Telugu Global
Sports

ఒక్కరోజులో 23 వికెట్ల పతనం..147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే మొదటిసారి!

147 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ రికార్డు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో చోటు చేసుకొంది.

ఒక్కరోజులో 23 వికెట్ల పతనం..147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే మొదటిసారి!
X

147 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ రికార్డు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో చోటు చేసుకొంది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండుమ్యాచ్ ల సిరీస్ ఫాస్ట్ బౌలర్ల షోగా సాగుతోంది. సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టులో భారత్ మూడోరోజుల్లోనే ఇన్నింగ్స్ ఓటమి పాలైతే..కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.

ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలడంతో పాటు...రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 62 పరుగుల స్కోరుతో నిలిచింది.

బౌన్సీ పిచ్ పై పేసర్ల హవా!

ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై భారత బ్యాటర్ల బలహీనతను సొమ్ము చేసుకోడానికి ఆతిధ్య దక్షిణాఫ్రికా వరుసగా రెండోటెస్టులో సైతం అదే తరహా పిచ్ ను సిద్ధం చేసి..

ప్రత్యర్థికోసం తీసిన గోతిలో తానే పడింది.

సిరీస్ ను 1-1తో సమం చేయాలంటే భారత్ నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

అయితే ..భారత పేసర్ల ముప్పేటదాడితో దక్షిణాఫ్రికా భోజనవిరామానికి ముందే తొలిఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది.

1937 తరువాత టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా తొలిరోజుఆట లంచ్ విరామానికి ముందే కేవలం 55పరుగులకే ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. భారత పేసర్లలో

మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు, బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. మిగిలినవారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 9 ఓవర్లలో 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తన టెస్టు కెరియర్ లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం సిరాజ్ కు ఇది మూడోసారి మాత్రమే.

ఓ బ్యాటర్ సెంచరీ సాధిస్తే ఎంత గొప్పో..ఓ బౌలర్ 5 వికెట్లు పడగొడితే అంతే గొప్పగా పరిగణిస్తారు.

భారత ఇన్నింగ్స్ లో 6 డకౌట్లు....

దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చిన భారత్ తన తొలిఇన్నింగ్స్ లో 153 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 46, శుభ్ మన్ గిల్ 36 మినహా మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.

ఒకదశలో 4 వికెట్లకు 153 పరుగుల స్కోరుతో పటిష్టంగా కనిపించిన భారత్..చివరి 6 వికెట్లను ఒక్క పరుగు చేయకుండా కోల్పోయి అదే స్కోరుతో ఇన్నింగ్స్ ను ముగించాల్సి వచ్చింది.

ఓపెనర్ యశస్వి, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ తమ ఖాతా తెరవకుండానే డకౌట్లుగా వెనుదిరిగారు. 14 దశాబ్దాల టెస్టు చరిత్రలో..

టెస్ట్ మ్యాచ్ తొలిరోజున ఓ జట్టుకు చెందిన ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు కావడం కూడా ఇదే మొదటిసారి.

సఫారీబౌలర్లలో రబడ, బర్గర్, లుంగి ఎంగిడి తలో మూడు వికెట్లు పడగొట్టారు.

డీన్ ఎల్గర్ అల్విదా....

ఆ తరువాత 98 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీజట్టు 3 వికెట్లకు 62పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను ముగించగలిగింది. 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతోనే రెండోరోజుఆటను కొనసాగించనుంది.

తన కెరియర్ లో చిట్టచివరి టెస్టుమ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులకే అవుటయ్యాడు. తొలిటెస్టులో 185 పరుగుల స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన ఎల్గర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

భారత్ ప్రత్యర్థిగా తన కెరియర్ లో 15 టెస్టులు ఆడిన ఎల్గర్ 2 సెంచరీలతో సహా 1000 పరుగులతో 41.66 సగటు నమోదు చేయగలిగాడు.

ఎల్గర్ మొత్తం 86 టెస్టుల్లో 14 సెంచరీలతో 5335 పరుగులు సాధించాడు. 38.10 సగటుతో తన కెరియర్ ముగించాడు. 23 హాఫ్ సెంచరీలు సైతం ఎల్గర్ కు ఉన్నాయి.

భారత పేసర్ ముకేశ్ కుమార్ బౌలింగ్ లో విరాట్ కొహ్లీ పట్టిన క్యాచ్ తో 12 పరుగుల స్కోరుకు ఎల్గర్ చిట్టచివరి టెస్టు ఇన్నింగ్స్ ముగిసింది.

ఎల్గర్ తరువాత వచ్చిన యువబ్యాటర్లు టోనీ 1, స్టబ్స్ 1 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు. మర్కరమ్ 36, బేడింగ్హామ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత పేసర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.

రెండోరోజుఆటలో సఫారీజట్టును భారత బౌలర్లు సాధ్యమైనంత తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగితే మూడోరోజుఆటలోనే మ్యాచ్ నెగ్గి సిరీస్ ను 1-1తో సమం చేసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత ఈ టెస్టుమ్యాచ్ లో ఏదైనా సాధ్యమే. ఆఖరి బంతి వరకూ ఫలితాన్ని అంచనావేయడం హాస్యాస్పదమే అవుతుంది.

First Published:  4 Jan 2024 3:15 AM GMT
Next Story