Telugu Global
Sports

ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా

ప్రపంచకప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు రెండుసార్లు విజేత అర్జెంటీనా దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ పై పెనాల్టీ షూటౌట్ విజయంతో టైటిల్ కు మరింత చేరువయ్యింది.

ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా
X

ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా

ప్రపంచకప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు రెండుసార్లు విజేత అర్జెంటీనా దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ పై పెనాల్టీ షూటౌట్ విజయంతో టైటిల్ కు మరింత చేరువయ్యింది...

2022 ఫిఫా ప్రపంచకప్ లో లాటిన్ అమెరికా ఆశాకిరణం అర్జెంటీనా టైటిల్ రౌండ్ కు మరింత చేరువయ్యింది. దోహాలోని లూసెయిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 4-3 గోల్స్ తో నెదర్లాండ్స్ ను అధిగమించింది.

మెస్సీ మ్యాజిక్...

పవర్ ఫుల్ నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన ఈ కీలక పోరులో అర్జెంటీనా మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు లయనల్ మెస్సీ నాయకుడిగా తనజట్టును ముందుండి నడిపించాడు. తన కళాత్మక పాసింగ్, డ్రిబ్లింగ్ తో డచ్ డిఫెన్స్ ను ఊపిరితీసుకోనివ్వకుండా చేశాడు.

మొత్తం 88వేల 235 మంది అభిమానులు హాజరైన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా తొలిగోల్ సాధించడంలో మెస్సీ తనవంతు పాత్ర పోషించాడు. డచ్ డిఫెండర్లను తప్పించి మెస్సీ తెలివిగా అందించిన పాస్ ను నబ్యుల్ మోలినా గోల్ గా మలచడం ద్వారా అర్జెంటీనాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత నుంచి అర్జెంటీనా జోరే కొనసాగింది.

ఆట 73వ నిముషంలో అర్జెంటీనాకు లభించిన పెనాల్టీ కిక్ ను కెప్టెన్ మెస్సీ గోల్ గా మలచడం ద్వారా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

నెదర్లాండ్స్ డబుల్ కిక్..

అర్జెంటీనా విజయం ఖాయమనుకొన్న తరుణంలో నెదర్లాండ్స్ వెంటవెంటనే రెండుగోల్స్ సాధించడం ద్వారా మ్యాచ్ మరో మలుపు తిరిగింది. ఆట మరో 7 నిముషాలలో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ ఆటగాడు వుట్ వెగ్ హార్స్ట్ గోల్ వెంట గోల్ సాధించడంతో..ఆటను ఎక్స్ ట్రా టైమ్ కు పొడిగించారు. అదనపు సమయంలో ఏజట్టు గోల్ సాధించలేకపోడంతో స్కోరు 2-2తోనే ఉండిపోయింది. దీంతో విజేత ను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ ను పాటించారు.

అర్జెంటీనా మ్యాచ్ విన్నర్ ఎమిలియానో....

పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ మ్యచ్ విన్నర్ గా నిలిచాడు. డచ్ ఆటగాళ్లు వాన్ జిక్, బెర్గూస్ ల స్పాట్ కిక్ లను అర్జెంటీనా గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకొన్నాడు. మరోవైపు..అర్జెంటీనా తరపున మెస్సీ తన పెనాల్టీని గోల్ గా మలిచాడు. చివరకు అర్జెంటీనా 4-3 గోల్స్ తో నెగ్గడం ద్వారా సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

గ్రూప్ లీగ్ నుంచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ వరకూ అలవోక విజయాలు సాధిస్తూ వచ్చిన నెదర్లాండ్స్ జట్టు పోటీ క్వార్టర్స్ లోనే ముగిసింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుత ప్రపంచకప్ టైటిల్ రేస్ లో మిగిలిన ఏకైక లాటిన్ అమెరికాజట్టు అర్జెంటీనా మాత్రమే కావడం విశేషం. ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన రికార్డు అర్జెంటీనాకు ఉంది.

మిగిలిన రెండుక్వార్టర్ ఫైనల్ పోటీలలో ఇంగ్లండ్ తో ఫ్రాన్స్, పోర్చుగల్ తో మొరాకో పోటీపడనున్నాయి.

First Published:  10 Dec 2022 6:58 AM GMT
Next Story