Telugu Global
Sports

భారత ఫుట్ బాల్ జట్టుకు 15 మ్యాచ్ ల తర్వాత తొలి స్వదేశీ ఓటమి!

పీఫా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ లో భారత్ కు ఖతర్ షాకిచ్చింది. స్వదేశీగడ్డపై 15మ్యాచ్ ల అజేయరికార్డుకు తెరదించింది.

భారత ఫుట్ బాల్ జట్టుకు 15 మ్యాచ్ ల తర్వాత తొలి స్వదేశీ ఓటమి!
X

పీఫా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ లో భారత్ కు ఖతర్ షాకిచ్చింది. స్వదేశీగడ్డపై 15మ్యాచ్ ల అజేయరికార్డుకు తెరదించింది.

పీఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా అర్హత పోటీలలో భారత ప్రయాణం తడబడుతూ సాగుతోంది. భువనేశ్వర్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ పోరులో ఖతర్ చేతిలో పరాజయం తప్పలేదు.

ఖతర్ జోరుకు భారత్ బేజారు...

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ కంటే ఎన్నోస్థానాల ముందున్న ఖతర్ 3-0 గోల్స్ తో భారత్ ను చిత్తు చేసింది. సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టు ఏ విధంగానూ సరిజోడీ కాలేకపోయింది.

స్వదేశంలో ఆడిన గత 15 అంతర్జాతీయ సాకర్ మ్యాచ్ ల్లోనూ ఓటమి ఎరుగని భారత్ ఎట్టకేలకు తొలి పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఖతర్ ఆధిపత్యంతో కొనసాగిన ఈ ఏకపక్ష పోరు మొదటి భాగానికే ఒక్క గోలుతో వెనుకబడిన భారత్ రెండో భాగంలో ప్రత్యర్థికి మరో రెండుగోల్స్ సమర్పించుకొని. ఖతర్ చేతిలో 3-0 గోల్స్ తో ఓటమి పాలయ్యింది.

4వ నిముషంలోనే ఖతర్నాక్ గోల్....

భువనేశ్వర్ కళింగ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ క్వాలిఫైయర్ పోరులో ఆట తొలినిముషం నుంచే ఖతర్ దూకుడు కొనసాగింది. ఖతర్ ఫార్వర్డ్ లైన్ మెరుపు దాడులకు భారత రక్షణ వలయం విలవిలలాడింది.

ఆట 4వ నిముషంలోనే ముస్తఫా మషాల్ తొలిగోల్ తో ఖతర్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత నుంచి ఈక్వలైజర్ కోసం పోరాడటం భారత్ వంతుగా మారింది.

ఆట మొదటి క్వార్టర్ లో వెనుకబడిన భారత్ రెండో క్వార్టర్ లో పుంజుకోగలిగింది. పలుమార్లు ప్రత్యర్థి గోల్ పైకి దాడులు చేసినా...వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.

1-0 స్కోరుతో మొదటి భాగాన్ని ముగించిన ఖతర్ రెండో భాగంలో మరింత దూకుడుగా ఆడింది. భారత గోల్ కీపర్ అమరిందర్ అట్టుకొనకుండా ఉండి ఉంటే ఖతర్ మరో రెండుగోల్స్ సాధించి ఉండేదే.

సునీల్ చెత్ర్రీ విఫలం...

భారత కెప్టెన్ కమ్ కీలక ఆటగాడు సునీల్ చెత్ర్రీని ఖతర్ డిఫెండర్లు పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగారు. సునీల్ కు బంతి అందకుండా జాగ్రత్త పడటం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించగలిగారు.

ఆట 47వ నిముషంలో మిడ్ ఫీల్డర్ అల్మోయిజ్ అలీ చేసిన గోలుతో ఖతర్ ఆధిక్యం 2-0కి చేరింది. ఆ తర్వాత నుంచి మూడోగోల్ కోసం ఖతర్ ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఆట 86వ నిముషంలో అబ్దురిసాగ్ సాధించిన గోల్ తో ఖతర్ 3-0 విజయం నమోదు చేయగలిగింది.

స్వదేశీగడ్డపై భారత్ ఆడిన గత 16 మ్యాచ్ ల్లో 0-3 గోల్స్ తో పరాజయం పొందటం ఇదే మొదటిసారి. ఇటీవలే కువైట్ తో జరిగిన పోరులో 1-0 విజయం సాధించిన భారత్ రెండోరౌండ్లో ఖతర్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

2024 మార్చి 21న జరిగే మరో క్వాలిఫైయర్ పోరులో అప్ఘనిస్థాన్ తో భారత్ పోటీపడాల్సి ఉంది. ఆసియా జోన్ నుంచి ఇప్పటి వరకూ ప్రపంచకప్ కు అర్హత సాధించిన ఘనత ఇరాన్, సౌదీ అరేబియా, కొరియా,జపాన్ జట్లకు మాత్రమే ఉంది.

First Published:  22 Nov 2023 9:38 AM GMT
Next Story