Telugu Global
Sports

వరుసగా రెండో సారి ఫైనల్‌లో ఫ్రాన్స్.. కప్‌కోసం ఆదివారం అర్జెంటీనాతో ఢీ

బలమైన లైనప్ కలిగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి ఆధిపత్యం కనపరచి.. మొరాకోను చిత్తు చేసింది. ఆదివారం మరో బలమైన జట్టు అర్జెంటీనాతో వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నది.

వరుసగా రెండో సారి ఫైనల్‌లో ఫ్రాన్స్.. కప్‌కోసం ఆదివారం అర్జెంటీనాతో ఢీ
X

డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్నది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మొరాకోతో జరిగిన సెమీఫైనల్‌లో 2-0 తేడాతో ఓడించి వరుసగా రెండో సారి ఫైనల్స్ చేరింది. అండర్‌డాగ్స్‌గా అడుగు పెట్టి.. నాకౌట్ దశలో అద్భుతంగా రాణించి.. పోర్చుగల్ వంటి దేశాన్ని మట్టి కరిపించి సెమీస్ చేరిన మొరాకో.. ఫ్రాన్స్‌పై చేతులెత్తేసింది. బలమైన లైనప్ కలిగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి ఆధిపత్యం కనపరచి.. మొరాకోను చిత్తు చేసింది. ఆదివారం మరో బలమైన జట్టు అర్జెంటీనాతో వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నది.

ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మూడింట రెండో వంతు సమయం బంతిని మొరాకో తమ ఆధీనంలోనే ఉంచుకున్నది. కానీ ఆ జట్టు ఆటగాళ్లు ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించి గోల్స్ చేయడంలో మాత్రం విఫలం అయ్యారు. మూడు సార్లు గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్లినా.. ఫ్రాన్స్ ఆటగాళ్లు చాకచక్యంగా అడ్డుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండెజ్ అద్భుతమైన గోల్ సాధించాడు. తొలి అర్థ భాగంలో ఆ తర్వాత గోల్స్ ఏమీ నమోదు కాలేదు. ఇక సెకెండ్ హాఫ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 79వ నిమిషంలో ఎంబపే నుంచి పాస్ అందుకున్న రాండల్ కోలో మువానీ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది. ఇక చివరి దాక గోల్స్ కోసం శ్రమించిన మొరాకో ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో మొరాకో వరల్డ్ కప్ కథ సెమీస్‌తో ముగిసిపోయింది.

గత 20 ఏళ్లలో వరల్డ్ కప్ ఫైనల్స్‌కు వరుసగా రెండో సారి చేరుకున్న జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 1994-2002 మధ్య బ్రెజిల్ వరుసగా మూడు సార్లు ఫైనల్స్‌కు చేరుకున్నది. ఇక ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సందర్భాల్లో మాత్రమే వరుసగా ఓ జట్టు ఫైనల్స్ చేరుకున్నాయి. 1958, 1962లో బ్రెజిల్.. 1934, 1938లో ఇటలీ వరుసగా ఫైనల్స్ చేరుకున్నాయి. విశేషం ఏంటంటే, ఆ రెండు జట్లు ఫైనల్స్‌లో విజేతలుగా నిలిచాయి. ఇక 1974, 1978లో నెదర్లాండ్స్, 1982, 1986, 1990లో వెస్ట్ జర్మనీ కూడా ఫైనల్స్ చేరాయి.

ఓటమి జీర్ణించుకోలేక.. మొరాకో ఫ్యాన్స్ విధ్వంసం

సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌పై తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక మొరాకో ఫ్యాన్స్ బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. దాదాపు 100 మంది అభిమానులు బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై టపాకులు పేల్చి విసిరేశారు. అంతేకాకుండా వీధుల్లో ఉన్న దుకాణాలకు నిప్పు పెట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో అల్లరి మూకపై పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. కొంత మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ భారీగా ఏమీ నష్టం జరగలేదని రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొన్నది.

First Published:  15 Dec 2022 4:33 AM GMT
Next Story