Telugu Global
Sports

హాటు హాటుగా గోల్డెన్ బూట్ ఫైట్!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ ముగియటానికి ఇంకా రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే..అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ ఫైట్ లో మాత్రం అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ, ఫ్రెంచ్ థండర్ ఎంబప్పే ముఖాముఖీ తలపడుతున్నారు.

హాటు హాటుగా గోల్డెన్ బూట్ ఫైట్!
X

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ ముగియటానికి ఇంకా రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే..అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ ఫైట్ లో మాత్రం అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ, ఫ్రెంచ్ థండర్ ఎంబప్పే ముఖాముఖీ తలపడుతున్నారు.....

ఖతర్ వేదికగా గత మూడువారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతూ వచ్చిన 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టో్ర్నీ ముగింపు దశకు చేరింది. శనివారం మూడోస్థానం కోసం మొరాకో, క్రొయేషియా, ఆదివారం అర్జెంటీనాతో ఫ్రాన్స్ జరిపే టైటిల్ సమరంతో సమరానికి తెరపడనుంది.

అయితే..అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికిచ్చే గోల్డెన్ బూట్ ఫైట్ లో మాత్రం ఫైనల్స్ చేరిన అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ సూపర్ స్ట్ర్రయికర్ ఎంబప్పే మాత్రమే మిగిలారు.

సమఉజ్జీలుగా మెస్సీ, ఎంబప్పే...

గ్రూప్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకూ ఆడిన ఆరు రౌండ్ల పోటీలలో అర్జెంటీనా సారధి లయనల్ మెస్సీ, ఫ్రాన్స్ తురుపుముక్క ఎంబప్పే చెరో ఐదుగోల్స్ చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచారు.

సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఈ రెండుజట్లే తలపడనున్నాయి. ఫైనల్లో తమజట్టు తరపున మెస్సీ లేదా ఎంబప్పే గోల్స్ సాధించగలిగితే..గోల్డెన్ బూట్ అవార్డును అందుకోగలుగుతారు.

మెస్సీనా..? ఎంబప్పేనా?

అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు, కెప్టెన్ మెస్సీ వయసు 35 సంవత్సరాలు. గత నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చినా..తనజట్టుకు మెస్సీ ట్రోఫీని అందించలేకపోయాడు. పైగా మెస్సీ కెరియర్ లో ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుండడంతో తనజట్టుకు ఫిఫా ప్రపంచ ట్రోఫీని అందించాలని కలలు కంటున్నాడు.

ట్రోఫీతో పాటు గోల్డెన్ బూట్ సాధించే అవకాశం సైతం ప్రస్తుత ప్రపంచకప్ లో మెస్సీకి చిక్కింది.

తనజట్టు తరపున ప్రస్తుత ప్రపంచకప్ గ్రూప్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ వరకూ ఆరుమ్యాచ్ లు ఆడిన మెస్సీ ఐదు గోల్స్ మాత్రమే చేయగలిగాడు.

ఇందులో అత్యధికంగా పెనాల్టీని గోల్స్ గా మలచినవే ఎక్కువగా ఉన్నాయి. సెమీఫైనల్లో క్రొయేషియాను 3-0 గోల్స్ తో చిత్తు చేయడంలో మెస్సీ ప్రధాన పాత్ర వహించాడు.

సహఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు కల్పించడంలో మిడ్ ఫీల్డర్ గా మెస్సీకి మెస్సీ మాత్రమే సాటి.

సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, క్రొయేషియాజట్ల పైన పెనాల్టీల ద్వారా మూడుగోల్స్ సాధించిన మెస్సీ..మిగిలిన రెండు గోల్స్ ను ఫీల్డ్ గోల్స్ గా నమోదు చేశాడు.

ఫీల్డ్ గోల్స్ కింగ్ ఎంబప్పే...

నాలుగేళ్ల క్రితం రష్యా వేదికగా ముగిసిన 2018 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడంలో సూపర్ స్ట్ర్రయికర్ ఎంబప్పే కీలకపాత్ర పోషించాడు. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

తనజట్టు తరపున ఇప్పటి వరకూ ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ ఎంబప్పే సాధించిన మొత్తం ఐదుగోల్స్ ఫీల్డ్ ద్వారా వచ్చినవే కావడం విశేషం.

సెమీఫైనల్లో మొరాకోను ఫ్రాన్స్ 2-0తో ఫ్రాన్స్ చిత్తు చేసినా..ఎంబప్పే మాత్రం గోల్ సాధించలేకపోయాడు.

ఆదివారం జరిగే టైటిల్ పోరులో సైతం మెస్సీ, ఎంబప్పే గోల్స్ సాధించి సమఉజ్జీలుగా నిలిచే పక్షంలో..అత్యధిక ఫీల్డ్ గోల్స్ సాధించిన ఆటగాడికే గోల్డెన్ బూట్ అంద చేస్తారు.

ఒకవేళ ఫీల్డ్ గోల్స్ లోనూ ఇద్దరూ సమంగా ఉంటే..సహఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు ఎక్కువగా కల్పించిన ఆటగాడినే గోల్డెన్ బూట్ కు ఎంపిక చేస్తారు.

ఫైనల్లో ఎవరు ఏ తరహా గోల్ సాధించగలరు, ఎవరు గోల్డెన్ బూట్ అందుకోగలరు అన్నది తెలుసుకోవాలంటే...సూపర్ సండే టైటిల్ ఫైట్ వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  16 Dec 2022 9:26 AM GMT
Next Story