Telugu Global
Sports

మహిళా క్రికెటర్లకు దండనే మందు- డయానా గరంగరం!

మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకొన్న హర్మన్‌ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టుపై క్రికెట్ దిగ్గజం డయానా ఎడుల్జీ మండి పడ్డారు.

మహిళా క్రికెటర్లకు దండనే మందు- డయానా గరంగరం!
X

మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకొన్న హర్మన్‌ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టుపై క్రికెట్ దిగ్గజం డయానా ఎడుల్జీ మండి పడ్డారు.

పురుషులతో సమానంగా సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు అందుకొంటున్న భారత మహిళా క్రికెటర్లలో జవాబుదారీ తనం లోపించిందని, నిర్లక్ష్యం, లెక్కలేని తనం, అంకితభావలోపం స్పష్టం కనిపిస్తున్నాయని, వారిని దండించాల్సిన సమయం వచ్చిందని భారత మహిళా క్రికెట్ దిగ్గజ క్రికెటర్, క్రికెట్ సలహామండలి మాజీ సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు.

సెమీస్ ఓటమి స్వయం కృతం...

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా చేతిలో భారతజట్టు ఓటమిని స్వయంకృతంగా డయానా అభివర్ణించారు.

భారత్ ను ఆస్ట్ర్రేలియా ఓడించింది అనేకంటే..ఆస్ట్ర్రేలియాకే భారత్ విజయం కట్టబెట్టిందని చేప్పుకోవాల్సి వస్తుందని ఆక్షేఫించారు.

గతిలేని బౌలింగ్, చెత్తఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగెత్తడంలో నిర్లక్ష్యం, ఆస్ట్ర్రేలియా లాంటి ప్రపంచ మేటి ప్రత్యర్థిజట్టుతో సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడుతున్నామని స్పృహలేని తత్వాన్ని 67 సంవత్సరాలు డయానా తీవ్రంగా తప్పుపట్టారు.

పురుషులతో సమానంగా ఆటేదీ?

మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా శిక్షణసదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, వేతనాలు చెల్లిస్తున్నా..ప్రమాణాలలో పురుషులతో సమానంగా ఎందుకు ఉండటం లేదంటూ నిలదీశారు.

ప్రపంచకప్ కు ఎంపిక చేసిన ప్రస్తుత భారతజట్టులోని 15 మంది సభ్యుల్లో 12మందికి తగిన ఫిట్ నెస్ లేదని, యోయో టెస్టులు పెడితే వారంతా విఫలమవుతారంటూ హెచ్చరించారు.

ఫీల్డింగ్ లో ఏమాత్రం చురుకుదనం కనిపించడం లేదని, ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత ఫీల్డర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రత్యర్థికి 20 నుంచి 25 వరకూ పరుగులు సమర్పించుకొన్నారని విమర్శించారు.

షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ రిచా విడిచిపెట్టిన క్యాచ్ ల కారణంగానే ఆస్ట్ర్రేలియా 172 పరుగుల భారీస్కోరు చేయగలిగిందని గుర్తు చేశారు.

కెప్టెన్ అలా కూడా రనౌట్ అవుతుందా?

173 పరుగుల లక్ష్యచేధనకు దిగిన భారత్ కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్- జెమీమా రోడ్రిగేజ్ ..నాలుగో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో ఊపిరిపోశారని, ఆఖరి 32 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన భారతజట్టు ఓటమికి..జెమీమా నిర్లక్ష్యపు షాటు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ లెక్కలేని తనపు రనౌటే కారణమని తేల్చి చెప్పారు.

ఓపెనర్ షెఫాలీవర్మ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ వరుసగా విఫలం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని, వైస్ కెప్టెన్ స్మృతి మందన బ్యాటింగ్ లో నిలకడలేకుండా పోయిందని విమర్శించారు.

మహిళ క్రికెటర్లలో నిర్లక్ష్యం బాగా కనిపిస్తోందని, 2017 వన్డే ప్రపంచకప్, 2020 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ , కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ల్లో పరాజయాలు పొందటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

మహిళా క్రికెటర్లలో జవాబుదారీ తనం రావాలని, తగిన ఫిట్ నెస్ లేకుండా, నిలకడగా రాణించకుండా, నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారని దండించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు.

1970 దశకంలో భారత దిగ్గజ స్పిన్నర్ గా పేరుపొందిన డయానా ఎడుల్జీని ..భారత క్రికెట్ పరిపాలన వ్యవహారాల కోసం సుప్రీంకోర్డు నియమించిన కమిటీలో సభ్యురాలిగా నియమించింది.33 నెలలపాటు డయానా భారత క్రికెట్ సలహామండలి సభ్యురాలిగా మహిళా క్రికెట్ కోసం పాటుపడ్డారు.

First Published:  25 Feb 2023 8:40 AM GMT
Next Story