Telugu Global
Sports

ఆనంద్ 36 ఏళ్ల ఆధిపత్యానికి గుకేశ్ చెక్!

భారత చదరంగ చరిత్రలో గత నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రారాజుగా వెలిగిన సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు బుల్లి గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చెక్ చెప్పాడు.

ఆనంద్ 36 ఏళ్ల ఆధిపత్యానికి గుకేశ్ చెక్!
X

భారత చదరంగ చరిత్రలో గత నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని రారాజుగా వెలిగిన సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు బుల్లి గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చెక్ చెప్పాడు.

భారత చదరంగ క్రీడకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఒకే ఒక్కడు, గత 36 సంవత్సరాలుగా తిరుగులేని భారత నంబర్ వన్ ప్లేయర్ గా ఒక వెలుగు వెలిగిన దిగ్గజ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది.

గత మూడున్నర దశాబ్దాల కాలంగా భారత టాప్ ర్యాంక్ ప్లేయర్ గా ఉంటూ వచ్చిన 53 ఏళ్ల విశ్వనాథన్ ఆనంద్ కు తమిళనాడుకే చెందిన 17 ఏళ్ల పిల్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చెక్ చెప్పాడు. ఆనంద్ నంబర్ వన్ ర్యాంక్ ను చేజిక్కించుకొన్నాడు.

అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఇటీవలే ప్రకటించిన లైవ్ ర్యాంకింగ్స్ ప్రకారం విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించడం ద్వారా గుకేశ్ భారత నంబర్ వన్ ఆటగాడి ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగాడు.

బాలమేధావి గుకేశ్...

కేవలం 17 సంవత్సరాలకే చదరంగ క్రీడను కాచి వడపోసిన గ్రాండ్ మాస్టర్ గుకేశ్ గత ఏడాదికాలంగా పలు అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ , నిలకడగా రాణిస్తూ, సంచలన విజయాలతో గణనీయంగా తన రేటింగ్ పాయింట్లు పెంచుకోగలిగాడు.

భారత్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ వ్యక్తిగత విభాగంలో 11 పాయింట్లకు 9 పాయింట్లు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొన్నాడు. అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా ముగిసిన 2023 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన గుకేశ్...క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గత జులైలో 2750 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించడం ద్వారా...ఈ ఘనతను సంపాదించిన అత్యంత పిన్నవయస్కుడైన చెస్ ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గుకేశ్ కు కార్ల్ సన్ హ్యాట్సాఫ్!

ఐదుసార్లు విశ్వవిజేత, ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ మాగ్నుస్ కార్ల్ సన్ భారత పిల్లగ్రాండ్ మాస్టర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ప్రపంచకప్ చెస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో 17 సంవత్సరాల గుకేశ్ ను, ఫైనల్లో 18 ఏళ్ల ప్రజ్జానంద్ ను అధిగమించడం ద్వారా కార్ల్ సన్ ప్రపంచకప్ అందుకోగలిగాడు.

అయితే...క్లాసికల్ తరహాలో ఆడటంలో గుకేశ్ ను, స్పీడ్, లైట్నింగ్ తరహాలో ఆడటంలో ప్రజ్జానంద్ ను మించిన క్రీడాకారులు తనకు మరెవ్వరూ కనిపించలేదని, తాను గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ను అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నట్లు ప్రకటించాడు.

చదరంగ క్రీడను గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కేవలం 17 సంవత్సరాల వయసుకే సంపూర్ణంగా చదివేశాడని, ఈ కుర్రాడితో ఆడాలంటే 30 పైగా ఎత్తుల ముందు ఆలోచించక తప్పదంటూ కొనియాడాడు.

ప్రపంచ చెస్ ను రానున్న రోజుల్లో భారత కుర్రజోడీ గుకేశ్, ప్రజ్జానంద్ ఏలటం ఖాయమంటూ కితాబిచ్చాడు. టీనేజ్ సంచలనాలుగా పేరుపొందిన గుకేశ్, ప్రజ్జానంద్ ఇద్దరూ తమిళనాడులోని చెన్నైకి చెందినవారే కావడం మరో విశేషం.

First Published:  27 Aug 2023 11:14 AM GMT
Next Story