్ వెల్- కెప్టెన్ పాట్ కమిన్స్ 8వ వికెట్ కు అజేయ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో 3 వికెట్లతో విజేతగా నిలిపారు.

ఇబ్రహీం జడ్రాన్ సెంచరీ వృధా...

అంతకుముందు..టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 291 పరుగుల స్కోరుతో ఆస్ట్ర్రేలియా ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

అప్ఘన్ ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ 131 బంతుల్లో 129 పరుగులు సాధించడం ద్వారా తనజట్టుకు ప్రపంచకప్ రికార్డు స్కోరు అందించాడు. తన కెరియర్ లో 27వ వన్డే మ్యాచ్ ఆడుతున్న జడ్రాన్ కు ఇది 5వ శతకం కాగా..ప్రపంచకప్ లో మూడంకెల స్కోరు సాధించిన తొలి అప్ఘన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

2019 ప్రపంచకప్ లో హెడింగ్లే వేదికగా వెస్టిండీస్ పై సాధించిన 288 పరుగుల అత్యధిక స్కోరును అప్ఘన్ ఈమ్యాచ్ లో 291 పరుగుల స్కోరు సాధించడం ద్వారా అధిగమించలిగింది.

లోయర్ ఆర్డర్ లో రషీద్ ఖాన్ మెరుపువేగంతో 35 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. కంగారూ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడం జంపా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు.

కంగారూ టాపార్డర్ టపటపా..!

సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోవాలంటే 50 ఓవర్లలో 292 పరుగులు చేయాల్సిన ఆస్ట్ర్రేలియాను అప్ఘన్ బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూ 91 పరుగులకే 7 టాపార్డర్ వికెట్లు పడగొట్టారు.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా..మిషెల్ మార్ష్ 24 పరుగులకు అవుటయ్యాడు. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఒమార్ జియా క్లీన్ బౌల్డ్ చేయడంతో కంగారూజట్టు 49 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

జోష్ ఇన్ గ్లిస్, మార్నుస్ లబుషేన్ సైతం వెంట వెంటనే అవుటవ్వడంతో ఆస్ట్ర్రేలియా 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆల్ రౌండర్ స్టోయినిస్ ను లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో 91 పరుగుల స్కోరు వద్ద 7 వ వికెట్ నష్టపోయింది. దీంతో ఆస్ట్ర్రేలియాకు ఘోరపరాజయం తప్పదని అందరూ భావించారు.

క్యాచ్ విడిచి మ్యాచ్ ఓడిన అప్ఘన్ జట్టు...

కంగారూ సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ వ్యక్తిగత స్కోరు 33 పరుగుల వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్ ను అప్ఘన్ ఫీల్డర్ ముజీబుర్ విడిచి పెట్టాడు. దీంతో నిలదొక్కుకొన్న మాక్స్ వెల్ ఆ తర్వాత విశ్వరూపమే ప్రదర్శించాడు. తన జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

ఓ వైపు కెప్టెన్ కమిన్స్జ్ జిడ్డాట ఆడుతూ అండగా నిలిస్తే..మరోవైపు మ్యాడ్ మాక్స్ హిట్టర్ గా పేరున్న మాక్స్ వెల్ శివమెత్తి పోయాడు. బౌలర్లు ఎవరన్నది చూడకుండా..ఫ్రంటూ, బ్యూకు, లెఫ్ట్,రైటూ అన్నతేడా లేకుండా ఎడాపెడా షాట్లు కొట్టాడు. 360 డిగ్రీల కోణంలో బౌండ్రీలు, సిక్సర్ షాట్లతో వీరవిహారం చేశాడు.

కేవలం 128 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగుల నాటౌట్ స్కోరుతో తన జట్టుకు నమ్మశక్యం కాని విజయం అందించాడు.

35 సంవత్సరాల మాక్స్ వెల్ తన 136వ వన్డే మ్యాచ్ ఆడుతూ నాలుగోసారి ఈ మూడంకెల రికార్డు స్కోరు నమోదు చేయగలిగాడు.

మాక్స్ వెల్ 201 పరుగుల చేసిన సమయంలో ఆస్ట్ర్రేలియా కెప్టెన్ కమిన్స్ 12 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడం విశేషం.

ప్రపంచకప్ లో మూడో డబుల్ సెంచూరియన్..

నాలుగున్నర దశాబ్దాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ద్విశతకం బాదిన మూడో బ్యాటర్ గా మాక్స్ వెల్ రికార్డుల్లో చేరాడు.గతంలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్, కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మాత్రమే ప్రపంచకప్ డబుల్ సెంచరీలు సాధించగలిగారు. అయితే..6వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి ద్విశతకం సాధించిన ఘనత మాత్రం మాక్స్ వెల్ కే దక్కుతుంది.

నెదర్లాండ్స్ పై కేవలం 40 బంతుల్లోనే మెరుపు శతకం బాదడం ద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పిన మాక్స్ వెల్ ఇప్పుడు అప్ఘనిస్థాన్ పై ఏకంగా అజేయ డబుల్ సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా చరిత్ర సృష్టించాడు.

1983 ప్రపంచకప్ లో భారత కెప్టెన్ కపిల్ దేవ్ జింబాబ్వే పై ఆడిన 175 పరుగుల డేరిగ్ అండ్ డాషింగ్ ఇన్నింగ్స్ తరువాత..మాక్స్ వెల్ సాధించిన 201 పరుగుల నాటౌట్ స్కోరే వన్డే ప్రపంచకప్ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది.

ఈ విజయంతో ఆస్ట్ర్రేలియా ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరిన మూడోజట్టుగా నిలిచింది. తన ఆఖరి రౌండ్ పోటీలో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో అప్ఘనిస్థాన్ తలపడాల్సి ఉంది.

దక్షిణాఫ్రికాను ఓడించగలిగితేనే సెమీస్ చేరే అవకాశం అప్ఘనిస్థాన్ కు ఉంది.

First Published:  8 Nov 2023 11:47 AM GMT
Next Story