Telugu Global
Sports

అభిమానులూ..కాస్త ఓపిక పట్టండి - హార్థిక్ పాండ్యా!

మొహాలీ వన్డేలో 208 పరుగుల భారీస్కోరు సాధించి మరీ తమజట్టు పరాజయం చవిచూడటాన్ని ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గట్టిగా సమర్థించాడు. అభిమానులను కాస్త ఓర్పు వహించాలంటూ వేడుకొన్నాడు.

Hardik Pandya
X

హార్దిక్ పాండ్యా

మొహాలీ వన్డేలో 208 పరుగుల భారీస్కోరు సాధించి మరీ తమజట్టు పరాజయం చవిచూడటాన్ని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గట్టిగా సమర్థించాడు. అభిమానులను కాస్త ఓర్పు వహించాలంటూ వేడుకొన్నాడు...

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ తొలి పోరులో ఆతిథ్య భారత్ పరాజయం పొందటాన్ని విమర్శకులు మాత్రమే కాదు..అభిమానులు సైతం ఏమాత్రం సరిపెట్టుకోలేకపోతున్నారు.

మొహాలీ వేదికగా ముగిసిన ఈ హైస్కోరింగ్ వార్ లో భారతజట్టు 208 పరుగుల భారీస్కోరు సాధించడంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. 71 పరుగుల నాటౌట్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేవలం 30 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 7 ఫోర్లతో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

బుమ్రా ఉండి ఉంటే.....

అయితే..208 పరుగుల భారీస్కోరును సైతం భారతజట్టు కాపాడుకోలేకపోయింది. పసలేని బౌలింగ్, చెత్తఫీల్డింగ్ తో చేజేతులా పరాజయం కొనితెచ్చుకొంది. రాహుల్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ ఫీల్డింగ్ లో దారుణంగా విఫలమయ్యారు. పలు క్యాచ్ లు జారవిడవడం ద్వారా పరాజయంలో తమవంతు పాత్ర పోషించారు.

దీనికితోడు స్పెషలిస్ట్ బౌలర్లుగా పేరుపొందిన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, చహాల్ చేతికి ఎముకలేదన్నట్లుగా భారీగా పరుగులు సమర్పించుకొన్నారు. కంగారూ మిడిలార్డర్ ను, ప్రధానంగా వేడ్ ను ఏమాత్రం అదుపు చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా భారీవిజయలక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికే సాధించడం భారత అభిమానులకు ఆగ్రహాన్నితెప్పించింది. సరైన బౌలర్లు లేకనే పరాజయం పొందామని కెప్టెన్ రోహిత్ శర్మ వాపోయాడు.

తమ తురుపుముక్క జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని మ్యాచ్ అనంతరం హార్థిక్ పాండ్యా చెప్పాడు. తమ బౌలింగ్ ఎటాక్ కు బుమ్రా వెన్నెముకవంటి వాడని, గాయం నుంచి కోలుకొని వచ్చిన బుమ్రాకు పూర్తిగా కోలుకోడానికి తగిన సమయం ఇవ్వాల్సిన బాధ్యత తమపైన ఉందంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు.

దేశంలోని 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లనే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు కోసం ఎంపిక చేశారంటూ పాండ్యా గుర్తు చేశాడు.

తమ బౌలింగ్ ఎటాక్ పై పూర్తి నమ్మకం ఉందని, ఆటలో వైఫల్యం కూడా ఓ భాగమేనని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలని పాండ్యా పిలుపునిచ్చాడు.

వ్యక్తిగతంగా తన ప్రదర్శన సంతృప్తినిచ్చిందని, గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ వస్తున్నానని..అయితే తనతో పాటు జట్టులోని మిగిలిన ఆటగాళ్లందరికీ జట్టు విజయమే ప్రధానమని తెలిపాడు.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ప్రస్తుత మొహాలీ మ్యాచ్ వరకూ 24సార్లు తలపడిన భారత్ కు ఇది పదో పరాజయం మాత్రమే. 13 విజయాలతో కంగారూలపైన ఇప్పటికీ భారత్ దే పైచేయిగా ఉంది.

భారత్ ప్రత్యర్థిగా 200కు పైగా పరుగుల భారీలక్ష్యాన్ని ఆస్ట్ర్రేలియా సాధించడం ఇదే మొదటిసారి. సిరీస్ లోని రెండో టీ-20 నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

First Published:  21 Sep 2022 6:43 AM GMT
Next Story