Telugu Global
Sports

200 మంది చిన్నారులకు గవాస్కర్ జీవనదానం!

భారత దిగ్గజ క్రికెటర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తన పెద్దమనసును చాటుకొన్నారు. 200 మంది బాలల ప్రాణాలకు ఆలంబనగా నిలిచారు....

200 మంది చిన్నారులకు గవాస్కర్ జీవనదానం!
X

భారత దిగ్గజ క్రికెటర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తన పెద్దమనసును చాటుకొన్నారు. 200 మంది బాలల ప్రాణాలకు ఆలంబనగా నిలిచారు....

భారత మాజీ కెప్టెన్ కమ్ సూపర్ ఓపెనర్, ప్రపంచ మేటి కామెంటీటర్ సునీల్ మనోహర గవాస్కర్ తన పెద్దమనసును చాటుకొన్నారు. తన 72వ పుట్టినరోజు నాటినుంచి హృద్రోగసమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు.

1970 దశకంలో ప్రపంచ మేటి ఓపెనర్లుగా, టెస్టు చరిత్రలో 10వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా, 100కు పైగా టెస్టులు ఆడిన భారత ఓపెనర్ గా పలు రకాల ఘనతలు సాధించిన గవాస్కర్ గత ఆరుదశాబ్దాలుగా క్రికెట్ తో ఏదో ఒక రూపంలో తన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు.

పదునైన క్రికెట్ వ్యాఖ్యాతగా.....

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న తరువాత గవాస్కర్ ప్రపంచ మేటి కామెంటీటర్లలో ఒకరిగా స్థిరపడిపోయారు. పదునైన వ్యాఖ్యానం, లోతైన విశ్లేషణలో తనకుతానే సాటిగా నిలిచే గవాస్కర్ చురకలు అంటించడంలోనూ దిట్టగా గుర్తింపు పొందారు.

క్రికెటర్ గా కంటే క్రికెట్ వ్యాఖ్యాతగానే ఎక్కువగా ఆర్జిస్తున్న గవాస్కర్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ప్రధానంగా..పుట్టుకతో చిన్నారులకు వచ్చే గుండెసంబంధిత లోపాలు, వ్యాధుల చికిత్సకు తనవంతుగా సాయం అందిస్తున్నారు.

భారత్ లో జన్మిస్తున్న ప్రతి వెయ్యిమంది బాలలలో ఎనిమిదిమంది గుండె సంబంధిత లోపాలు, వ్యాధులతోనే జన్మిస్తున్నారు. భారత్ లో 2 లక్షల 40వేల మంది బాలలు పుట్టుకతో వచ్చిన గుండెసంబంధిత లోపాలతో బాధపడుతున్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి.

72వ పుట్టినరోజు నాటినుంచే...

2021లో తన 72వ జన్మదిన వేడుకలు జరుపుకొన్ననాటినుంచి ఇప్పటి వరకూ 200 మంది బాలల చికిత్సకు గవాస్కర్ సాయం అందించారు. పుట్టుకతోనే గుండెసంబంధిత లోపాలతో జన్మించిన బాలలకు అత్యాధునిక చికిత్స అందచేస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

బెంగళూరులోని శ్రీ సాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గవాస్కర్ సేవలు అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు ఇప్పటి వరకూ 28వేల గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. చిన్నారులకు చేసిన శస్త్రచికిత్సల ఖర్చును సునీల్ గవాస్కర్ భరిస్తున్నారు.

గుండె సంబంధిత లోపాలు, వ్యాధులతో బాధపడుతున్న బాలలకు సేవచేయటంలో ఎంతో ఆనందం ఉందని, అందుకు తనవంతుగా సాయం చేయటం నిజంగా అదృష్టమని గవాస్కర్ మురిసిపోతున్నారు.

శ్రీ సాయి సత్యసంజీవని ట్రస్ట్ తన నాలుగవ ఆస్పత్రిని 2024 జనవరి నుంచి తెలంగాణాలో సైతం ప్రారంభించనున్నారు. చిన్నారుల గుండె చికిత్సకు అవసరమైన

అత్యాధునిక సదుపాయాలతో ఇప్పటికే మూడు ఆస్పత్రులను నిర్మించడం ద్వారా సంజీవని ట్రస్ట్ సేవలు అందించగలుగుతోంది.

First Published:  29 Nov 2023 1:30 AM GMT
Next Story