Telugu Global
Sports

ఎప్పటికీ సచినే నాహీరో- విరాట్ కొహ్లీ!

తన హీరో సచిన్ ప్రపంచ రికార్డును సమం చేయటం గొప్పగౌరవమని భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ మురిసిపోతున్నాడు....

ఎప్పటికీ సచినే నాహీరో- విరాట్ కొహ్లీ!
X

తన హీరో సచిన్ ప్రపంచ రికార్డును సమం చేయటం గొప్పగౌరవమని భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ మురిసిపోతున్నాడు....

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న మాట భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీకి అతికినట్లు సరిపోతుంది. భారత్ క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన ప్రపంచకప్ 8వ రౌండ్ పోరులో శతకం బాదడం ద్వారా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల ప్రపంచ రికార్డును విరాట్ సమం చేశాడు. ప్రపంచకప్ మిగిలిన మ్యాచ్ ల్లో మరొక్క సెంచరీ చేయగలిగితే 50 శతకాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలుగుతాడు. అయితే..సచిన్ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చిన తాను..తన ఆరాధ్యదైవం పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేయగలగటం తన లభించిన గొప్పగౌరవమని ప్రకటించాడు.

సచిన్ పరంపరను కొనసాగిస్తున్నా.....

భారత క్రికెట్ కు సచిన్ 22 సంవత్సరాలపాటు అందించిన అసాధారణ సేవలు, అమూల్యమైన వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నట్లు విరాట్ కొహ్లీ ప్రకటించాడు.

మాస్టర్ ప్రపంచరికార్డును సమం చేసిన అనంతరం తన మనసులో మాట బయటపెట్టాడు.

అంత్జాతీయ క్రికెట్లో తాను ఎంత సాధించినా సచిన్ తర్వాతేనని, సచిన్ అంత గొప్పవాడిని తాను కానేకానని విరాట్ చెప్పాడు. సచిన్ ఆడుతుంటే టీవీల ద్వారా చూసి తాను క్రికెట్ పట్ల మక్కువ పెంచుకొన్నానని, సచిన్ తో కలసి 2011 ప్రపంచకప్ ఆడానని, సచిన్ రిటైర్మెంట్ తర్వాత మాస్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని తెలిపాడు.

సచినే ఎప్పటికీ తన హీరో అని తేల్చి చెప్పాడు.

ఈడెన్ గార్డెన్స్ లో అరుదైన శతకం...

విరాట్ కొహ్లీ తన 15 సంవత్సరాల కెరియర్ లో గతంలో సాధించిన 48 వన్డే సెంచరీలకు భిన్నమైన శతకాన్ని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును సమం చేయగలిగాడు.

బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగా లేని ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన ఒక్కో పరుగు కోసం చెమటోడ్చి ఆడాడు, నేర్పుఓర్పులకు తన అసాధారణ పిట్ నెస్ ను జోడించి

మూడంకెల స్కోరును సాధించగలిగాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ ఆట 6వ ఓవర్లో అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ ...కోల్ కతా ఉక్కబోత వాతావరణంలో మూడున్నర గంటలపాటు క్రీజులో నిలిచాడు.

ఎంతో సహనం, సంయమనంతో ఆడి 10 ఫోర్లతో 101 పరుగులతో అజేయగా నిలిచాడు. దక్షిణాఫ్రికా పై భారత్ 243 పరుగుల భారీవిజయంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

సచిన్ పరిపూర్ణ బ్యాటర్.....

సచిన్ పరిపూర్ణ బ్యాటర్ అని, తనను మాస్టర్ సచిన్ తో పోల్చిచూడటం తగదని విరాట్ చెప్పాడు. సచిన్ కు తాను సరిజోడీకానేకాదని, సచిన్ తర్వాతే తానని సవినయంగా ప్రకటించాడు.

తన 35వ పుట్టినరోజునే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రపంచకప్ మ్యాచ్ జరగడం, తన కోసం తరలి వచ్చిన 70వేల మంది అభిమానుల సమక్షంలో ప్రపంచ రికార్డు శతకంతో తన హీరో సచిన్ సరసన నిలవడం తనకు ఓ కలగా, భావోద్వేగాల సమాహారంగా ఉందని విరాట్ అభివర్ణించాడు.

విరాట్ కు సచిన్ హ్యాట్సాఫ్...!

తనపేరుతో ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచరికార్డును సమం చేసిన విరాట్ కొహ్లీని మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ సందేశం ద్వారా అభినందించాడు. 49 నుంచి 50వ శతకానికి చేరటానికి తనకు 365 రోజుల సమయం పట్టిందని, రానున్న రోజుల్లోనే విరాట్ 50వ శతకం సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలని మాస్టర్ ఆకాక్షించాడు.

తాను ప్రస్తుతం క్రికెట్ ఆడటాన్ని, శ్రమించడాన్ని, పరుగులు సాధించడాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్లు విరాట్ చెప్పాడు.

మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న పలు రికార్డులను ఇప్పటికే అధిగమించిన విరాట్ కు వన్డేలలో 49 సెంచరీలు, టీ-20లో ఓ శతకంతో పాటు..టెస్టు క్రికెట్లో 29 సెంచరీలు సాధించిన ఘనత ఉంది.

సచిన్ 49 వన్డే శతకాలను 434 ఇన్నింగ్స్ లో సాధిస్తే..విరాట్ మాత్రం 277 ఇన్నింగ్స్ లోనే మాస్టర్ రికార్డును సమం చేయటం విశేషం. సచిన్ తన 22 సంవత్సరాల కెరియర్ లో 100 అంతర్జాతీయ శతకాలు బాదితే..విరాట్ కేవలం 15 సంవత్సరాల కాలంలోనే 79 సెంచరీలు సాధించాడు.

సచిన్ పేరుతో ఉన్న 51 టెస్టు శతకాలు, 100 అంతర్జాతీయ సెంచరీలు, 30వేలకు పైగా పరుగుల ప్రపంచ రికార్డులను రానున్నకాలంలో విరాట్ అధిగమించాల్సి ఉంది.

First Published:  6 Nov 2023 3:21 AM GMT
Next Story