Telugu Global
Sports

చీక‌టి ఖండానికి వెలుగురేఖ మొరాకో!

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో మొరాకో సరికొత్త చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్ చేరిన ఆఫ్రికాఖండ తొలి దేశంగా రికార్డుల్లో చేరింది. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ పై ఒకే ఒక్క గోల్‌తో సంచలన విజయం సాధించింది.

చీక‌టి ఖండానికి వెలుగురేఖ మొరాకో!
X

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో మొరాకో సరికొత్త చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్ చేరిన ఆఫ్రికాఖండ తొలి దేశంగా రికార్డుల్లో చేరింది. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ పై ఒకే ఒక్క గోల్‌తో సంచలన విజయం సాధించింది.

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లలో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేవరెట్ జట్లు ఒక్కోటీ ఇంటిదారి పడుతున్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు విజేత బ్రెజిల్ కు క్రొయేషియా షాకిస్తే.. మూడో క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ ను ఆఫ్రికా సంచలనం మొరాకో కంగు తినిపించింది.

పోర్చుగల్ కు గుండెకోత..

ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న పట్టుదలతో బరిలో నిలిచిన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టుకు క్వార్టర్ ఫైనల్లోనే అనుకోని ఓటమి ఎదురయ్యింది. ఆఫ్రికన్ థండర్ మొరాకో ఒకే ఒక్క గోల్‌తో నెగ్గడం ద్వారా పోర్చుగల్ కు గుండెకోతను మిగిల్చింది. దోహాలోని అల్ తుమామా స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో పవర్ ఫుల్ పోర్చుగల్ కు ఆట మొదటి భాగం నుంచే మొరాకో డిఫెండర్లు వ్యూహాత్మకంగా ఆడుతూ పగ్గాలు వేశారు. తమ గోల్ వైపునకు చొచ్చుకు రాకుండా అడుగడుగునా అడ్డుకొన్నారు.

దీనికితోడు పోర్చుగల్ కెప్టెన్, స్ట్ర‌యికర్ క్రిస్టియానో రొనాల్డోను ఆట మొదటి భాగం 50 నిముషాలు సబ్ స్టిట్యూట్ గా బెంచ్ కే పరిమితం చేయడం కూడా మొరాకోకు కలసి వచ్చింది. డిఫెన్స్ ఆడుతూనే ఎదురుదాడులతో మొరాకో ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసింది. ఆట మొదటి భాగం 42వ నిముషంలో ఎన్ నెసిరీ సాధించిన హెడ్డర్ గోల్ తో మొరాకో 1-0 తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత నుంచి ఈక్వలైజర్ కోసం పోర్చుగల్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే పోర్చుగీసు ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను మొరాకో డిఫెండర్లు వమ్ము చేశారు.

ఆట రెండో భాగంలో సబ్ స్టిట్యూట్ గా స్టార్ స్ట్ర‌యికర్ క్రిస్టియానో రొనాల్డోను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. తనజట్టులోని ముగ్గురు ప్రధాన డిఫెండర్లు గాయాలతో అందుబాటులో లేకున్నా మొరాకో ప్రత్యర్థిని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. తన 1-0 గోల్ ఆధిక్యాన్ని కడవరకూ కాపాడుకోగలిగింది. గోల్స్ సాధించడానికి లభించిన పలు అవకాశాలను పోర్చుగల్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. తన కెరియర్ లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న 37 సంవత్సరాల క్రిస్టియానో రొనాల్డో సైతం తనజట్టును ఆదుకోలేకపోయాడు. చివరకు 0-1తో మొరాకో చేతిలో పోర్చుగల్ కు పరాజయం తప్పలేదు.

సంచలనాల హ్యాట్రిక్..

ఉత్తర ఆఫ్రికా ఖండ దేశమైన మొరాకో ప్రస్తుత ప్రపంచకప్ లో సంచలన విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. గ్రూప్ లీగ్ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను, ప్రీ- క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ స్పెయిన్ ను కంగు తినిపించిన మొరాకో..క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్ నే పడగొట్టింది.

క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ జట్టే ఆధిపత్యం ప్రదర్శించినా.. విజయం మాత్రం వీరోచితంగా పోరాడిన మొరాకోనే వరించింది. ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన ఆఫ్రికాఖండ తొలిదేశంగా మొరాకో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తో మొరాకో తలపడనుంది. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ గ్రూప్ లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ ఐదుమ్యాచ్ లు ఆడిన మొరాకో ప్రత్యర్థిజట్లకు ఒక్క గోల్ మాత్రమే ఇవ్వడం విశేషం.

పోర్చుగల్ పై విజయంతో మొరాకో ఆటగాళ్లు కేరింతలు కొడుతూ గాల్లో తేలిపోతే.. పరాజయంతో పోర్చుగల్ ఆటగాళ్ళు కన్నీరుమున్నీరయ్యారు.

First Published:  11 Dec 2022 6:23 AM GMT
Next Story