Telugu Global
Sports

ప్రపంచకప్ సాకర్ లో ఆసియాజట్ల జోరు!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ లో ఆసియా అగ్రశ్రేణిజట్ల సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీపై ఆసియాదిగ్గజం జపాన్ అద్భుత విజయంతో సంచలనం సృష్టించింది.

ప్రపంచకప్ సాకర్ లో ఆసియాజట్ల జోరు!
X

ప్రపంచకప్ సాకర్ లో ఆసియాజట్ల జోరు!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ లో ఆసియా అగ్రశ్రేణిజట్ల సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీపై ఆసియాదిగ్గజం జపాన్ అద్భుత విజయంతో సంచలనం సృష్టించింది...

ప్రపంచ ఫుట్ బాల్ లో యూరోప్, లాటిన్ అమెరికాజట్ల ఆధిపత్యానికి ఆసియాజట్లు గండికొడుతూ తమ ఉనికిని చాటుకొంటున్నాయి. ఆసియాగడ్డపై రెండోసారిగా...ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ సాకర్ గ్రూపు లీగ్ లో మాజీ చాంపియన్ అర్జెంటీనాను సౌదీ అరేబియా 2-1 గోల్స్ తో కంగు తినిపించిన కొద్దిగంటల వ్యవధిలోనే..మరో ఆసియాజట్టు జపాన్ సంచలన విజయం నమోదు చేసింది.

పోరాడి నెగ్గిన జపాన్...

గ్రూప్ -ఇ లీగ్ లో భాగంగా జరిగిన ప్రారంభ సమరంలో నాలుగుసార్లు ఆసియాకప్ విజేత జపాన్ 2-1 గోల్స్ తో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీపై అనూహ్య విజయం సాధించింది.

ఆట మొదటి భాగమంతా జర్మనీదే పైచేయిగా కనిపించినా...రెండో భాగంలో జపాన్ అనూహ్యంగా పుంజుకొని వెంట వెంటనే రెండు మెరుపు గోల్స్ తో విజేతగా నిలిచింది.

ఆట మొదటి భాగంలో లభించిన పెనాల్టీని జర్మన్ ఆటగాడు ఇల్కాయ్ గుండోగాన్ గోలుగా మలచి తన జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు.

ఆట మొదటి భాగానికి 1-0తో వెనుకబడిన జపాన్ రెండోభాగంలో సర్వశక్తులూ కూడదీసుకొని ఆడి జర్మన్ గోల్ పై మెరుపు దాడులు చేసింది. జర్మన్ డిఫెన్స్ ను పదేపేదే కకావికలు చేస్తూ మెరుపులు మెరిపించింది.

ఆట 75వ నిముషంలో సబ్ స్టిట్యూట్ ఆటగాడు రిట్సు డోవన్ గోల్ తో జపాన్ ఈక్వలైజర్ సాధించడంతో ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది. ఆ తరువాత 8 నిముషాల వ్యవధిలోనే టకుమా అసానో జపాన్ తరపున విజయానికి అవసరమైన రెండోగోల్ సాధించాడు.

జపాన్ ఆధిక్యం 2-1కు చేరడంతో జర్మనీ ఈక్వలైజర్ కోసం చేసిన ప్రయత్నాలను జపాన్ డిఫెండర్లు వమ్ము చేయగలిగారు. గోల్ చేయటానికి వచ్చిన పలు అవకాశాలను జర్మన్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో జపాన్ మరో సంచలన విజయంతో నాకౌట్ రౌండ్ కు మరింత చేరువయ్యింది.

గ్రూపు మిగిలిన రెండుమ్యాచ్ ల్లో స్పెయిన్, కోస్టారికా జట్లతో జపాన్ తలపడాల్సి ఉంది. ఆఖరి రెండురౌండ్లలో ఒక్క విజయం సాధించినా జపాన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలుగుతుంది.

జర్మనీకి డూ ఆర్ డై....

2018 ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ చేరడంలో విఫలమైన జర్మన్ జట్టుకు మరోసారి అదే అనుభవం ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. గ్రూప్ ఆఖరి రెండురౌండ్ పోటీలలో..

