Telugu Global
Sports

పురుషుల కోటలో మహిళల పాగా!

క్రీడారంగంలో సైతం పురుషులతో సమానంగా మహిళలూ రాణిస్తున్నారు. తగిన అవకాశం కల్పించి ప్రోత్సహిస్తే దశాబ్దాలుగా పురుషులు నిర్వర్తించే అంపైరింగ్, రిఫరీ బాధ్యతల్ని తాము సైతం సమర్థవంతంగా నిబాయించగలమని చెప్పకనే చెబుతున్నారు.

పురుషుల కోటలో మహిళల పాగా!
X

కాలం మారింది. కాలానుగుణంగా పురుషులు, మహిళలూ మారుతూ వస్తున్నారు. రానురాను పురుషులు, మహిళలూ అన్నతేడా చెరిగిపోతూ వస్తోంది. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.....

క్రీడారంగంలో సైతం పురుషులతో సమానంగా మహిళలూ రాణిస్తున్నారు. తగిన అవకాశం కల్పించి ప్రోత్సహిస్తే దశాబ్దాలుగా పురుషులు నిర్వర్తించే అంపైరింగ్, రిఫరీ బాధ్యతల్ని తాము సైతం సమర్థవంతంగా నిబాయించగలమని చెప్పకనే చెబుతున్నారు.

ప్రపంచ క్రీడ ఫుట్ బాల్, భారత్ లో అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడ క్రికెట్లో సైతం పురుషుల ప్రపంచ, దేశవాళీ మ్యాచ్ ల్లో రిఫరీలు, లైన్ అంపైర్లు, అంపైర్లు, ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలుగా మహిళలు విధులు నిర్వర్తిస్తూ వారేవ్వా! అనిపించుకొంటున్నారు.


పురుషుల సరసన మహిళలు...

వేగంగా సాగిపోయే ఫుట్ బాల్ క్రీడలో రిఫరీలు, లైన్ అంపైర్లుగాను, రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదురోజులపాటు ఎండవేడిమి లేదా శీతల వాతావరణంలో సాగే క్రికెట్ మ్యాచ్ ల్లో ఫీల్డ్ అంపైర్లుగాను, మ్యాచ్ రిఫరీలుగానూ రాణించాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తిసామర్థ్యాలు, సమయస్ఫూర్తి, చెక్కుచెదరని ఏకాగ్రత ఉండి తీరాలి.

గత కొద్దిదశాబ్దాల కాలంగా పురుషుల, మహిళల ఫుట్ బాల్, క్రికెట్ మ్యాచ్ లకు పురుషులు మాత్రమే అంపైర్లుగా, రిఫరీలుగా వ్యవహరించేవారు. అయితే..పురుషులు, మహిళలూ సమానమే అన్న భావనతో అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా ), అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ ), దాని అనుబంధ సంఘాలూ మహిళలకు సైతం తగిన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తున్నాయి. పురుషులు మాత్రమే నిర్వర్తించే బాధ్యతల్ని మహిళలకు సైతం అప్పజెబుతున్నాయి.

ప్రపంచ ఫుట్ బాల్ లో...

మెరుపువేగంతో సాగిపోయే ఫుట్ బాల్ లో రిఫరీ బాధ్యతలు ఎంతో సవాలుతో కూడుకొని ఉంటాయి. ఆటగాళ్లతో పాటు రిఫరీలు సైతం ఆ చివరి నుంచి ఈ చివరికి..ఈ చివరి నుంచి ఆ చివరికి నిరంతరం పరుగుగెడుతూనే ఉంటూ మ్యాచ్ ను పర్యవేక్షించాలి. అలాంటి కష్టమైన, క్లిష్టతరమైన సవాళ్లను స్వీకరించడానికి మహిళలు సైతం ముందుకు వస్తున్నారు.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య మహిళలను వివిధ విభాగాలలో ప్రోత్సహించడానికి తగిన చర్యలు చేపట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు సైతం అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహించే రిఫరీలు, లైన్ అంపైర్ల విభాగంలో మహిళలకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళల ఫుట్ బాల్ మ్యాచ్ లను మహిళా రిఫరీలే నిర్వహించేలా ఇప్పటి వరకూ సహకరిస్తూ వచ్చింది.

