Telugu Global
Sports

ప్రపంచకప్ లో సంచలనాల వెల్లువ!

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో రౌండ్ కో సంచలనం నమోదవుతోంది. ప్రపంచ మేటిజట్లపై పసికూన జట్లు కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్నాయి. ఫేవరెట్ జట్ల నాకౌట్ రౌండ్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ప్రపంచకప్ లో సంచలనాల వెల్లువ!
X

ప్రపంచకప్ లో సంచలనాల వెల్లువ!

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో రౌండ్ కో సంచలనం నమోదవుతోంది. ప్రపంచ మేటిజట్లపై పసికూన జట్లు కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్నాయి. ఫేవరెట్ జట్ల నాకౌట్ రౌండ్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి....

గల్ఫ్ గడ్డపై తొలిసారిగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ప్రపంచమేటి జట్లను అంతగా పేరులేని జట్లు అనూహ్య విజయాలతో కంగు తినిపిస్తున్నాయి.

దోహా వేదికగా జరిగిన గ్రూప్ లీగ్ పోరులో ప్రపంచ రెండోర్యాంకర్ బెల్జియంను మొరాకో కంగు తినిపిస్తే...జపాన్ ను కోస్టారికా జోరుకు పగ్గాలు వేసింది. గ్రూపు-ఇ, గ్రూపు-ఎఫ్ విభాగాలలో టాప్ ర్యాంక్ జట్ల అవకాశాలు గాల్లో దీపంలా మారాయి.

Advertisement

మొరాకో అతిపెద్ద విజయం...

ఆఫ్రికాజోన్ నుంచి ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన మొరాకో ప్రస్తుత ప్రపంచకప్ లో అతిపెద్ద విజయం నమోదు చేసింది. దోహాలోని అల్ తుమామా స్టేడియం వేదికగా జరిగిన పోరులో ప్రపంచ రెండోర్యాంక్ జట్టు బెల్జియం ను 22వ ర్యాంకర్ మొరాకో కోలుకోలేని దెబ్బతీసింది.

గ్రూప్- ఎఫ్ లీగ్ లో భాగంగా జరిగిన ఈపోరు మొదటి అర్థభాగంలో ఏజట్టు గోలు సాధించలేకపోయింది. బెల్జియం-మొరాకోజట్లు ఆత్మరక్షణకే ప్రాధాన్యమిస్తూ ఆడాయి.

Advertisement

అయితే..రెండోభాగం ముగింపు దశలో మొరాకో చెలరేగిపోయింది.

ఆట 73 నిముషంలో అబ్దుల్ హమీద్ సబేరీ, ఇంజ్యూరీ టైమ్ లో జఖరియీ అబు ఖలాల్ చెరో గోల్ సాధించడం ద్వారా అతిపెద్ద విజయాన్ని తమజట్టుకు అందించారు.

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే మొరాకోకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

బెల్జియం వెలవెల..

మ్యాచ్‌ ఆరంభం నుంచే బెల్జియం మిడ్ ఫీల్డ్ లో పట్టు సాధించేందుకు ప్రయత్నించగా.. మొరాకో ఆత్మరక్షణ ధోరణిలో పోరాటం మొదలు పెట్టింది. రెండుజట్లు ప్రత్యర్థి గోల్‌ పైకి పదేసి సార్లు దాడి చేయగా.. అందులో మొరాకో రెండు షాట్లను గోల్స్‌గా మలచగలిగింది. మ్యాచ్‌ మొత్తం గా చూస్తే.. బెల్జియం 67 శాతం బంతిని తమ అధీనంలో ఉంచుకున్నా ప్రయోజనం లేకపోయింది. అదే మొరాకో మాత్రం 33 శాతం మాత్రమే బంతిని తన అదుపులో ఉంచుకోడంతో పాటు అంది వచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని గోల్సుగా మలచుకోగలిగింది. మ్యాచ్‌ మొత్తంలో బెల్జియం ఆటగాళ్లు 651 పాస్‌లు అందించుకోగా.. మొరాకో ప్లేయర్లు 328 పాస్‌లకే పరిమితమయ్యారు.

తొలి అర్ధభాగంలో రెండుసార్లు గోల్‌ అవకాశాలను సృష్టించుకున్న బెల్జియం ప్లేయర్లు.. ఫినిషింగ్‌ లోపంతో గోల్‌ నమోదు చేయలేకపోయారు. దీంతో హాఫ్‌ టైమ్‌ వరకు ఇరు జట్లు 0-0తో నిలిచాయి. రెండో అర్ధభాగంలో అందివచ్చిన ఫ్రీ కిక్‌ అవకాశాన్ని సాబిరి సద్వినియోగ పరుచుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తి పోయింది. ఆట ఇంజ్యూరీ టైమ్ లో జకారియా మరో గోల్‌ కొట్టడంతో మొరాకో ఘనవిజయం సాధించింది.

జపాన్ కు కోస్టారికా షాక్...

గ్రూపు తొలిరౌండ్లో మాజీ చాంపియన్ జర్మనీపై 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించడం ద్వారా జోరు మీదున్న ఆసియా చాంపియన్ జపాన్ కు కోస్టారికా జట్టు రెండో రౌండ్లో షాకిచ్చింది.

ఖతర్ అహ్మ‌ద్‌బిన్ అలీ స్టేడియంలో ముగిసిన గ్రూప్-ఇ రెండో రౌండ్ పోరులో కోస్తారికా 1-0తో జ‌పాన్ పై విజయం సాధించింది. ఆట 81వ నిముషంలో కీషెర్ ఫుల్ల‌ర్ గోల్ సాధించడంతో కోస్తారికా ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ విజ‌యంతో కోస్టారికా గ్రూప్-ఇలో మూడో స్థానానికి చేరింది. జపాన్ పై కోస్టారికా నెగ్గడంతో..నాలుగుసార్లు విజేత జర్మనీ నాకౌట్ రౌండ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

ఈ మ్యాచ్ మొద‌టి అర్థ భాగంలో రెండు జ‌ట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ సాధించలేకపోయారు. రెండో అర్థ‌భాగంలో జ‌పాన్ టీమ్ దూకుడుగా ఆడింది.కోస్తారికా గోల్ పోస్ట్ వైపు దూసుకొచ్చి గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ, కోస్తారికా గోల్ కీప‌ర్, డిఫెన్స్ జ‌పాన్ గోల్ ప్ర‌యత్నాల్ని అడ్డుకున్నారు. తొలి మ్యాచ్‌లో కోస్టారికా జ‌ట్టు స్పెయిన్ చేతిలో 0-7 గోల్స్‌తో దారుణంగా ఓడిపోయింది. జ‌పాన్ టీమ్ త‌మ మొద‌టి మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ జ‌ర్మ‌నీపై 2-1 గోల్స్‌తో గెలిచింది.

మరో గ్రూప్ లీగ్ పోరులో క్రొయేషియా 4-1 గోల్స్ తో కెనడాను చిత్తు చేసింది. వరుసగా రెండు పరాజయాలతో కెనడాజట్టు లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టక తప్పలేదు.

Next Story