Telugu Global
Sports

భారతజోడీకే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్!

భారత యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో తమ జోరు కొనసాగిస్తున్నారు. 2022 సీజన్లో తమ సంచలన విజయాల పరంపరతో దూసుకుపోతున్నారు.

భారతజోడీకే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్!
X

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. 2022 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన భారత తొలిజంటగా చరిత్ర సృష్టించారు.

భారత యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో తమ జోరు కొనసాగిస్తున్నారు. 2022 సీజన్లో తమ సంచలన విజయాల పరంపరతో దూసుకుపోతున్నారు.

పారిస్ వేదికగా ముగిసిన 2022 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా మరో అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించే సూపర్ 750 స్థాయి టోర్నీ నెగ్గిన భారత తొలిజోడీగా చరిత్ర సృష్టించారు.

పారిస్ వేదికగా ముగిసిన ఫైనల్లో చైనీస్ తైపీ జోడీ లూ చింగ్ యావో- యాంగ్ పో హాన్ ను వరుస గేమ్ ల్లో చిత్తు చేసి టైటిల్ అందుకొన్నారు.

ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి కేవలం 48 నిముషాలలో ప్రత్యర్థులను చిత్తు చేశారు. 25వ ర్యాంక్ ప్రత్యర్థి జోడీ పై 21- 13, 21-19లో విజేతలుగా నిలిచారు. తొలిగేమ్ ను 21-13తో అలవోకగా నెగ్గిన భారతజోడీకి రెండోగేమ్ లో మాత్రం గట్టిపోటీనే ఎదురయ్యింది. మొదటి 19 పాయింట్ల వరకూ పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. చివరకు 21-19 గేమ్, 2-0తో ఫైనల్ పోరులో విన్నర్ ట్రోఫీ సాధించారు.

2022 సీజన్లో సంచలన విజయాలు..

2022 థామస్ కప్ టోర్నీలో బంగారు పతకం అందుకొన్న సాత్విక్- చిరాగ్ జోడీ...ఇండియన్ ఓపెన్ సూపర్ -500 టైటిల్ నెగ్గారు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో బంగారు పతకం సాధించారు. గత ఆగస్టులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.

తమ కెరియర్ లో మూడోసారి టూర్ టైటిల్ విజేతలుగా నిలిచారు. 2019లో థాయ్ ఓపెన్ సూపర్ -500 టైటిల్ తో పాటు..ఇండియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన భారత జోడీ..ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో హ్యాట్రిక్ పూర్తి చేయగలిగారు.

గత ఏడాది వరకూ పురుషుల, మహిళల సింగిల్స్ లో మాత్రమే బలంగా ఉంటూ వచ్చిన భారత బ్యాడ్మింటన్...సాయిరాజ్- చిరాగ్ జోడీ పుణ్యమా అంటూ డబుల్స్ విభాగంలోనూ శక్తివంతమైనజట్టుగా నిలిచింది.

First Published:  31 Oct 2022 6:29 AM GMT
Next Story