Telugu Global
Sports

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వయిటెక్,మచోవా!

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వయిటెక్, 43వ ర్యాంకర్ కరోలినా మచోవా చేరుకొన్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వయిటెక్,మచోవా!
X

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వయిటెక్,మచోవా!

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వయిటెక్, 43వ ర్యాంకర్ కరోలినా మచోవా చేరుకొన్నారు....

2023 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లైనప్ పూర్తయ్యింది. టాప్ సీడ్ ఇగా స్వయిటెక్, 43వ ర్యాంకర్ కారోలినా మచోవా..సెమీఫైనల్స్ విజయాలు సాధించడంతో టైటిల్స్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఫైనల్లో వరుసగా మూడోసారి....

పోలెండ్ సంచలనం, 22 సంవత్సరాల ఇగా స్వయిటెక్ ..ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు వరుసగా మూడోసారి చేరుకొని సంచలనం సృష్టించింది. టైటిళ్ల హ్యాట్రిక్ కు గురిపెట్టింది.

పారిస్ లోని రోలాండ్ గారోస్ క్లేకోర్టులో జరిగిన తొలిసెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ స్వయిటెక్ 6-2, 7-6తో బ్రెజిల్ సంచలనం బెట్రిజ్ హాడాడ్ మియాను అధిగమించడం ద్వారా వరుసగా మూడోసారి ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

ఇప్పటికే రెండుసార్లు ఫ్రెంచ్ టైటిల్స్ నెగ్గిన స్వయిటెక్..తన బ్రెజీలియన్ ప్రత్యర్థిపై తొలిసెట్ ను 6-2తో సునాయాసంగా నెగ్గినా..రెండోసెట్లో మాత్రం గట్టిపోటీ ఎదుర్కొనాల్సి వచ్చింది. టై..బ్రేక్ లో 7-6 (9-7)తో నెగ్గడం ద్వారా విజేతగా నిలిచింది.

గత నాలుగేళ్లకాలంలో మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ చేరిన స్వయిటెక్ 27-2 రికార్డుతో నిలిచింది. 2007లో జస్టిన్ హెనిన్ ఫ్రెంచ్ ఓపెన్లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ విజయాల ఘనత సాధిస్తే..అదే రికార్డును స్వయిటెక్ సమం చేయగలిగింది. అంతేకాదు..1990 దశకంలో మోనికా సెలెస్ వరుసగా మూడో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ చేరడం ద్వారా నెలకొల్పిన రికార్డును ప్రస్తుత 2023 సీజన్లో స్వయిటెక్ చేరుకోగలిగింది.

సెమీస్ లోనే ముగిసిన బ్రెజీలియన్ పోరాటం..

1968 లో మారియా బ్యూనే తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్ చేరిన తొలి బ్రెజిల్ మహిళగా చరిత్ర సృష్టించిన బెట్రిజ్ హాడాడ్ మియా పోరుకు సెమీఫైనల్లోనే తెరపడింది.

టాప్ సీడ్ స్వయిటెక్ కు రెండోసెట్లో మాత్రమే గట్టిపోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటుకొన్న బెట్రిజ్ ప్రస్తుత ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించడం ద్వారా తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకోగలిగింది.

రెండో సెమీఫైనల్లో మచోవా సంచలనం...

హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో చెక్‌ ప్లేయర్ కారోలినా మచోవా..ఆఖరి సెట్లో 2-5తో వెనుకబడినా పోరాడి ఆడి..3 గంటల 13 నిముషాలపాటు సాగిన మూడుసెట్ల పోరులో రెండోసీడ్ ,బైలో రష్యన్ ప్లేయర్ సబలెంకాపై సంచలన విజయం సాధించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో మచోవా 7-6, 6-7, 7-5తో సబలెంకాను కంగుతినిపించింది. సబలెంకా 12 మ్యాచ్ ల వరుస విజయాలకు మచోవా బ్రేక్ వేయగలిగింది.

మ్యాచ్ ను గెలుచుకోడానికి వచ్చిన పలు అవకాశాలను తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని..ఓటమి అనంతరం రెండోసీడ్ సబలెంకా వాపోయింది.

మొత్తం మూడుసెట్లు టై బ్రేక్ లోనే ముగియటం విశేషం.

కడుపునొప్పిని జయించి విజేతగా మచోవా..

చెక్ రిపబ్లిక్ కు చెందిన కారోలినా మచోవాకు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడి పోయే ఓ వ్యాధి ఉంది. మచోవా టెన్నిస్ క్రీడలో రాణించడం కష్టమని, కడుపునొప్పిని ఆమె జయించలేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే మచోవా మాత్రం కడుపునొప్పిని మాత్రమే కాదు..బలమైన ప్రత్యర్థిని సైతం జయించడం ద్వారా తన కెరియర్ లో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

2021 సీజన్లో భరించలేని కడుపునొప్పితో 7 మాసాలపాటు మచోవా టెన్నిస్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగానే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో సైతం పాల్గొనలేకపోయింది.

తాను టెన్నిస్ కు పనికిరానని వైద్యులు చెప్పిన మాటను తప్పని రుజువు చేశానని మచోవా గుర్తు చేసింది. అక్లాండ్, దుబాయ్,ఇండియన్ వెల్స్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం ద్వారా 200వ ర్యాంక్ నుంచి 43వ ర్యాంక్ కు చేరుకోగలిగింది.

ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్లో 8వ సీడ్ మారియా సక్కారీని క్వార్టర్ ఫైనల్లో అనస్తాసియా పవెల్విచెంకోవాను, సెమీఫైనల్లో సబలెంకోను ఓడించడం ద్వారా ఫ్రెంచ్ ఓపైన్ టైటిల్ సమరానికి తొలిసారిగా అర్హత సంపాదించగలిగింది.

శనివారం జరిగే టైటిల్ పోరులో రెండుసార్లు విజేత స్వయిటెక్ తో మచోవా అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  9 Jun 2023 6:43 AM GMT
Next Story