మహిళల ప్రపంచకప్ ఫుట్ బాల్ మ్యాచ్ లను మహిళా అంపైర్లు, రిఫరీలు నిర్వహించుకొనేలా గత కొద్ది సంవత్సరాలుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. అయితే..ప్రస్తుత 2022 పిఫా పురుషుల ప్రపంచకప్ లో సైతం రిఫరీలుగా, లైన్ అంపైర్లుగా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించింది.

ఫ్రెంచ్ రిఫరీకి అరుదైన గౌరవం..

పురుషుల ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళ గౌరవాన్ని ఫ్రెంచ్ రిఫరీ స్టెఫానీ ప్రాఫర్ట్ దక్కించుకొంది. జర్మనీ-కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఫ్రాపర్ట్‌ ప్రధాన రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది.

అంతేకాదు ఈ మ్యాచ్‌కు లైన్ అంపైర్లందరూ మహిళలే కావడం విశేషం. బ్రెజిల్‌కు చెందిన న్యూజా బాక్‌, మెక్సికోకు చెందిన కరేన్‌ డయాజ్‌ మెడిన సహాయ రిఫరీలుగా వ్యవహరించారు. అమెరికాకు చెందిన కాథరిన్‌ నెస్బిట్‌ నాలుగో అంపైర్‌గా వీడియా రివ్యూ జట్టులో ఆఫ్‌సైడ్‌ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.

పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లు....

క్రికెట్లో అంపైరింగ్ బాధ్యతలు కేవలం పురుషులు మాత్రమే కాదు...మహిళలు సైతం సమర్థవంతంగా నిర్వర్తించగలరని భారత జోడీ బృందా రాఠీ, జననీ నారాయణన్

చాటుకొన్నారు. క్రికెట్ అంపైర్ల కోసం బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే కాదు... జాతీయస్థాయిలో సబ్ -జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో అంపైర్లుగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఐసీసీ మహిళా అంపైర్లుగా ఎదిగిన భారత తొలి మహిళా అంపైర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

12కు చేరిన మహిళా క్రికెట్ అంపైర్లు

ఐసీసీ నియమించిన మహిళా క్రికెట్ అధికారులలో భారత్ కు చెందిన జీఎస్ లక్ష్మి, మరో మహిళ షాండర్ ఫ్రిట్జ్ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలుగా సేవలు అందిస్తున్నారు.

ఐసీసీ ప్యానెల్ అంపైర్లలో ఇప్పటికే చోటు సంపాదించిన వివిధ దేశాలకు చెందిన మహిళల్లో లారెన్ అగెన్ బాగ్, కిమ్ కాటన్, శివానీ మిశ్రా, క్లెయిరీ పోలోసాక్, సుజీ రెడ్ ఫెర్న్, ఎల్యోసీ షెర్యడాన్, మేరీ వాల్ డ్రోన్, జాక్వెలిన్ విలియమ్స్ ఉన్నారు. ఇప్పుడు జననీ నారాయణన్, వృంథా రాఠీ ఈ బందంలో వచ్చి చేరారు.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా నిర్వహించిన 2022 మహిళా చాలెంజర్ టీ-20 టోర్నీని మహిళా అంపైర్లే నిర్వహించారు.

రంజీమ్యాచ్ లకూ మహిళా అంపైర్లు...

భారత దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్రలో ముగ్గురు మహిళా అంపైర్లు తొలిసారిగా పురుషుల మ్యాచ్ ను నిర్వహించే అవకాశం దక్కించుకొన్నారు.

డిసెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానున్న 2022-23 రంజీ సీజన్‌లో బృందా రాఠి, జనని నారాయణన్‌, గాయత్రి వేణుగోపాలన్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. గతంలో గాయత్రి ఒక రంజీ మ్యాచ్‌కు నాలుగో అంపైర్‌గా వ్యవహరించారు. బీసీసీఐతో రిజిస్టర్‌ అయిన 150 మంది అంపైర్లలో ఈ ముగ్గురే మహిళా అంపైర్లు కావడం గమనార్హం. వీరికి కొన్ని రంజీ మ్యాచ్‌ల్లో అంపైర్లుగా అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించడం ఓ మేలిమలుపుగా మిగిలిపోతుంది.

పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ లకూ మహిళలే అంపైర్లుగా, మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే రోజు ఎంతో దూరం లేదు. సవాలుతో కూడుకొన్న పురుషుల విధులను ఫుట్ బాల్, క్రికెట్ మైదానాలలో నిర్వర్తిస్తున్న మహిళా రిఫరీలు, అంపైర్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.!

First Published:  12 Dec 2022 3:44 AM GMT
Next Story