Telugu Global
Sports

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. యశస్వి జైశ్వాల్ రికార్డు

ఇంతకీ యశస్వి నమోదు చేసిన అరుదైన రికార్డు ఏంటంటే.. ఒక టెస్టు సిరీస్‌లో 20కి పైగా సిక్సర్లు కొట్టడం. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ను ఏ ఆటగాడు సాధించలేదు.

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. యశస్వి జైశ్వాల్ రికార్డు
X

టీమిండియా నయా సంచలనం యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన యశస్వి.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు యశస్వి.

ఇంతకీ యశస్వి నమోదు చేసిన అరుదైన రికార్డు ఏంటంటే.. ఒక టెస్టు సిరీస్‌లో 20కి పైగా సిక్సర్లు కొట్టడం. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ను ఏ ఆటగాడు సాధించలేదు. తాజాగా జరిగిన మూడో టెస్టులో 12 సిక్సర్లు బాదాడు యశస్వి. దీంతో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సమం చేశాడు. ఇక ఫస్ట్ టెస్టులో మూడు సిక్సర్లు, రెండో టెస్టులో ఏడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా ఇప్పటివరకూ ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టుల్లో 22 సిక్సర్లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు యశస్వి.

ఇక యశస్వి సిక్సర్ల మోతతో ఇండియా కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన టీమ్‌గా రికార్డుల కెక్కింది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 48 సిక్సర్లు నమోదు చేసింది టీమిండియా. గతంలోనూ ఈ రికార్డు టీమిండియా పేరిటే ఉండేది. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 47 సిక్సర్లు నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో 43 సిక్సర్లతో ఇంగ్లండ్‌ థర్డ్‌ ప్లేసులో, 40 సిక్సర్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో నిలిచాయి.

First Published:  18 Feb 2024 1:58 PM GMT
Next Story