Telugu Global
Sports

ఆటపై దృష్టిపెట్టు, కొహ్లీకి గవాస్కర్ చురకలు!

ఆసియాకప్ టోర్నీలో రాణించడం ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్న భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీకి విఖ్యాత కామెంటీటర్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చురకలంటించారు

ఆటపై దృష్టిపెట్టు, కొహ్లీకి గవాస్కర్ చురకలు!
X

ఆసియాకప్ టోర్నీలో రాణించడం ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్న భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీకి విఖ్యాత కామెంటీటర్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చురకలంటించారు. ఆటపైనే దృష్టి పెట్టాలంటూ సలహా ఇచ్చారు...

అంతర్జాతీయ క్రికెట్లో గత మూడుసంవత్సరాలుగా వరుస వైఫల్యాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొని...ప్రస్తుత ఆసియాకప్ టోర్నీ ద్వారా తిరిగి గాడిలోపడిన మాస్టర్ బ్యాటర్ విరాట్ కొహ్లీకి భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్, విమర్శకుడు సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో చురకలంటించారు.

టెస్ట్ కెప్టెన్సీని తాను వదులుకొన్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ మినహా మిగిలిన వారెవ్వరూ ఫోను సందేశాల ద్వారా తనను పరామర్శించలేదంటూ ఆక్రోశం వెళ్ల గక్కిన విరాట్ కొహ్లీని గవాస్కర్ సున్నితంగా హెచ్చరించారు.

విరాట్ కొహ్లీ ఎవరినుంచి ఏమిఆశిస్తున్నాడో తనకు అర్థంకావడం లేదని, ఎవరెవరి దగ్గర తన ఫోన్ నంబర్ ఉందో, వారంతా ఎందుకు తనను ఫోను ద్వారా పరామర్శించలేదో..వారినే విరాట్ అడిగితే బాగుంటుందని, వారి పేర్లు బయటపెడితే ఇంకా బాగుంటుందంటూ చురకలంటించారు.

భారతజట్టుకు విరాట్ కెప్టెన్ గా ఉన్నంత కాలం అందరూ అండగా, మద్దతుగా నిలిచారని...తనకుతానుగా కెప్టెన్సీని వదులుకొన్న కొహ్లీ ఇప్పుడు కేవలం ఓ బ్యాటర్ మాత్రమేనన్నవాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ఆటపైనే దృష్టి పెట్టు- సన్నీ

ఓ జట్టుకు కెప్టెన్ గా ఉన్నసమయంలోనే బాధ్యతతో పాటు గౌరవం కూడా ఉంటుందని, అది లేన్నప్పుడు జట్టులోని మిగిలిన ఆటగాళ్లతో మనమూ సమానమేనని గవాస్కర్ గుర్తు చేశాడు.

గతంలో తాను భారత కెప్టెన్ గా 1985లో భారత్ కు బెన్సన్ అండ్ హెడ్జేస్ కప్ అందించిన తరువాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నానని..ఆ రోజు రాత్రి సహఆటగాళ్లతో కలసి ఆనందంగా గడిపానని, విందులో సందడి సందడి చేశామని గవాస్కర్ గుర్తు చేసుకొన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తరువాత ఆ విషయాన్ని ఎంత త్వరగా మరచిపోతే అంతమంచిందంటూ సలహా ఇచ్చాడు. ఇప్పుడిప్పుడు తిరిగి గాడిలో పడుతున్న కొహ్లీ క్రికెటేతర విషయాలపైన కంటే ఆటపైనే మనసు లగ్నం చేయాలని సలహా ఇచ్చాడు.

ప్రస్తుత ఆసియాకప్ లో తాను ఆడిన మూడుమ్యాచ్ ల్లోనూ చెలరేగి ఆడటం ద్వారా విరాట్ తన పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు. గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ పై 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్...హాంకాంగ్, పాకిస్థాన్ తో ముగిసిన సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ల్లో స్ట్ర్కోక్ ఫుల్ అర్థశతకాలు సాధించాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉన్న 31 అర్థశతకాల ప్రపంచ రికార్డును సైతం విరాట్ 32 హాఫ్ సెంచరీలతో తెరమరుగు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 70 శతకాలు బాదిన విరాట్...గత వెయ్యి రోజులుగా మూడంకెల స్కోరు సాధించలేకపోయాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో విరాట్ చోటు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రస్తుత ఆసియాకప్ ద్వారా పూర్వప్రాభవాన్ని సంపాదించుకోగలిగాడు.

First Published:  7 Sep 2022 2:45 AM GMT
Next Story