స్పెయిన్, కోస్టారికాజట్లను జర్మనీ ఓడించి తీరాల్సి ఉంది. కోస్టారికాపై భారీ తేడాతో నెగ్గడంతో పాటు...స్పెయిన్ తో మ్యాచ్ లో సైతం విజయం సాధించాల్సి ఉంది.

స్పెయిన్ 7- కోస్టారికా 0

ఇదే గ్రూపులో భాగంగా జరిగిన మరో తొలిరౌండ్ పోటీలో మాజీ చాంపియన్ స్పెయిన్ రికార్డు విజయం నమోదు చేసింది. కోస్టారికాతో జరిగిన ఏకపక్ష పోరులో 7-0 గోల్స్ తో అతిపెద్ద విజయం సాధించింది. ప్రపంచకప్ సాకర్ లో స్పెయిన్ జట్టుకు ఇదే అతిపెద్ద విజయంగా రికార్డుల్లో చేరింది.

అంతేకాదు..మొత్తం 90 నిముషాల ఆటలో 1000 పాస్ లు నమోదైన పోటీగా ప్రపంచకప్ చరిత్రలోనే ఈ మ్యాచ్ నిలిచింది. స్పెయిన్ జట్టు 82 శాతం సమయం బంతిని తన అదుపులోనే ఉంచుకోడం ద్వారా మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చింది.

దోహాలోని అల్ తుమామా స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలో స్పెయిన్ స్ట్రయికర్ ఫెరాన్ టోరెస్ 2 గోల్స్, మార్కో ఏషెన్సియో, డానీ ఓల్మో, గావీ, కార్లోస్ సోలెర్, అల్వారో మొరాటో తలో గోలు సాధించారు.

2010 విశ్వవిజేత స్పెయిన్ జట్టులోని ముగ్గురు ఫార్వర్డ్ లూ ఆట మొదటి భాగంలోనే గోల్స్ సాధించడం విశేషం.

2014 ప్రపంచకప్ టోర్నీలో ఇటలీ, ఉరుగ్వేజట్లను ఓడించి..ఇంగ్లండ్ తో పోటీని డ్రాగా ముగించడం ద్వారా సంచలన సృష్టించిన కోస్టారికా..ప్రస్తుత ప్రపంచకప్ ఈ పోటీలో మాత్రం స్పెయిన్ ముందు తేలిపోయింది.

స్పెయిన్ యువఆటగాడు గవీ 18 సంవత్సరాల 110 రోజుల వయసులో గోల్ సాధించిన మూడో అతిపిన్న వయస్కుడైన ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. గతంలో ఇదే ఘనత సాధించిన ఆటగాళ్లలో మెక్సికోకు చెందిన మాన్యుల్ రోసాస్, బ్రెజిల్ దిగ్గజం పీలే ఉన్నారు.

బెల్జియం తొలి గెలుపు...

గ్రూప్-ఎఫ్ లో భాగంగా జరిగిన మరో తొలిరౌండ్ పోటీలో బెల్జియం 1-0తో కెనడాను అధిగమించింది. గత 36 సంవత్సరాలలో తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన కెనడా మొదటి భాగంలో బెల్జియంకు గట్టి పోటీ ఇచ్చినా ..రెండో భాగంలో అదే స్థాయి ఆట ప్రదర్శించలేకపోయింది. బెల్జియం తరపున మిచీ బాట్సుయా

44వ నిముషంలో సాధించిన గోలుతో బెల్జియం విజేతగా పూర్తిపాయింట్లు సాధించగలిగింది.

ఇదే గ్రూపులో భాగంగా ట్యునీసియా- మొరాకోజట్ల నడుమ జరిగిన మరో పోటీ 0-0తో డ్రాగా ముగిసింది.

మొత్తం మీద..ప్రపంచకప్ మొదటి నాలుగురోజుల పోటీలలోనే ఆసియాజట్లు సౌదీ అరేబియా, జపాన్ జట్లు సంచలన విజయాలతో 2022 ప్రపంచకప్ కే మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలిగాయి.

First Published:  24 Nov 2022 9:35 AM GMT
Next Story