Telugu Global
Sports

అమెరికా గడ్డపై నేడే నాలుగో టీ-20 ఫైట్.. సిరీస్ కు గురిపెట్టిన భారత్

భారత్ 2-1తో పైచేయి సాధించడంతో.. సిరీస్ లోని ప్రస్తుత నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ కు చెలగాటం, వెస్టిండీస్ కు సిరీస్ సంకటంగా తయారయ్యింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

అమెరికా గడ్డపై నేడే నాలుగో టీ-20 ఫైట్.. సిరీస్ కు గురిపెట్టిన భారత్
X

ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో.. కరీబియన్ ద్వీపాల మీదుగా అమెరికాలోని ఫ్లోరిడాకు చేరింది. సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్ లను ఫ్లోరిడాలోని లాడెర్ హిల్స్ వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది. ట్రినిడాడ్, సెయింట్ కిట్స్ వేదికలుగా మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 2-1తో పైచేయి సాధించడంతో.. సిరీస్ లోని ప్రస్తుత నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ కు చెలగాటం, వెస్టిండీస్ కు సిరీస్ సంకటంగా తయారయ్యింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

Advertisement

రోహిత్ ఫిట్.. ఆవేశ్ ఖాన్ డౌట్..!

సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్ ఆడుతూ వెన్నెముక నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన భారత కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.. పూర్తి ఫిట్ నెస్ తో సిరీస్ లోని నాలుగో మ్యాచ్ కు అందుబాటులో ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. లాడెర్ హిల్ లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా జరిగే ఈ కీలక పోరులో భారత జట్టుకు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ స్పష్టంచేసింది. భారతజట్టు ఒకటి లేదా రెండు మార్పులతో పోటీకి దిగే అవకాశాలున్నాయి. సిరీస్ లోని మొదటి మూడు మ్యాచ్ ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైన యువపేసర్ ఆవేశ్ ఖాన్ స్థానంలో మరో పేసర్ హర్షల్ పటేల్ లేదా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ లను తుదిజట్టులో చేర్చుకోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తిగా నిలదొక్కుకోక ముందే అవుటై పోతున్న వన్ డౌన్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు సైతం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.

Advertisement

భారత్ 15- విండీస్ 7 విజయాలు..

టీ-20 క్రికెట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ టాప్ ర్యాంక్ లో ఉంటే.. వెస్టిండీస్ జట్టు 7వ ర్యాంకులో కొనసాగుతోంది. ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే.. భారత్ దే పైచేయిగా ఉంది. విండీస్ ప్రత్యర్థిగా భారత్ 15 విజయాలు సాధిస్తే.. భారత్ పైన కరీబియన్ జట్టుకు ఏడంటే ఏడు విజయాలు మాత్రమే ఉన్నాయి. విరాట్ కొహ్లీ, రాహుల్, బూమ్రా, శిఖర్ ధావన్, జడేజా లాంటి మేటి ఆటగాళ్లు లేకుండానే భారత్ ప్రస్తుత ఈ సిరీస్ లో పాల్గొంటోంది.

భారీస్కోరింగ్ వికెట్..

ప్రస్తుత నాలుగో టీ-20కి వేదికగా నిలిచిన లాడెర్ హిల్స్ వాతావరణం తీవ్రమైన ఉక్కపోతతో ఉండనుండడం రెండుజట్ల ఆటగాళ్ల సహనానికి పరీక్షకానుంది. ఇక్కడి గ్రౌండ్ చిన్నదికావడం, పిచ్ బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో..185 నుంచి 200 వరకూ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయని గ్రౌండ్ సిబ్బంది, గత రికార్డులు చెబుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 185కు పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. ఛేజింగ్ కు దిగిన జట్లకు ఈ గ్రౌండ్లో అంతంత మాత్రమే రికార్డు ఉండడంతో.. టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


విండీస్ కు డూ ఆర్ డై..

సిరీస్ నెగ్గాలంటే ఆఖరి రెండుమ్యాచ్ లను గెలిచితీరాల్సి ఉన్న కరీబియన్ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తుది జట్టులోకి కీమో పాల్ లేదా బ్రూక్స్ ల్లో ఎవరో ఒకరిని తీసుకొనే అవకాశం ఉంది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్, కీల్ మేయర్స్, మిడిలార్డర్ ఆటగాళ్లు రోవ్ మన్ పావెల్, డేవన్ థామస్ చక్కటి ఫామ్ లో ఉన్నా.. కీలక ఆటగాళ్లుగా పేరున్న కెప్టెన్ నికోలస్ పూరన్, హేట్ మెయర్ లు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితేనే.. భారత్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అమెరికాలోని భారత సంతతి క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న ఫ్లోరిడా గడ్డపై జరుగుతున్న ..సిరీస్ లోని ఈ రెండు ఆఖరి మ్యాచ్ లకూ స్టేడియం కిటకిటలాడనుంది. నాలుగోమ్యాచ్ లో భారత్ నెగ్గితే సిరీస్ ఖాయమైపోతుంది. ఇక సిరీస్ లోని ఆఖరిపోరు నామమాత్రంగా మిగిలిపోతుంది. అదే.. కరీబియన్ జట్టు నెగ్గితే.. సిరీస్ లోని ఆఖరాటకు ఎక్కడలేని ప్రాధాన్యం పెరుగుతుంది. కరీబియన్ గడ్డపై చెలరేగిన భారతజట్టు.. అమెరికా వేదికల్లోనూ అదేజోరు కొనసాగిస్తుందా.. తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

Next Story