Telugu Global
Sports

ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ షూటౌట్!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్లోనే హాట్ ఫేవరెట్ బ్రెజిల్ పోటీ ముగిసింది. తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా 4-2తో పెనాల్టీ షూటౌట్ ద్వారా బ్రెజిల్ పై సంచలన విజయం సాధించింది.

ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ షూటౌట్!
X

ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ షూటౌట్!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్లోనే హాట్ ఫేవరెట్ బ్రెజిల్ పోటీ ముగిసింది. తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా 4-2తో పెనాల్టీ షూటౌట్ ద్వారా బ్రెజిల్ పై సంచలన విజయం సాధించింది...

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్ సంచలనంతో ఆరంభమయ్యింది. హాట్ ఫేవరెట్, ఐదుసార్లు విజేత, ప్రపంచ టాప్ ర్యాంకర్ బ్రెజిల్ పోటీ క్వార్టర్ ఫైనల్ రౌండ్లోనే ముగిసింది.

దోహాలోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ తొలి క్వార్టర్ ఫైనల్ నిర్ణితసమయంలో రెండుజట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో ఆటను ఎక్స్ ట్రాటైమ్ కు పొడిగించారు.

అదనపు సమయం మొదటి భాగంలో బ్రెజిల్ కు నైమర్ ఓ సూపర్ గోల్ తో ఆధిక్యం అందించాడు. బ్రెజిల్ విజయం ఖాయమనుకొంటున్న తరుణంలో ఎక్స్ ట్రా టైమ్ రెండో భాగంలో బ్రూన్ పెట్కోవిచ్ సాధించిన గోల్ తో క్రొయేషియా ఈక్వలైజర్ గోల్ సాధించి 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

క్రొయేషియా హీరో డోమనిక్...

ఎక్స్ ట్రా టైమ్ లో రెండుజట్లు 1-1తో సమఉజ్జీగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ పాటించారు. ఇందులో క్రొయేషియా నాలుగుకు నాలుగు స్పాట్ కిక్ లను గోల్స్ గా మలచుకోగా..బ్రెజిల్ విఫలమయ్యింది. బ్రెజిల్ ఆటగాళ్ల స్పాట్ కిక్ లను క్రొయేషియా గోల్ కీపర్ డోమనిక్ లివకోవిచ్ సమర్థవంతంగా అడ్డుకొని తనజట్టుకు సెమీస్ బెర్త్ ఖాయం చేశాడు.

బ్రెజిల్ ఆటగాళ్లు రోడ్రిగో, మార్కిన్హా లు వరుసగా విఫలం కావడంతో క్రొయేషియా గెలుపు ఖాయమైపోయింది. గత ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన 16వ ర్యాంకర్ క్రొయేషియా ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం.

క్రొయేషియా తరపున నికోలా లాసిచ్, లావ్రో మేజర్, మాడ్రిచ్, ఆర్సిచ్ తమ పెనాల్టీలను గోల్స్ గా మలచగా..బ్రెజిల్ ఆటగాళ్లలో రోడ్రిగో, మార్కిన్హో విఫలమయ్యారు.

ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్ పై పెనాల్టీ షూటౌట్ లో నెగ్గిన క్రొయేషియా...క్వార్టర్ ఫైనల్లోనూ పెనాల్టీల ద్వారానే మ్యాచ్ నెగ్గడం విశేషం. అంతేకాదు..క్రొయేషియా ఆడిన గత తొమ్మిది అంతర్జాతీయ సాకర్ టోర్నీ మ్యాచ్ ల్లో ఎనిమిదిసార్లు ఎక్స్ ట్రా టైమ్ లో విజయాలు సాధించడం విశేషం.

నైమర్ కన్నీరుమున్నీరు...

తమ ప్రపంచకప్ ఆశలు క్రొయేషియా చేతిలో భగ్నం కావడంతో బ్రెజిల్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని వేలాదిమంది సాంబా అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.

బ్రెజిల్ స్టార్ స్ట్ర్రయికర్ నైమర్ తమజట్టు ఓటమితో భోరున విలపించాడు. మరోసారి బ్రెజిల్ తరపున ప్రపంచకప్ ఆడే అవకాశం తనకు ఇక లేదంటూ లబోదిబోమన్నాడు.

గత నాలుగు ప్రపంచకప్ టో్ర్నీలలోనూ యూరోపియన్ ప్రత్యర్థుల చేతుల్లోనే బ్రెజిల్ జట్టు సెమీస్ కు ముందే పరాజయాలు పొందటం ఓ ఆనవాయితీగా ఉంటూ వస్తోంది.

రికార్డుస్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ నెగ్గాలంటే బ్రెజిల్ జట్టు మరో నాలుగేళ్లపాటు వేచిచూడక తప్పదు.

పరాజయభారంతో శోకంలో మునిగిన బ్రెజిల్ ఆటగాళ్లను ప్రత్యర్థి క్రొయేషియా ఆటగాళ్లు ఓదార్చుతూ తమ క్రీడాస్ఫూర్తిని చాటుకొన్నారు.

కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన అతిచిన్నదేశం క్రొయేషియా ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో వరుసగా రెండోటోర్నీల సెమీస్ చేరిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

వెటరన్ ఆటగాడు, 37 సంవత్సరాల మిడ్ ఫీల్డర్ లూకా మాడ్రిచ్ మినహా మిగిలిన ఆటగాళ్లతా యువకులే కావడం మరో విశేషం.

నాకౌట్ రౌండ్ మ్యాచ్ ల్లో క్రొయేషియా వరుసగా రెండు విజయాలు సాధించడంలో గోల్ కీపర్ డోమనిక్ ప్రధానపాత్ర వహించాడు. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో మాజీ చాంపియన్ అర్జెంటీనాతో క్రొయేషియా తలపడనుంది.

First Published:  10 Dec 2022 5:46 AM GMT
Next Story